CM Revanth: సీఎం రేవంత్ కీలక నిర్ణయం... రూ. 10,547 కోట్లతో మాస్టర్ ప్లాన్
CM Revanth: తెలంగాణలో గతుకుల లేని రోడ్లే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రూ. 10 వేలకు పైగా కోట్ల నిధులను విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో గతుకులు లేని రోడ్లే లక్ష్యం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ల అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని గుర్తించిన ఆయన.. గతుకుల లేని రోడ్లే లక్ష్యంగా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. పాత రోడ్లను మార్చి కొత్త రోడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.
భారీగా నిధుల మంజూరు..
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ. 10,547 కోట్లు మంజూరు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సుమారు 5,566 కిలోమీటర్ల రోడ్లను నిర్మించడానికి.. పాత రోడ్లను పునర్నిర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేశారు అధికారులు. ఈ ప్రాజెక్టులు అన్ని కూడా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో వేగంగా పూర్తి కానున్నాయి.
30 నెలల్లోగా దగదగలాడే రోడ్లు..
సీఎం రేవంత్ రెడ్డి 30 నెలల్లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా అద్దంలా మెరిసేలా చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ప్రజలు ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా ఉండేలా, ప్రతి జిల్లాలో ఉన్న ప్రధాన మార్గాలను మెరుగుపరచడమే ఇందుకు ముఖ్య ఉద్దేశ్యం.
ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు మంత్రి కోమటిరెడ్డి
ఈ ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు అవ్వడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల రూపురేఖలు మారుతాయని అన్నారు. 'ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద రోడ్ల ప్రాజెక్ట్ అవుతుంది' అని మంత్రి పేర్కొన్నారు.
ప్రజా మద్దతు పెంచే వ్యూహం
రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాదు.. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో ఇది కీలకం కానుంది. తెలంగాణలో ప్రజలు ప్రభుత్వం పనితీరును నిశితంగా చూస్తున్నారు. ఈ రోడ్డు ప్రాజెక్టు ద్వారా రేవంత్ ప్రభుత్వం 'ప్రజల నమ్మకాన్ని పొందే ప్రభుత్వం' అనే మాటను చూరగుంటుందని విశ్లేషకులు అంటున్నారు.