‘పగలు అయ్యవారు.. రాత్రైతే రాక్ స్టారూ...’ ఈ విష్ణుస్వామి లీలలు ఇన్నన్ని కాదయా....
త్రిదండి చిన జీయర్ స్వామి మేనల్లుడిగా.. ఆశ్రమంలో నెంబర్ టు గా.. చిన్నస్వామిగా పేరొందిన విష్ణుస్వామి గురించి ఇప్పుడు ఓ స్టోరీ వైరల్ అవుతోంది..
హైదరాబాద్ : శంషాబాద్ లో పూజారి సాయి కృష్ణ ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అలాంటిదే మరో స్వామి లీలలు వెలుగు చూస్తున్నాయి. విష్ణు స్వామి.. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతో నిష్టతో ఉండే స్వామి అవతారం అతను.. రాత్రి అయితే మాత్రం.. ఖరీదైన కార్లు, షికార్లు, పబ్బులు.., విందులు వినోదాలతో చిల్ అయ్యే.. భోగలాలసుడు. మడి బట్టల స్థానంలో.. జీన్స్ టీ షర్ట్.. మంత్రాల స్థానంలో బేబ్ అనే మాటలు వినిపిస్తాయి. అయితే, ఇతని గురించి ఇప్పుడు ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అవసరమేంటంటే.. ఆయన త్రిదండి చిన్న జీయర్ స్వామికి స్వయానా మేనల్లుడు కావడం వల్లే.
చిన్న జీయర్ స్వామి వెన్నంటే ఉంటూ ముచింతల్ లోని ఆశ్రమ వ్యవహారాలన్నీ తానే నడిపించే ‘చిన్న స్వామి’ విష్ణు స్వామి.. చిన్న జీయర్ స్వామికి తెలియకుండా ఆయన వెనకాల సాగిస్తున్న వ్యవహారాలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ప్రకారం… వివరాలు ఇలా ఉన్నాయి…నిరుడు ముచ్చింతల్ లో చిన్న జీయర్ స్వామి 108 అడుగుల రామానుజయ చార్యుల వారి సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చారు.
ఆ సమయంలో ఆయన వెన్నంటి ఉండి.. చిన్న జీయర్ స్వామితో పాటు ఈ చిన్న స్వామి కూడా దివ్య సాకేత క్షేత్రానికి సంబంధించిన వివరాలను వివరించారు. ఆ తర్వాత ఏ ప్రముఖులు ముచ్చింతల క్షేత్రానికి వచ్చిన చిన్న స్వామి హడావుడి చేస్తుంటారు. ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు, ఇటీవల ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా చిన్న జీయర్ స్వామితో పాటు ఓ యువ స్వామి రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయనే విష్ణు స్వామి. చిన్న జీయర్ స్వామికి మేనల్లుడు కావడంతో జీయర్ ఆశ్రమంలో.. ఆయన తర్వాత విష్ణు స్వామి మాటే చెల్లుబాటు అవుతుందట. చిన్న జీయర్ స్వామికి అన్ని విష్ణు స్వామినే అని అంటారు.
విష్ణుస్వామి ఇటీవల చిన్న జీయర్ స్వామితో పాటు అమెరికాకు కూడా వెళ్లారు. ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టే ఆశ్రమంలో అందరూ ఆయనని ‘చిన్నస్వామి’ అని పిలుస్తారు. చిన్న జీయర్ స్వామికి కుడి భుజం.. ఆశ్రమంలో నెంబర్ టుగా చిన్నస్వామి పేరుపొందాడు. ఇక ఆయనను చూసినవారు ఎవరైనా..ఎంతో బుద్ధిమంతుడు, ధార్మికుడు.. అనుకోవడం మామూలే. బయటికి అలాగే కనిపిస్తారు. ఆశ్రమంలో ఉన్నంతవరకు ఆయన పద్ధతి కూడా అలాగే ఉంటుంది.
అయితే ఆయనలో అపరిచితుడి మరో కోణం ఉంది. సాయంత్రమైతే ఆయనలోని అపరిచితుడు బయటికి వస్తాడు. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ల్లోకి మారిపోతాడు. ఖరీదైన కార్లు, చుట్టూ అమ్మాయిలు, సూపర్ స్పీడ్ తో దూసుకుపోతూ హల్చల్ చేస్తాడు. స్వామి వారి ముందు ధూపదీప నైవేద్యాలు సమర్పించే అదే చేతులతో.. రివాల్వర్ కూడా అంతే చాకచక్యంతో తిప్పుతారు.
