జూబ్లీహిల్స్ ఓటర్లుగా రకుల్, సమంత, తమన్నా.. ఓటర్ ఐడీలు వైరల్
Jubilee Hills Bypolls : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ముందు టాలీవుడ్ హీరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ నకిలీ ఓటరు కార్డులు ఆన్‌లైన్‌లో వైరల్ గా మారాయి. దీనిపై పోలీసు కేసు నమోదుతో పాటు ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది.

టాలీవుడ్ హీరోయిన్ల ఫేక్ ఓటరు కార్డులు వైరల్
జూబ్లీహిల్స్ ఓటర్లుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల ఓటర్ కార్డులు వైరల్ గా మారి సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు తెలుగు హీరోయిన్లు సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లతో నకిలీ ఓటరు కార్డులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూడు కార్డులు అన్ని ఒకే అడ్రస్ “8-2-120/110/4”తో ఉన్నాయి. దీంతో మరోసారి ఓటర్ కార్డుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు ఇవి పూర్తిగా నకిలీ ఓటర్ కార్డులని చెప్పారు. అయితే, సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ ఫోటోలను కలిగిన ఈ నకిలీ కార్డులు నిజమైన EPIC నంబర్లను కూడా చూపిస్తున్నట్టు సమాచారం. ఇది స్థానిక ఎన్నికల అధికారులతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులను షాక్ కు గురిచేస్తోంది.
పోలీసు కేసు నమోదు
61- జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్షనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ యూసుఫ్ గూడా సర్కిల్-19 అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ ఫిర్యాదుతో మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు భారతీయ న్యాయ సంహితా 336(4), 353(1)(c) సెక్షన్ల క్రింద నమోదు చేశారు.
ఎన్నికల సంఘం దర్యాప్తు
ఈ నకిలీ ఓటర్ కార్డుల పై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టింది. అధికారులు నకిలీ ఓటరు కార్డుల తయారీ, వ్యాప్తి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో మోసపూరిత సమాచారం ప్రచారం చేయవద్దని హెచ్చరించింది. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయవద్దని సూచించింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఎప్పుడు?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుండగా, ఓట్లు లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. ఈ ఉప ఎన్నిక ఈ ఏడాది జూన్‌లో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జరుగుతున్నాయి.
ఓటు చోరీ రచ్చ
కాగా, ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక క్రమంలో నకిలీ ఓటర్ల వ్యవహారం రచ్చ లేపుతోంది. బోరబండ డివిజన్‌లోని స్వరాజ్ నగర్‌లో 40 నకిలీ ఓట్లు ఉన్నాయనీ, ఇందులో 10 ఓట్లు ఒక ఇంట్లో, 30 ఓట్లు మరొక ఇంట్లో ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీని వెనుక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారని ఆరోపణలతో విమర్శలు గుప్పించాయి. ఓటు చోరీ వ్యవహారంతో పాటు ఈ సంఘటన ఇప్పటికే ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పుడు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ నకిలీ ఓటరు కార్డులు సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనంగా మారింది.