ఒక్క సినిమా పాట.. అందెశ్రీ జీవితాన్ని టర్న్ చేసింది
Ande Sri Passes Away : ప్రముఖ తెలుగు రచయిత అందె శ్రీ అనగానే తెలంగాణ గీతం ‘జయజయహే తెలంగాణ’ గుర్తుకువస్తుంది. కానీ ఓ సినిమా సాంగ్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదేంటో తెలుసా?

అందెశ్రీకి పేరుతెచ్చిన పాటలు
Ande Sri : ప్రజాకవి అందెశ్రీ ఇవాళ (సోమవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి మనందరికి బౌతికంగానే దూరం అయ్యారు... కానీ ఆయన సాహిత్యం, రాసిన పాటల రూపంలో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. ముఖ్యంగా 'జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం' అంటూ సాగే తెలంగాణ రాష్ట్ర గీతం, ఎర్రసముద్రం సినిమాలో 'మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు' అంటూ నేటి సమాజాన్ని ప్రశ్నిస్తూ సాగే పాట అందెశ్రీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఒక్క పాటతో సమాజాన్ని కడిగిపారేసిన అందెశ్రీ
సమాజంలోని కుల వ్యవస్థ, దిగజారిపోతున్న మానవ బంధాలను గురించి ప్రశ్నిస్తూ 'మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు' సాగుతుంది అందెశ్రీ రాసిన పాట. జంతువులను దేవుళ్లుగా పూజించే మనిషి తోటి మనుషులను కులమతాల పూరిట ఊరి అవతికిని నెట్టేస్తున్నాడని... ఆధ్యాత్మికత అర్ధం తెలీక అందుడైపోతున్నాడంటూ కడిగిపారేశారు. అంతేకాదు డబ్బులు, రాజకీయాలు ఈ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో తన పాటద్వారా తెలియజేశారు. ఇలా సమాజ పోకడల గురించి అందెశ్రీ రాసిన పాట జనాల్లోకి బాగా వెళ్లింది... సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఆ పాట సినీప్రియులు, విప్లవ భావాలు కలిగినవారి నోళ్లలో నానుతూ ఉంటుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన రచించిన సినిమా పాట 'మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు' ఆంధ్ర విశ్వవిద్యాలయం సిలబస్ లో చేర్చారు. ఇలా చదువన్నదే ఎరగని అందెశ్రీ సాహిత్యం ఓ యూనివర్సిటీలో పాటంగా మారింది.
తెలంగాణ గీతంగా జయజయహే తెలంగాణ
అందెశ్రీ సినిమా పాటలే కాదు జానపద గీతాలు కూడా తెలుగు ప్రజల ఆదరణను పొందాయి. ముఖ్యంగా ఆయన తెలంగాణ సాహిత్యానికి మర్చిపోలేని సేవ చేశారు. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన రాసిన 'జయజయహే తెలంగాణ జననీ జయకేతం' పాట అందరి నోటా వినిపించేంది. తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేస్తూ సాగే ఆ పాట ఉద్యమస్పూర్తిని రగిలించింది. పాటతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించవచ్చని నిరూపించిన కవి అందెశ్రీ.
తెలంగాణ ఏర్పాటుతర్వాత అందెశ్రీతో పాటు ఆయన పాటు జయజయహే తెలంగాణ నిరాదరణకు గురయ్యింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అందెశ్రీకి తగిన గౌరవం అందించింది... ఆయన పాటను రాష్ట్రగీతంగా ప్రకటించింది. అలాగే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను సత్కరించి తెలంగాణ సాహిత్యానికి అందించిన సేవకు గాను కోటి రూపాయల నగదు బహుమతి ప్రకటించారు.
అందెశ్రీ వ్యక్తిగత జీవితం
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. పుట్టిపెరిగింది జనగాం జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామం. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోవడంతో అనాథగా మారిన ఆయన చాలాకాలం గొర్ల కాపరిగా పనిచేశారు. ఈ సమయంలో జానపద పాటలపై మక్కువ పెంచుకుని సొంతంగా పాటలు అల్లడం ప్రారంభించారు. ఆయన పాడే సరికొత్తగా ఉండటంతో అందరినీ ఆకట్టుకునేవి. ఈ క్రమంలోనే శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహరాజ్ ఓసారి అందెశ్రీ పాటలు విని అతడి టాలెంట్ ను గుర్తించారు. అతడిని చేరదీని ప్రోత్సహించడంతో ఆయనలోని కవి బయటకు వచ్చారు... స్కూల్లో అడుగుపెట్టకపోయినా పాఠ్యపుస్తకాల్లో తన సాహిత్యం చేరే స్థాయికి ఎదిగారు.
అందేశ్రీ పురస్కారాలు
సాహితీవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగిన అందెశ్రీకి అనేక అవార్డులు లభించాయి. కాకతీయ యూనివర్సిటీ అతడికి గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది... ఇలా చదువుకోని డాక్టర్ గా మారారు. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా అందుకున్నారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో సుద్దాల హన్మంతు- జానకమ్మ జాతీయ పురస్కారం, 2024 లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్… ఇలాా అనేక్ పురస్కారాలు అందెశ్రీ అందుకున్నారు.