అర్చన చేసి అలసిపోయినందుకో ఏమో సాయంత్రం స్నేహితులతో కలిసి పెద్ద పెద్ద పబ్బులలో సేద తీరుతారు. అయితే ఈ చిన్న స్వామి.. సరిగ్గా ఎవరనేది చాలామందికి తెలియని విషయం. అయితే చిన్న జీయర్ స్వామికి స్వయానా సోదరి కుమారుడు ఈ విష్ణు స్వామి. ప్రస్తుతం విష్ణు స్వామి జీయర్ విద్యాసంస్థలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నాడని చెబుతుంటారు.
విష్ణు స్వామి ఆశ్రమానికి వచ్చిన కొత్తలో…ఆశ్రమానికి సంబంధించిన కార్యక్రమాల ఫోటోలను తీసి మీడియాకు అందిస్తుండేవాడు. ఆ తర్వాతి కాలంలో సోషల్ మీడియాలో జీయర్ ఆశ్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని భావించి ఆ బాధ్యతను విష్ణు స్వామికి అప్పగించారు. అంతేకాదు చిన్న జీయర్ స్వామి ఉత్తరాధికారి విష్ణు స్వామి అనే ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది.
ఈ కథనం ప్రకారం జీయర్ ట్రస్ట్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల వ్యవహారాలకు వారసుడు విష్ణు స్వామి అని.. ఆయనకే తరువాత అధికారాలు అప్పగిస్తారని.. అందుకే ఆశ్రమంలో చిన్న జీయర్ స్వామి తర్వాత అంత ప్రాధాన్యత అతనికి ఉందని సమాచారం.
ఈ చిన్న స్వామి లీలల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. నెంబర్ లేని కారులో జల్సాగా తిరుగుతుంటాడు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే మామూలుగా కారు నెంబరు, యజమాని పేరు, పూర్తి వివరాలు, అడ్రస్ లాంటివి తెలిసిపోతాయి. కానీ విష్ణు స్వామి లీలతో ఆయన తిరిగి కారు వివరాలు ఎంత వెతికినా దొరకవు. వాహన యజమాని పేరు దగ్గర ‘నల్’ అని వస్తుంది.
ఇలా కూడా మేనేజ్ చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా అది కనిపిస్తుంది. ఈ విష్ణు స్వామి కారు నెంబర్ ఏపీ37 సీయూ 0999. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ నెంబర్ లో నుంచి సున్నా తీసేసి నెంబర్ ప్లేట్ మీద ఏపీ37 సీయూ 999గా పెట్టుకున్నాడు.
ఇక ఈ చిన్న స్వామీజీ అలియాస్ విష్ణు స్వామి కారు ఎక్కాడంటే.. అది రోడ్లమీద కాకుండా ఆకాశంలో దూసుకుపోవాల్సిందే. అంత వేగంగా నడుపుతాడు. గంటకు 100 కిలోమీటర్ల పైగానే వెళుతుంటాడు. అలా కిందటి 4వ తేదీన అప్పా జంక్షన్ దగ్గర ఆయన కారు వేగం121కి.మీ.లుగా స్పీడ్ గన్ కు చిక్కింది. 12వ తేదీనాడు రాజేంద్రనగర్లో 117 కి.మీ. వేగంతో వెడుతూ మరోసారి చలానా పడ్డాడు. అంతకుముందు కట్టంగూరు దగ్గర కూడా 112 కిలోమీటర్ల వేగంతో వెడుతూ స్పీడ్ గన్ కు చిక్కాడు. ఈ చలానాలు పెండింగ్ లోనే ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ చిన్నస్వామికి సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సమతా మూర్తి విగ్రహం తర్వాత ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. 111 జీవో ఇటీవల ఎత్తేయడంతో, సమీపంలో శంషాబాద్ ఎయిర్పోర్టు ఉండడంతో.. ఆశ్రమం చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే ఆశ్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల రాకపోకలు పెరిగాయి, చాలా వెంచర్లు, జిల్లాల ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామిని ఆహ్వానించడం కూడా జరుగుతుంది.
ఈ క్రమంలో ఇలా వస్తున్న వారితో చినస్వానికి ఏర్పడిన పరిచయాలు ఆర్థిక సంబంధాలుగా మారాయట. కొన్ని భూవివాదాలలో తన పరపతిని ఉపయోగించి పరిష్కారం కూడా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సంబంధాల వల్లనే విష్ణు స్వామి పబ్ ల దారి పట్టేలా చేశాయని ప్రచారం కూడా ఉంది. విష్ణు స్వామి వ్యవహారం అంతా వెలుగులోకి వస్తుండడంతో చిన్న జీయర్ స్వామి గురించి తెలిసిన వారంతా.. చిన్న స్వామి చేసే పనుల వల్ల జీయర్ స్వామికి చెడ్డపేరు వస్తుందని.. ఆ గుర్తింపు విష్ణు స్వామికి ఎందుకు ఉండడం లేదని వాపోతున్నారు.