Kalvakuntla Kavitha: కేసీఆర్ ఫోటో లేకుండానే.. కవిత జిల్లాల యాత్ర..
Kalvakuntla Kavitha: ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి.. కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే జిల్లాల యాత్ర చేయనున్నారు. మరి ఆ వివరాలు ఏంటి.? ఈ స్టోరీలో తెలుసుకుందామా..!

ఒంటరిగానే పోరాటం..
బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత.. కాస్త విరామం తీసుకుని కల్వకుంట్ల కవిత మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. కాంగ్రెస్, బీజేపీలలోకి కవిత వెళ్తారని రూమర్స్ వచ్చినప్పటికీ.. ఆమె ఆ వార్తలను ఖండించింది. తెలంగాణలో ఒంటరిగానే పోరాటం సాగిస్తానని మరోసారి ప్రకటించిందామె. ఈ పరిణామాల నడుమ కవిత రాష్ట్రవ్యాప్తంగా తొలి రాజకీయ యాత్రను ప్రారంభించబోతున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
33 జిల్లాల యాత్రకు కవిత..
ఈ నెలాఖరు నాటికి కల్వకుంట్ల కవిత తెలంగాణ అంతటా రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ యాత్ర కోసం ప్రణాళికలు సిద్దం చేయాలని ఆమె తన మద్దతుదారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ప్రజలతో పాటు రాజకీయ నిపుణులతోనూ చురుకుగా సమావేశాలు నిర్వహిస్తోంది.
కేసీఆర్ ఫొటో లేకుండానే..
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆమె తొలిసారిగా తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే ఈ యాత్ర సాగించనున్నారు. కేసీఆర్ బదులుగా ఈ ప్రచారంలో ప్రొఫెసర్ జై శంకర్ ఫోటోను ఉపయోగిస్తారని సమాచారం. ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ.. 'నైతికంగా కరెక్ట్ కాదనే కేసీఆర్ ఫోటో తీసేస్తున్నట్టు' ఆమె అన్నారు. ఇద్దరు దారులు వేరన్నప్పుడు తన దారి తాను చూసుకోవాలని కవిత చెప్పారు.
కవిత వ్యక్తిగత పర్యటన
జాగృతి జనం బాట పేరుతో కవిత ఈ యాత్రకు శ్రీకారం చుట్టనుంది. నాలుగు నెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి జిల్లాలోనూ రెండు రోజులు బస చేయనున్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడనున్నారు. సామాజిక తెలంగాణ కోసం ఏం చేయాలనే విషయాలపై ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు.
తొలి రాజకీయ యాత్రపై ఉత్కంఠ
ఇది కవిత వ్యక్తిగత పర్యటన కాగా.. ఇందులో ఆమె తన తండ్రి అంశాన్ని ప్రస్తావించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇలా కేసీఆర్ ఫోటోలు లేకుండానే కవిత ప్రచారం దిగితే.. బీఆర్ఎస్ మద్దతుదారులు దాన్ని ఎలా తీసుకుంటున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ బహిష్కరించిన తర్వాత ఇది కవితది తొలి రాజకీయ యాత్ర.. దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. కవిత క్షేత్రస్థాయిలో ఏమేరకు రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తుందో వేచి చూడాలి.