- Home
- Telangana
- IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు ఆవర్తనాలు... ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు ఆవర్తనాలు... ఈ ప్రాంతాల్లో ఇక అల్లకల్లోలమే
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి, మధ్యాహ్నం అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండ, సాయంత్రం వర్షం… ఇలా ఒక్కరోజులు విభిన్న వాతావరణ పరిస్ధితులు ఉంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల వాతావరణం
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడంలేదు. రుతుపవనాలు నిష్క్రమిస్తూ వర్షాకాలం ముగిసినా వర్షాలు మాత్రం కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు వంటివి ఏర్పడి వర్షాలకు అనుకూల వాతావరణ పరిస్ధితులను ఏర్పరుస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో సెప్టెంబర్ లో మాదిరిగా కుండపోత వానలు కాకున్నా మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రెండు ఉపరితల ఆవర్తనాలు
నేడు ( అక్టోబర్ 14, బుధవారం) ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ కేంద్రం ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వెల్లడించారు. దీంతోపాటు నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
నేడు ఏపీలో భారీ వర్షాలు
రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో నేడు ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్ష సమయంలో చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది.
అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్ధ వెల్లడించింది. వర్షాలతో పాటు ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండనుందని ఏపిఎస్డిఎమ్ఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
నేడు తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణ విషయానికి వస్తే నేడు (మంగళవారం) ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక రేపు, ఎల్లుండి (అక్టోబర్ 15,16) పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగామ, హన్మకొండ, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నయని ప్రకటించింది. ఈ మూడ్రోజులు హైదరాబాద్ లో పొడి వాతావరణమే ఉంటుందని.. సాయంత్రం సమయాల్లో కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో అత్యధిక వర్షాలు కురిసిన ప్రాంతాలివే..
తెలంగాణలో సోమవారం అత్యధికంగా కొత్తగూడెం జిల్లా మణుగూరులో 128.4 అశ్వారావుపేటలో 110.6, గుండాలలో 106.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అలాగే భువనగిరి జిల్లా ఆత్మకూరులో 125, మహబూబాబాద్ లో 109.6 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
తెలంగాణను వణికిస్తున్న చలి
ఇక తెలంగాణలో ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... మెదక్ జిల్లాలో అత్యల్పంగా 18.1, పటాన్ చెరు 19.8 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అన్నిజిల్లాల్లోనూ 20-25 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. తెల్లవారుజామున పొగమంచు కురుసి చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అత్యధికంగా భద్రాచలం జిల్లాలో 33.6 డిగ్రీ సెంటిగ్రేడ్స్ నమోదయ్యింది.