దేశ రాజధానిలోనూ తెలంగాణ భవన్... కేసీఆర్ చేతులమీదుగా భూమి పూజ, ముహూర్తం ఖరారు
దేశ రాజధాని న్యూడిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో తెలంగాణ భవన్ నిర్మాణం చేపట్టడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైదరాబాద్: దేశ రాజధాని న్యూడిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం టీఆర్ఎస్ కు 1300ల గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఆ స్థలంలో విశాలంగా, అన్ని సౌకర్యాలతో కార్యాలయాన్ని నిర్మించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ చేతులమీదుగా కార్యాలయ నిర్మాణానికి భూమి పూజకు మూహూర్తం ఖరారయ్యింది. వచ్చే నెల సెప్టెంబర్ 2న భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు సీఎం కేసీఆర్ డిల్లీలో వుండనున్నారు.
భూమి పూజకు ముహూర్తం ఖరారయిన నేపథ్యంలో తెలంగాణ భవన్ నిర్మాణ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. భూమిపూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పదవుల్లో వున్నవారు, పార్టీ పదవుల్లో వున్నావారు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇలా మూడు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బసచేసి సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలంలో భూమిపూజ చేయనున్నారు.
న్యూడిల్లిలో కార్యక్రమాలన్నీ ముగించుకుని సెప్టెంబర్ 3న మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం కార్యాలయం ఖరారు చేసింది.