- Home
- Telangana
- బెట్టింగులకు అలవాటు పడి.. భార్యతోనే స్నేహితుడికి హనీట్రాప్.. లక్షలు దోచుకుని.. చివరికి...
బెట్టింగులకు అలవాటు పడి.. భార్యతోనే స్నేహితుడికి హనీట్రాప్.. లక్షలు దోచుకుని.. చివరికి...
భార్యతోనే స్నేహితుడికి వలపు వల వేశాడో భర్త. చివరికి స్నేహితుడికి అసలు విషయం తెలియడంతో అరెస్టై జైల్లో పడ్డాడు.

నల్గొండ : ఓ వ్యక్తి స్నేహితుడు మీదికి భార్యను ఉసిగొలిపాడు. ఆమెతో వలపువల వేయించి.. మోసంతో రూ. 30 లక్షల వరకు కాజేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. వ్యసనాలకు బానిసైన భార్యాభర్తలు ఈ దారుణానికి ఒడిగట్టారు.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బుధవారం నాడు వెలుగు చూసింది. గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన సట్టు నారాయణ అనే వ్యక్తికి నేరేడుచర్లకు చెందిన గడ్డం భారతి అనే యువతి పరిచయమైంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
నారాయణ క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. దీంతో ఈ వ్యసనానికి డబ్బులు ఎక్కువ మొత్తంలో అవసరమయ్యాయి. ఈజీ మనీ కోసం ఏం చేయాలో అర్థం కాని నారాయణ.. భార్యని వాడుకోవాలనుకున్నాడు.
దొంగల సతీష్ అని అదే గ్రామానికి చెందిన ఓ అమాయకున్ని ఎంచుకున్నాడు. తన భార్య భారతిని సంధ్య అనే పేరుతో సతీష్ కి పరిచయం చేసి మోసానికి తెరలేపాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. సతీష్ నుంచి డబ్బులు కాజేయడం మొదలుపెట్టారు.
అలా గత నాలుగేళ్లుగా రూ.30 లక్షల రూపాయలు సతీష్ నుంచి బెదిరించి తీసుకున్నారు. ఇటీవల తాను మోసపోయిన విషయం గ్రహించిన సతీష్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం అంతా పోలీసులకు వివరించాడు. నారాయణ, భారతీ తనను ఎలా మోసం చేసింది వివరించాడు.
వారిద్దరు భార్యాభర్తలు అయి ఉండి.. తనను ప్రేమ పేరుతో మోసం చేశారని తెలిపాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బుధవారం నాడు మిర్యాలగూడ దగ్గర నారాయణ, భారతిలను అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి రూ.13వేల నగదు, బైక్, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ కు తరలించామని ఎస్.ఐ. లింగయ్య తెలిపారు.