అజారుద్దిన్ కు మంత్రి పదవి.. కాంగ్రెస్ కు లాభమా, నష్టమా?
Jubilee Hills Bypoll 2025 : ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అజారుద్దిన్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడమే కాదు మంత్రిని కూడా చేసింది. ఈ నిర్ణయంతో కాాంగ్రెస్ కు లాభమా? నష్టమా?
- FB
- TW
- Linkdin
- GNFollow Us

అజారుద్దిన్ కు కేటాయించిన శాఖలివే
Mohammad Azharuddin : కేవలం ఓ ఉప ఎన్నిక కోసం మంత్రివర్గ విస్తరణ చేపట్టడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దిన్ ను మంత్రిని చేశారనేది ఎవరూ కాదనలేని నిజం. ముస్లిం మైనారిటీ ఓట్లను గంపగుత్తగా సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమే అజారుద్దిన్ కు మంత్రిపదవి.
ఇప్పటికే మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దిన్ కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు కీలకమైన శాఖలేవైనా దక్కుతాయనుకుని అందరూ భావించారు... గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా ఓ ముస్లిం నాయకుడికి హోంశాఖ దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ చివరకు మైనారీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలతోనే పరిపెట్టింది రేవంత్ సర్కార్.
అజారుద్దిన్ కు మంత్రి పదవి... కాంగ్రెస్ కు లాభమా, నష్టమా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొదట పోటీచేయడానికి సిద్దమయ్యారు మహ్మద్ అజారుద్దిన్. కానీ రాజకీయ సమీకరణకలతో నవీన్ యాదవ్ కు ఈ సీటు దక్కింది. ఈ నిర్ణయం ముస్లిం మైనారిటీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలుండటంతో అజారుద్దిన్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు... అంతేకాదు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
ఇక్కడివరకు బాగానే ఉంది... కానీ అజారుద్దిన్ కు కేటాయించిన శాఖలే ముస్లిం మైనారిటీలను కాస్త నారాజ్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు ముస్లింలకు కేబినెట్ లో చోటు లేదు... ఇప్పుడు చోటు కల్పించినా పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించారు. గత ప్రభుత్వం హోం వంటి కీలక శాఖను ముస్లిం నాయకుడికి కేటాయించింది... అలాంటి పవర్ ఫుల్ శాఖనే ఇప్పుడు కూడా ఆ వర్గం ప్రజలు కోరుకున్నారు. కానీ మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను అజారుద్దిన్ కు కేటాయించారు.. ఇది ముస్లిం వర్గంమొత్తాన్ని సంతృప్తిపర్చడం అనుమానమే. కాబట్టి జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లు వన్ సైడ్ పడతాయన్న గ్యారంటీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
జూబ్లీహిల్స్ అనగానే బడాబాబులు ఎక్కువగా ఉండే నియోజకవర్గమని భావిస్తాం... కానీ ఇందులో పేద, మద్యతరగతి ప్రజల బస్తీలే ఎక్కువ. సినీ కార్మికులు కూడా ఎక్కువగా నివాసముండే ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకే వస్తాయి. అందుకే ఈ ఉపఎన్నికలో ముస్లింలనే కాదు ఆంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డాయి ప్రధాన పార్టీలు.
సినీ కార్మికలతో సభ, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వంటి హామీలు జూబ్లీహిల్స్ ఆంధ్రా ఓటర్ల కోసమే. స్వయంగా ముఖ్యమంత్రితో నందమూరి తారక రామరావు విగ్రహ ఏర్పాటు ప్రకటన చేయించడంవెనక కాంగ్రెస్ వ్యూహం దాగివుంది. ఒకేదెబ్బకు రెండుపిట్టలు అన్నట్లు ఇటు సినీకార్మికులు, అటు ఆంధ్రా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే దీని ఉద్దేశం. మరి ఓటర్లపై ఎన్టీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి.
జూబ్లీహిల్స్ ఆంధ్రా ఓటర్లు ఎటువైపు?
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో జనసేన పార్టీ బిజెపి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డిఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి బిజెపికి మద్దతు ఇస్తున్నట్లే. కాబట్టి సినీ కార్మికులు, ఆంధ్ర ఓటర్లపై రేవంత్ హామీల ప్రభావం ఉంటుందా అనే అనుమానాలున్నాయి. మరోవైపు వైసిపికి అనుకూలంగా ఉండేవారు బిఆర్ఎస్ కు మద్దతుగా నిలిచే అవకాశాలే ఎక్కువ. ఎలా చూసుకున్నా రేవంత్ హామీలు ఓటర్లపై ప్రభావం చూపడం అనుమానమే.