జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రంగం సిద్ధం.. డ్రోన్ల నిఘా.. పార్టీల్లో ఉత్కంఠ
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 139 ప్రాంతాల్లో డ్రోన్ మానిటరింగ్, 407 కేంద్రాల్లో ఓటింగ్, మూడు స్థాయిల భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఉత్కంఠ
తెలంగాణలో రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 2025లో జరుగుతున్న పెద్ద ఉప ఎన్నికగా ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన సీటుకు ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.
మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యన ఉంది.
డ్రోన్ల నిఘాతో గట్టి భద్రతా చర్యలు
ఈసారి ఎన్నికల్లో డ్రోన్ టెక్నాలజీ ద్వారా భద్రతా పర్యవేక్షణ చేపడుతున్నారు. 139 పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లు వినియోగించనున్నారు. ప్రతి డ్రోన్ నుంచి వచ్చే లైవ్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్‌లో మానిటరింగ్ చేస్తారు. ఇది తెలంగాణ ఎన్నికల చరిత్రలో తొలిసారి జరుగుతోంది.
హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. "ఈసారి డ్రోన్లతో పాటు పారామిలిటరీ బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్సులు, మొబైల్ టీమ్స్, వెబ్‌కాస్టింగ్ వ్యవస్థలు అమల్లో ఉంటాయి. పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది" అని తెలిపారు. మొత్తం 1,761 మంది పోలీసులు, ఎనిమిది కంపెనీల సీఐఎస్ఎఫ్ బలగాలు బందోబస్తులో ఉన్నాయన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ఎంత మంది ఓటర్లు ఉన్నారు? పోలింగ్ కేంద్రాల వివరాలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2,08,561 మంది మహిళలు, 1,92,779 మంది పురుషులు, 25 మంది ఇతరులు ఉన్నారు.
407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి బూత్‌కు సగటున 986 ఓటర్లను కేటాయించారు. 18–19 ఏళ్ల మధ్య వయసు గల 6,859 మంది యువ ఓటర్లు, అలాగే 85 ఏళ్ల పైబడిన 2,134 మంది వృద్ధులు కూడా ఉన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. “సజావుగా పోలింగ్ జరగడానికి మూడు స్థాయిల భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ హక్కును వినియోగించుకుంటారని” అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
పోలింగ్ ప్రభావితం కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై కఠిన నిషేధం విధించింది. ఈ నిషేధం నవంబర్ 11 సాయంత్రం 6.30 గంటల వరకు అమల్లో ఉంటుంది.
ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. “న్యూస్ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు ఈ నిషేధాన్ని పాటించాలి. ఉల్లంఘన జరిగితే ప్రజాప్రతినిధుల చట్టం 1951 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు” అని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ఎన్నికల వ్యవస్థలో సాంకేతికత
ఈ ఎన్నికలో సాంకేతికత వినియోగం విస్తృతంగా ఉంది. ఈసీఐఎల్ ఇంజనీర్లు, ఈవీఎం మేనేజ్‌మెంట్ టీమ్స్, వెబ్‌కాస్టింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రతి బూత్‌లో కెమెరాలు, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు, లైవ్ సర్వైలెన్స్ అమల్లో ఉన్నాయి.
515 ప్రెసైడింగ్ ఆఫీసర్లు, 515 అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులు విధుల్లో ఉన్నారు. కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్క నియోజకవర్గానికి పరిమితమైనప్పటికీ, ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద పరీక్షగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇది ఓ పరీక్షగా మారగా, బీఆర్ఎస్, బీజేపీలు తమ బలాన్ని పరీక్షించుకోనున్నాయి.