- Home
- Telangana
- Google Map వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి... గుడ్డిగా నమ్మితే ఇలాంటి పరిస్థితే..!
Google Map వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి... గుడ్డిగా నమ్మితే ఇలాంటి పరిస్థితే..!
తెలంగాణలో మరోసారి గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మి ప్రమాదానికి గురయ్యారు కొందరు యువకులు. ఈ క్రమంలో మ్యాప్ వాడేటప్పుడు తప్పక పాటించాల్సిన 5 జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకొండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టెక్నాలజీని అతిగా వాడటం ప్రమాదకరమే..
Telangana : నూతన టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నకొద్దీ మనిషి జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతోంది. ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే మాల్స్ కి, ఇంట్లో సరుకుల కోసం షాప్స్ కి, తినేందుకు ఫుడ్ కావాలంటే హోటల్స్ కి వెళ్లాల్సి వచ్చేది... కానీ ఇప్పుడు టెక్నాలజీ అంతా మార్చేసింది. చేతిలో సెల్ ఫోన్ ఉంటేచాలు మనం కూర్చున్నచోటికే ఏదయినా తెప్పించుకోవచ్చు. కానీ ఈ టెక్నాలజీపై అతినమ్మకం ఒక్కోసారి ప్రమాదాలకు కారణం అవుతోంది. ఇలాంటి ఘటనే తాజాగా తెలంగాణలో చోటుచేసుకుంది.
గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మితే ఇంతే...
మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు తిరుపతికి కారులో వెళుతున్నారు. వారికి తిరుమలకు ఎలా వెళ్లాలో తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశారు. దీన్ని ఫాలోఅవుతూ అది ఏ మార్గం చూపిస్తూ అలాగే వెళ్లడం ప్రారంభించారు. చుట్టుపక్కల పరిస్థితులు, రోడ్డుపక్కన హెచ్చరిక బోర్డులు చూసుకోకుండా గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మారు.
ఇలా యువకులు గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ తెలంగాణ మీదుగా తిరుమలకు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. జనగామ వద్ద యువకులు ప్రయాణిస్తున్న కారు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జివద్ద లోతైన గుంతలో పడిపోయింది. బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నా గూగుల్ మ్యాప్ లో అదే దారి చూపించడంతో ముందువెనక చూసుకోకుండా యువకులు కారును పోనిచ్చారు. దీంతో కారు అమాంతం బ్రిడ్జి పనుల కోసం తవ్విన గుంతలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో కారులోని యువకులు గాయాలపాలయ్యారు... వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని కాపాడారు. గాయపడిన యువకులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు... ప్రస్తుతం యువకులంతా క్షేమంగానే ఉన్నారు. అయితే ఈ యాక్సిడెంట్ మరోసారి టెక్నాలజీపై అతిగా ఆదారపడటం ఎంత ప్రమాదకరమో హెచ్చరించింది.
గతంలోనూ గూగుల్ మ్యాప్ వల్ల ప్రమాదాలు..
గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తెలియని ప్రాంతాల్లో ఈ గూగుల్ మ్యాప్ లేదా ఇతర నావిగేటింగ్ యాప్స్ ఉపయోగించి చాలామంది ప్రమాదాల బారినపడుతున్నారు. ఇలా తెలంగాణకు చెందిన పర్యాటకులు కేరళలో ఇలాగే ప్రమాదానికి గురయ్యారు.
హైదరాబాద్ కు చెందిన టూరిస్టులు కేరళలో పర్యటిస్తూ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ వాడారు. ఈ క్రమంలో దక్షిణ కేరళలోని కురుప్పంతర సమీపంలో వీరు ప్రయాణిస్తున్నకారు నీటిలోకి దూసుకెళ్లింది. రాత్రి సమయంలో గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణిస్తుండగా అదికాస్త నీటి ప్రవాహంలోకి తీసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో కూడా ఎవరికీ ఏం కాలేదు... అందరూ సురక్షితంగా బైటపడ్డారు.
తెలంగాణలో కూడా గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఓ వ్యాన్ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ వెళుతూ గౌరవెళ్లి ప్రాజెక్టులో పడిపోయాడు. అతడిని స్థానికులు కాపాడారు. ఇక హైదరాబాద్ లో గోల్నాకలో నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ పైనుండి గూగుల్ మ్యాప్ లో చూపించింది. అలాగే వెళ్లిన యువకులు ప్రమదానికి గురయ్యారు.
గూగుల్ మ్యాప్ ఉపయోగించేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గూగుల్ మ్యాప్స్ ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించడం మంచిది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
1. ప్రయాణ సమయంలో పూర్తిగా గూగుల్ మ్యాప్ పై ఆదారపడకుండా ముందుగానే ఆ మార్గం గురించి తెలుసుకోవాలి. రోడ్డు నిర్మాణ పనులేమైనా జరుగుతున్నాయా... రోడ్డు ఎలా ఉంది.. రెండుమూడు మార్గాలుంటే ఏది ఎంచుకోవాలి, ఏ మార్గంలో వెళితే సేఫ్.. ఇలాంటివి ముందే తెలుసుకోవాలి.
2. రోడ్డు మూసివేతలు, నిర్మాణంలో ఉన్న వంతెనలు, ఇతర ప్రమాదకర పరిస్థితుల గురించి గూగుల్ మ్యాప్స్ లో సమాచారం ఉండకపోవచ్చు. కాబట్టి రోడ్డుపై ఉన్న సూచనలను, హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు పరిస్థితులను గమనిస్తూ అవసరం అయితే స్థానికుల సహాయం తీసుకోవాలి.
షార్ట్ కట్ మార్గాలు అస్సలు వద్దు..
3. కొంచెం దూరం తగ్గుతుందని గూగుల్ మ్యాప్ లో షార్ట్ కట్స్ ఎంచుకోవడం మంచిదికాదు. తెలిసిన దారిలో వెళ్లడం ఉత్తమం. కొత్తమార్గం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి రిస్క్ చేయవద్దు.
4. మనం ప్రయాణించే ప్రదేశం గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకోవడం వలన ఉపయోగకరమైన సమాచారం దొరుకుతుంది. ఆ మార్గంలో ఏదయినా ప్రమాదాలుంటే ముందుగానే తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవచ్చు.
5. అత్యవసర పరిస్థితుల్లో గూగుల్ మ్యాప్స్ పై పూర్తిగా ఆధారపడకుండా పోలీసులకు లేదా ఇతర అత్యవసర సేవల సిబ్బందికి సమాచారం అందించాలి. రాంగ్ రూట్ లో వెళుతున్నామని అనిపిస్తే వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి ఎవరి సహాయం అయినా తీసుకొండి. గుడ్డిగా గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.