ఇక ఊరుకునేదే లేదు.. కాంగ్రెస్ హైకమాండ్ కూడా తీవ్ర అసంతృప్తి..
Telangana: తెలంగాణలో కొందరు మంత్రుల వరుస వివాదాలు, అంతర్గత గొడవలతో ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించారు. మంత్రులకు క్లాస్ తీసుకున్న ఆయన, వారి పనితీరుపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు.

గిల్లికజ్జాలు, అంతర్గత కలహాలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదట్లో పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకుల మధ్య ఐక్యతను గమనించారు. అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నారని, పార్టీలో కొత్త సంస్కృతి వచ్చిందని భావించారు. అయితే ఈ ఆశలు ఎంతో కాలం నిలవలేదు. క్రమంగా మంత్రుల మధ్య గిల్లికజ్జాలు, అంతర్గత కలహాలు పెరిగాయి.
ఒక్కో మంత్రి ఒక్కో వివాదం
ఒక్కో మంత్రి ఒక్కో వివాదంలో చిక్కుకోవడంతో పార్టీ నాయకులలో నిరాశ వ్యక్తమైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మొత్తం ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. వారి తీరు మార్చుకోవాలని పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
హైకమాండ్ కు సమాచారం..
దీని తర్వాత, జిల్లా అధ్యక్షుల నియామకాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ లను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. ఈ పర్యటనను అవకాశంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, వివాదాలకు కారణమవుతున్న మంత్రుల పనితీరు, వ్యవహార శైలిపై అధిష్టానానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వంటి ప్రముఖుల పేర్లు ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. వీరితో పాటు మరికొందరు మంత్రుల తీరుపైనా సీఎం వివరణాత్మక సమాచారం అందించారని తెలుస్తోంది.
క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న బెర్త్ లు..
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కూడా హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు పంపడంతో, సీఎం ఇచ్చిన నివేదికతో సీరియస్ నెస్ మరింత పెరిగింది. ప్రస్తుతానికి వివాదాలు సద్దుమణిగినట్లు కనిపించినా, ఇలాగే వదిలేస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే వివాదాస్పద మంత్రులను గాడిలో పెట్టాలని ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రానున్న రోజుల్లో క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న బెర్త్ లను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ విస్తరణ సమయంలో వరుస వివాదాలతో పార్టీని, ప్రభుత్వానికి ఇరకాటంలో పెట్టిన మంత్రులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అధిష్టానం కూడా తీవ్ర అసంతృప్తి..
ఒకరిద్దరు మంత్రుల విషయంలో అధిష్టానం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అదును చూసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు చాలానే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలలో ఒక ముఖ్యమైన మలుపు తిప్పుతాయని భావిస్తున్నారు.