ఏపీ మంత్రి ఇంట పెళ్లిసందడి... బొత్సతో బిజెపి ఎమ్మెల్యే ఈటల ఆత్మీయ ఆలింగనం...
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూమారుడి పెళ్లికి బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటలకు బొత్స ఆత్మీయ స్వాగతం పలికి దగ్గరుండి వధూవరుల వద్దకు తీసుకెళ్లారు.
హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పుడు ఏం చేసినా, ఎక్కడికెళ్లినా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల ఆయన తెలంగాణ డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట పెళ్లికి ఈటల హాజరైన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఏపీ మంత్రి బొత్ససత్యనారాయణ ఇంట జరిగిన పెళ్లికి ఈటల హాజరైన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్, కదిరి బాలకృష్ణ కూతురు పూజిత వివాహం ఇవాళ(గురువారం) హైదరాబాద్ లో జరుగుతోంది. హైటెక్స్ లోని కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వివాహ వేడుకకు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సీనీ, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నారు.
ఈ వివాహ వేడుకకు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా ఆహ్వానం అందింది. దీంతో ఈటల ఈ వివాహానికి హాజరుకాగా స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈటలను కలవగానే ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగారు.
ఇలా ఈటలను దగ్గరుండి మరీ వధూవరుల దగ్గరకు తీసుకెళ్లారు బొత్స. ఈ సందర్భంగా నూతన వధూవరులను నిండునూరేళ్లు చల్లగా బ్రతకాలంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈటల. ఇలా బొత్స ఇంట పెళ్లికి ఈటల హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇదిలావుంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బొత్స కుమారుడి పెళ్లికి హాజరుకానున్నారు. ఇందుకోసం హైదరాబాద్ రానున్న సీఎం పెళ్లి వేడుకలో పాల్గొని నూతనవధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ వివాహానికి ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. అలాగే తెలంగాణ రాజకీయ నాయకులు కూడా బొత్స కుమారుడి పెళ్లికి హాజరుకానున్నారు.