తిరిగి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం... తల్లితో కలిసి అష్టలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయిన సీఎం కూతురు కవిత తల్లి శోభతో కలిసి దిల్ సుఖ్ నగర్ అష్టలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్: తిరిగి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ(శుక్రవారం) ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన పత్రాలను ఎన్నికల అధికారుల నుండి కవిత స్వీకరించనున్నారు. ఇందుకోసం నిజామాబాద్ కు వెళ్లేముందు దిల్ సుఖ్ నగర్ లోని అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత.
తల్లి శోభతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మరికొందరు కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న కవితకు పార్టీ శ్రేణుల నుండి ఘనస్వాగతం లభించింది. ఆలయ సిబ్బంది సాంప్రదాయబద్దంగా వీరిని ఆలయంలోకి తీసుకువెళ్లారు.
అష్టలక్ష్మి అమ్మవారికి cm kcr wife kalvakunta shobha, daughter kavitha ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుతూ అమ్మవారి ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేసారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను కల్వకుంట్ల శోభ, కవితకు అందజేసారు.
సీఎం సతీమణి, కూతురు రాకతో దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. అమ్మవారి ఆలయం వద్దకు భారీఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని స్వాగతం పలికారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.