కేటిఆర్ కాదు... కవిత అసలు టార్గెట్ ఆ ఇద్దరే
తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఆమె సొంత కుంటుంబసభ్యులపై ఇటీవల పరోక్ష కామెంట్స్ చేయగా… తాజాగా ఓపెన్ అయిపోయారు. ఆమె ఎవర్ని టార్గెట్ చేస్తున్నారో తెలుసా?

కేసీఆర్ ఎటువైపు... బిడ్డలవైపా? మేనల్లుడి వైపా?
KCR Family Politics : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కుటుంబ రాజకీయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ సీటుకోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్నారని... కానీ ఆయన ఆ సీటును వదలడంలేదని సీఎం అన్నారు. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే మాజీ ఎంపీ, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా చేశారు. గతంలో కేసీఆర్ వెంటవుండేవారు తనపై కుట్రలు చేశారన్న కవిత తాజాగా అది హరీష్ రావు, సంతోష్ రావులే అని బైటపెట్టారు. ఇలా సీఎం రేవంత్, కేసీఆర్ కూతురు కవిత వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు గురించి చర్చ మొదలయ్యింది... నిజంగానే ఆయన కేటీఆర్, కవితను సైడ్ చేసి బిఆర్ఎస్ పగ్గాలు దక్కించుకోవాలని చూస్తున్నారా? అందుకే మామకు దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారా? చివరకు కాళేశ్వరం నిందకూడా తనమీద వేసుకుని మామ మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
అయితే కేసీఆర్ కూతురు వ్యవహారంపై స్పందించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. కవిత పదేపదే తండ్రి వెంట ఉండేవారే తనపై కుట్రలు చేస్తున్నారని అంటున్నా కేసీఆర్ మౌనం వీడటంలేదు... అంటే పరోక్షంగా ఆయన మేనల్లుడు హరీష్ రావు పక్షానే ఉన్నాడని అర్థమవుతోందని ఓ వర్గం వాదన. వారి వాదనలోనూ బలముంది... కవిత పదేపదే తనపై కుట్రలు జరుగుతున్నాయంటున్నారు... గతంలో కేసీఆర్ వెంట ఉండేవారే ఈ పని చేస్తున్నారని ఆరోపించారు. అప్పుడే హరీష్ రావు, సంతోష్ రావులనే కవిత టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది... కానీ కేసీఆర్ ఈ వ్యవహారంపై స్పందించలేదంటేనే ఆయన కూతురు వైపు కాదు మేనల్లుడి వైపు ఉన్నాడనే ప్రచారం జరిగింది.
తనపై కుట్రలు చేసింది ఆ ఇద్దరే..: కవిత
తాజాగా కవిత మరో అడుగు ముందుకేసి సంతోష్ రావు, హరీష్ రావులే తనపై కుట్రలు చేస్తున్నారని పేర్లతో సహా బైటపెట్టారు. ఇప్పుడు కూడా కేసీఆర్ స్పందించలేదంటే ఆయన ఎటువైపో క్లారిటీ వస్తుంది. కవితకు మద్దతిస్తే హరీష్, సంతోష్ లపై చర్యలుంటాయి... అలా జరిగే అవకాశాలు కనిపించడంలేదు. ఎందుకంటే అలా చేయాలంటే కవిత లేటర్ బైటికి వచ్చిన సమయంలోనే చర్యలుండేవి. అలా జరగలేదంటే హరీష్, సంతోష్ సేఫ్ అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే పార్టీ లైన్ దాటి సొంతపార్టీ నాయకులపై, అదీ తన వెంట ఉండే నాయకులపై ఆరోపణలు చేస్తున్న కూతురు కవితపైనే కేసీఆర్ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి కేసీఆర్ ఇప్పటికైనా కవిత వ్యవహారంపై స్పందిస్తారో లేదో చూడాలి... అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఎప్పట్నుంచో ఆరోపిస్తోంది. ఇక అధికారంలో వచ్చాక ఈ ప్రాజెక్టుపై న్యాయ నిపుణులు జస్టిస్ పిసి ఘోష్ తో విచారణ చేయించారు... ఈ కమీషన్ నివేదిక కూడా ఇచ్చింది. దీనిపై రేవంత్ కేబినెట్ చర్చించడమే కాదు తాజాగా అసెంబ్లీలో దీనిపై చర్చించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం వ్యవహారంపై మరింత పారదర్శకత కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణకు అప్పజెప్పాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో మరోసారి కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కు అవినీతి మరక ఎలా వచ్చింది బిఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలని... ఆయన పక్కన ఉండేవారివల్లే ఈ మరక అంటించారని కవిత అన్నారు. కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావుతో పాటు మరికొందరి పాత్ర ఉందన్నారు. వీరివల్లే మహా నాయకుడు కేసీఆర్ ను నేడు రేవంత్ రెడ్డి విమర్శించే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో తనపై కూడా హరీష్ రావు, సంతోష్ రావు కుట్రలు చేసినా భరించాను... కానీ ఇప్పుడు కేసీఆర్ పేరును నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేనని అన్నారు.
హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపించారు. అవినీతి అనకొండలు నిత్యం కేసీఆర్ దగ్గరుండి ఆయన పేరును బద్నాం చేశారన్నారు. తన వెనుక బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారని అన్నారు. తనది కేసీఆర్ బ్లడ్... ఎవరికోసమే పనిచేయాల్సిన అవసరం తనకు లేదు.. ఉంటే బిఆర్ఎస్ లో ఉంటా లేదంటే ఇండిపెండెంట్ గా వుంటాను అనేలా ఆమె మాట్లాడారు.
కాళేశ్వరం అవినీతంతా హరీష్ దే : కవిత
కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా..? అని ప్రశ్నించారు. వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన అవినీతి గురించి తెలిసే రెండవ టర్మ్ లో కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పై కేసులు పెట్టడం, సీబీఐ విచారణ చేయించే పరిస్థితి వచ్చిందంటే పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని కవిత అన్నారు. సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగినముత్యంలా బయటకు వస్తారన్నారు. కేసీఆర్ పై కాదు ఆయన వెంటుండి అవినీతికి పాల్పడినవారిపై రేవంత్ చర్యలు తీసుకోవాలన్నారు. తాను ఇప్పుడు డైరెక్ట్ గా అవినీతి అనకొండల పేర్లు చెప్పాను... వారిపై విచారణ చేయించాలన్నారు కవిత. వారికి వారికి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఇది జరిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కవితపై వేటు తప్పదా..?
ఇప్పటికే పలుమార్లు సొంతపార్టీ నేతలపైనే కవిత పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ వెన్నంటివుండే సంతోష్ రావు వంటి పెద్దనాయకుల పేర్లను ప్రస్తావించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
హరీష్ రావు డైనమిక్ లీడర్ : కేటీఆర్
ఓవైపు కాంగ్రెస్, మరోవైపు కవిత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలకు హరీష్ రావు కారణమంటున్నారు. కవిత అయితే సొంతపార్టీ మాత్రమే కాదు సొంత కుటుంబసభ్యుడైన హరీష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ ఏ స్టాండ్ తీసుకుంటుందన్నదే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. కానీ బిఆర్ఎస్ పార్టీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హరీష్ రావు అసెంబ్లీ మాట్లాడిన తీరును ప్రశంసించారు... 'ఆరడుగుల బుల్లెట్' 'సింహం సింగిల్ గా వస్తుంది' అని బిఆర్ఎస్ ట్వీట్ చేయగా... 'ఇది మా డైనమిక్ లీడర్ హరీష్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్' అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కవిత ఓవైపు హరీష్ అవినీతిపరుడంటూ చేసిన కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారా అనేలా ఆయన ట్వీట్ ఉంది.
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL— KTR (@KTRBRS) September 1, 2025