- Home
- Telangana
- Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీలో కాదు తెలంగాణలోనూ వర్షబీభత్సమే, ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే
Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీలో కాదు తెలంగాణలోనూ వర్షబీభత్సమే, ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే
బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోంది. ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతుండగా ఇది తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలోనే కాదు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయట.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయంటోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో తుపాను...
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది క్రమంగా బలపడి అక్టోబర్ 24 అంటే నేడు (శనివారం) అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అక్టోబర్ 25 (ఆదివారం) నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడవచ్చని అంచనా వేశారు.
అక్టోబర్ 26 (సోమవారం) నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది... తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే ఏలూరు, కృష్ణా, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు... వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉండరాదని సూచించారు.
అల్పపీడనం తుపానుగా బలపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందంటోంది APSDMA సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉండగా, మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలోనూ వర్ష సూచన
తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.
అక్టోబర్ 28 నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు?
తెలంగాణపై కూడా తుపాను ప్రభావం ఉంటుందని... అక్టోబర్ 28 నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో రెండుమూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

