శుక్రవారం దాకా చికెన్ దొరకదు.. ఎందుకో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో గురువారం మాంసం అమ్మకాలపై నిషేధం వుంది. కాబట్టి మీకు చికెన్, మటన్ ఎక్కడా దొరకదు... ఎక్కడైనా నాన్ వెజ్ అమ్మితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. అసలు ఎందుకు నాన్ వెజ్ దొరకదో తెలుసా?

Tomorrow Meat Sales Banned
Hyderabad : మీరు నాన్ వెజ్ ను బాగా ఇష్టపడతారా? ముక్క లేనిదే ముద్ద నోట్లోకి వెళ్లదా? ప్రతిరోజు చికెన్, మటన్ లాగించేస్తుంటారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. రేపు గురువారం (జనవరి 30) మీకు చాలా కష్టంగా గడుస్తుంది. ఎందుకంటే రేపు తెలుగు రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలను నిలిపివేసాయి ఇరు ప్రభుత్వాలు. ఈ మేరకు అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి. కాబట్టి రేపు తెలుగు రాష్ట్రాల్లో మాంసం దుకాణాలన్ని మూతపడనున్నాయి.
రేపు స్వాతంత్య్ర సమరయోధులు, మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. జీవితాంతం అహింసా సిద్దాంతాన్ని పాటించిన ఆ మహనీయుడి వర్థంతి నేపథ్యంలో ఈ ఒక్కరోజు జీవహింస జరక్కుండా చూడాలని తెలుగు ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందువల్లే మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు.
Tomorrow Meat Sales Banned
హైదరాబాద్ లో మాంసం అమ్మారో అంతే సంగతి :
గాంధీజీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న హైదరాబాద్ నగరంలో ఎలాంటి మాంసం విక్రయాలు చేపట్టరాదని జిహెచ్ఎంసి ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని అన్ని మాంసం దుకాణాలను రేపంతా మూసివేసి వుంచాలని... ఎక్కడా కోళ్ళు, మేకలు, గొర్రెలతో పాటు ఇతర జంతువులను కోయరాదని హెచ్చరించారు. ఈ మేరకు జిహెచ్ఎంసి కమీషనర్ ఆదేశాలు జారీ చేసారు.
తమ ఆదేశాలను అతిక్రమించి జంతువులను వధిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిహెచ్ఎంసి హెచ్చరించింది. మాంసం దుకాణాలను తెరిచివుంచి విక్రయాలు చేపడితే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. జిహెచ్ఎంసి సిబ్బంది, పోలీసులు సమన్వయంతో గురువారం నగరంలో మాంసం విక్రయాలు జరక్కుండా చూసుకుంటారని నగర కమీషనర్ పేర్కొన్నారు.
శివారు ప్రాంతాల్లో రహస్యంగా జంతువులను వధించినా చర్యలుంటాయని హెచ్చరించారు. కేవలం నగరంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా మాంసం విక్రయాలు జరక్కుండా పోలీసులు, అధికారులు నిఘా వుంచుతారు... ఎవరైనా విక్రయిస్తూ పట్టుబడితే చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ ఒక్కరోజు చికెన్, మటన్ షాపులవారు మాంసం అమ్మకాలు అస్సలు చేపట్టకూడదు.
Tomorrow Meat Sales Banned
ఏపీలోనూ మాంసం విక్రయాలపై నిషేధం :
జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్థంతి సందర్భంగా తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మాంసం విక్రయాలపై నిషేధం వుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో రేపు మాంసం అమ్మకాలు చేపట్టకూడదని ప్రభుత్వం ఆదేశించింది. జాతిపిత జ్ఞాపకార్థం ఈ ఒక్కరోజు జంతుహింస లేకుండా అహింసా మార్గాన్ని అనుసరించాలని ప్రజలకు సూచించారు.
ఇలా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ విక్రయాలు నిలిపివేయడంతో రోజూ నాన్ వెజ్ తినేవారు కాస్త ఇబ్బందిపడాల్సి వుంటుంది. అలాకాదని ప్రభుత్వ ఆదేశాలను ఉళ్ళంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుంది. కాబట్టి రేపు ఒక్కరోజు నోటిని అదుపులో పెట్టుకుని పూర్తి వెజిటేరియన్ గా మారడం మంచిది.