21 ఏళ్లకే ఆయన ఐపిఎస్ ... 40 ఏళ్ళకు ఆమె ఐఐటి : హైదరాబాద్ పోలీస్ బాస్ దంపతుల ఆదర్శ స్టోరీ
ఆయన 21 ఏళ్ల వయసులోనే సివిల్స్ సాధించాడు... ఆమె 40 ఏళ్ల వయసులో ఐఐటి లో చదివారు. హైదరాబాద్ పోలీస్ బాస్ దంపతుల ఆకట్టుకునే స్టోరీ ఇది.
CV Anand - Lalitha Anand
CV Anand- Lalitha : సివిల్స్ లో ర్యాంకు సాధించి ఐఏఎస్, ఐపిఎస్ కావాలని చాలామంది కోరుకుంటారు. లేదంటే ప్రతిష్టాత్మక ఐఐటి (ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ) లో చదివాలని కోరుకుంటారు. ఈ రెండిట్లో ఏది చేసినా లైఫ్ సెటిల్ అయిపోతుంది. కానీ ఈ రెండు సాధించిన ఓ జంట మన హైదరాబాద్ లోనే వున్నారు.
అత్యంత కఠినమైన సివిల్స్ సర్వీస్ ను అతి చిన్న వయసులోనే ఆయన సాధిస్తే... పిల్లలు కాలేజీలో చేరే వయసులో ఆమె ఐఐటీలో చదివారు. ఇలా ఈ దంపతులు దేశంలోనే అతి కఠినమైన పరీక్షలు రాసి అనుకున్నది సాధించారు. వీళ్ళు ఎవరో కాదు మన హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్, ఆయన భార్య లలితా ఆనంద్. వీరి గురించి ఇంకా అనేక ఆసక్తికర అంశాలున్నాయి... వాటిగురించి తెలుసుకుందాం.
CV Anand - Lalitha Anand
అండర్ 19 నుండి ఐపిఎస్ వరకు :
సివి ఆనంద్... పక్కా తెలంగాణ బిడ్డ. ఆయన స్వస్థలం హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా. అయితే ఆయన చిన్నప్పుడే కుటుంబం హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన విద్యాబ్యాసం సాగింది. చదువులోనే కాదు ఆటల్లోనూ చురుగ్గా వుండే సివి ఆనంద్ క్రికెట్ ను బాగా ఇష్టపడేవారు. స్కూల్ డేస్ లోనే క్రికెట్ పై మంచి పట్టు సాధించారు.
ఇక నిజాం కాలేజీలో డిగ్రీలో చేరిన సివి ఆనంద్ ఓవైపు చదువును మరోవైపు క్రికెట్ ను బ్యాలెన్స్ చేసారు. ఇలా ఒకే సమయంలో మంచి మార్కులతో డిగ్రీ పూర్తిచేయడంతో హైదరాబాద్ క్రికెట్ టీంలో కూడా ఆడారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) లో చేరి గోల్డ్ మెడల్ సాధించడమే కాదు హైదరాబాద్ టీం నుండి ఇండియా అండర్ 19 క్రికెట్ టీంలో చోటు దక్కించుకున్నారు.
ఇలా ఓవైపు చక్కగా చదువుకుంటూనే మరోవైపు క్రికెట్ గా ఎదుగుతున్న సమయమది. ఓ దశలో క్రికెటా? చదువా? అన్న సందిగ్ద పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో చదువువైపే ఆయన మనసు మళ్లింది. దీంతో ఎంతో ఇష్టమైన క్రికెట్ కు దూరమై యూపిఎస్సి పరీక్షలకు సిద్దమయ్యారు. ముందునుండే చదువులో బాగా చురుగ్గా వుండే సివి ఆనంద్ కు యూపిఎస్సి కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండా పోయింది. మొదటి అటెంప్ట్ లోనే ఆలిండిమా 147 ర్యాంక్ సాధించి ఐపిఎస్ అయ్యారు.
సివి ఆనంద్ ఐపిఎస్ వెనక ఆసక్తికమైన రెండు విషయాలు వున్నాయి. ఆయన అతి చిన్న వయసులోనే అంటే 21 ఏళ్లకే సివిల్స్ ర్యాంక్ సాధించి ఐపిఎస్ గా ఎంపికయ్యారు. ఆయన పోస్టింగ్ కూడా సొంతరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ (ఆనాడు ఉమ్మడిరాష్ట్రం) లో రావడం మరో విశేషం. ఇలా 1993 లో ఐపిఎస్ గా కెరీర్ ప్రారంభించిన సివి ఆనంద్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా వున్నారు.
CV Anand - Lalitha Anand
సివి లలితా ఆనంద్ :
తండ్రి లాగే కొడుకు లేదా కూతురు ఏదయినా గొప్పగా సాధిస్తే తండ్రికి తగ్గ బిడ్డ అంటారు.. కానీ సివి లలితా ఆనంద్ భర్తకు తగ్గ భార్య అనిపించుకున్నారు. సివి ఆనంద్ ఎలాగైతే బహుముఖ ప్రజ్ఞాశాలో లలిత కూడా అంతే. ఆమె కేవలం సివి ఆనంద్ భార్యగానే కాదు తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు.
భర్త, పిల్లల కోసం తన చదువును మధ్యలోనే ఆపేసిన లలిత నాలుగు పదుల వయసులో మళ్లీ పుస్తకం చేతపట్టారు. ఏదో సరదాకో, టైంపాస్ కోసమో చదవడం కాదు... ఏకంగా దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్‌డి) పూర్తిచేసారు, ఇండియన్ స్కైల్ ఆఫ్ బిజెనెస్ (ఐఎస్‌బి)లో మ్యాథమెటిక్ స్టాటిస్టిక్స్ రిసెర్చర్ గా చేరి అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసారు.
లలితా ఆనంద్ కు చిన్నప్పటి నుండి మన సాంప్రదాయ నృత్యాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేర్చుకునే ప్రయత్నంచేసి చదువు కోసం ఆపేసారు. అయితే మళ్లీ ఈ వయసులో నాట్యం వైపు ఆమె మనసు మళ్ళింది. దీంతో చిన్నపిల్లలా మారిపోయి ఎట్టకేలకు నాట్యం నేర్చుకుంది. చివరకు 56వ ఏట అరంగేట్రం ఇచ్చారు. ఇలా కమిట్ మెంట్ వుంటే ఎవరు ఏ వయసులో అయినా ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించారు.
ఓవైపు భర్త కెరీర్, మరోవైపు పిల్లల కోసం తన ఇష్టాలను త్యాగం చేసిన లలితా ఆనంద్ ఇప్పుడు వాటిపై దృష్టిపెట్టారు. 40 ఏళ్లలో మళ్ళీ చదువు, 50 ఏళ్లలో మళ్లీ నాట్యం ప్రారంభించారు. ఇలా సివి ఆనంద్-లలితా ఆనంద్ దంపతులు తమ జీవితంలో అనుకున్నది సాధించారు. భార్యాభర్తలుగా గానే కాదు అన్ని విషయాల్లోనే ఆదర్శవంతంగా వున్నారు.