ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌కి మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్స్: ఒంటరి పోరుకే కాంగ్రెస్ నేతల మొగ్గు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ మద్దతు విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తేల్చలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు స్వంతంగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ కి మద్దతిచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా తేల్చలేదు. టీజేఎస్ కి మద్దతివ్వడం కంటే పార్టీ నేతలకే టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొనిపోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీజేఎస్ భావిస్తోంది. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ నేతలను కోరారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఇంకా తేల్చలేదు.
ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన నేతలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కి మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేశారు.
కోదండరామ్ కి మద్దతివ్వకుండా పార్టీ కోసం కష్టపడిన నేతలకే టిక్కెట్టు ఇవ్వాలని పార్టీ నేతలు కోరారు. ఎవరికి కూడ మద్దతు ఇవ్వొద్దని కూడ పార్టీ నేతలు తేగేసీ చెప్పారు.
రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమతో కలిసి వచ్చే నేతలు, పార్టీలను కలుపుకొనిపోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో టీజేఎస్ ను వదులుకోకూడదని భావిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కి మద్దతుపై పార్టీ నేతలతో చర్చించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది.సబ్ కమిటీ సిఫారసుల మేరకు కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిచ్చే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.