Telangana: జూబ్లీహిల్స్ బైపోల్‌లో వారే కీలకం.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే.?
Telangana: జూబ్లీహిల్స్ బైపోల్‌కు నోటిఫికేషన్ వచ్చేసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14న ఉపఎన్నిక ఫలితాలు విడుదల కానున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

మోగిన ఎన్నికల నగారా
తెలంగాణలో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని తమ అస్త్రశ్రస్తాలను సిద్దం చేస్తున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికల్లో 30 నుంచి 39 ఏళ్ల వయసు గల ఓటర్ల పాత్ర నిర్ణయాత్మకంగా మారనుందని తెలుస్తోంది.
ఆ ఓటర్లే కీలకం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తంగా ఉన్న ఓటర్లను పరిశీలిస్తే.. ప్రస్తుతం 3.98 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో దాదాపు 97,000 మంది 30–39 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. దీని అర్థం జూబ్లీహిల్స్‌లోని ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు ఈ వయస్సుకు చెందినవారే. దీని బట్టి చూస్తే ఉపఎన్నికను ఆ వయస్సు గల ఓటర్లు కచ్చితంగా ప్రభావితం చేయనున్నారు. ఈ కీలక ఓటర్లు ఓటింగ్ ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయగలరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఓటర్ల లిస్టు ఎలాగుందంటే.?
నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాలు, ఉపాధి, నల్లా కనెక్షన్లు వంటి సమస్యలపై ఈ ఓటర్లు దృష్టి సారించనున్నారు. ఇక 40–49 సంవత్సరాల వయస్సు గలవారు 87,492 మంది ఉండగా.. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య దాదాపు 21.9 శాతంగా ఉంది. 50–59 సంవత్సరాల వయస్సు గల 67,703 మంది ఓటర్లు, 60 నుంచి 79 సంవత్సరాల వయస్సు గల 56,000 మంది ఉన్నారు.
ప్రధాన పార్టీల ఫోకస్
20-29 సంవత్సరాల వయస్సు గల యువ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే.. జూబ్లీ హిల్స్‌లో 72,000 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఇక మొదటిసారి ఓటు వినియోగించుకునే 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గలవారు కేవలం 3 శాతం మాత్రమే ఓటర్లు ఉన్నారు. కాబట్టి కచ్చితంగా మూడు పార్టీలు 30–39 సంవత్సరాల వయస్సు గలవారిని ఆకట్టుకునే పనిలో ఉంటాయి.
అవగాహన కార్యక్రమాలు..
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్యను పెంచే ప్రయత్నంలో ఉంది ఎన్నికల కమిషన్. పోలింగ్ తేదీ గురించి ఓటర్లకు సరైన సమాచారం అందేలా అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఈసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు, ప్రాంతాలవారీగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు.