- Home
- Technology
- Bluetooth : మీ ఫోన్ లో కనిపించే బ్లూటూత్ కు ఆ పేరే ఎందుకు పెట్టారో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ
Bluetooth : మీ ఫోన్ లో కనిపించే బ్లూటూత్ కు ఆ పేరే ఎందుకు పెట్టారో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ
మనం కొన్ని వస్తువులను నిత్యం వాడుతుంటాం... కానీ వాటి చరిత్ర మనకు తెలియదు. ఇలాంటిదే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడుతున్న బ్లూటూత్ టెక్నాలజీ. అసలు ఏమిటీ బ్లూటూత్? దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

బ్లూటూత్ గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీ
Bluetooth : ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది... ప్రజలు ఈ వస్తువులను విరివిగా వాడుతున్నారు. కారు, బైక్, టీవి, కంప్యూటర్, ల్యాప్ టాప్ లే కాదు ఇళ్ళు, ఆఫీసుల్లో వాడే చిన్నచిన్న వస్తువుల వరకు అన్నీ ఎలక్ట్రానిక్ మయం అయిపోతున్నాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ లను ఒకదానితో ఒకటి లేదంటే మొబైల్ ఫోన్ తో కనెక్ట్ చేయీలన్నా బ్లూటూత్ టెక్నాలజీ తప్పనిసరి అయిపోయింది.
ఏమిటీ బ్లూటూత్ టెక్నాలజీ?
ఎలాంటి కేబుల్స్, వైర్లు లేకుండానే నిర్ణీత దూరంలో ఉన్న వస్తువులను కనెక్ట్ చేసి ఆపరేట్ చేసేందుకు ఉపయోగించే టెక్నాలజీయే ఈ బ్లూటూత్. ప్రస్తుతం అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసుకుని వాడుకునే సదుపాయం కల్పిస్తున్నారు. రెండు పరికరాలను ఒక్కసారి పెయిర్ చేస్తే చాలు... భవిష్యత్ లో బ్లూటూత్ ఆన్ చేస్తే చాలు ఆటోమెటిగ్గా కనెక్ట్ అవుతాయి.
మొబైల్ ను వైర్ లెస్ హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్ తో కనెక్ట్ చేసి పాటలు వినేందుకు, వీడియోలు చూసేందుకు ఈ బ్లూటూత్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇక ల్యాప్ టాప్ లకు వైర్ లెస్ కీబోర్డ్, మౌస్, ప్రింటర్ ను కనెక్ట్ చేయడానికి.. కార్లలో ఆడియో సిస్టమ్ ను వాడేందుకు బ్లూటూత్ వాడుతున్నారు. ఇలా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ బ్లూటూత్ ఆధారంగానే పనిచేస్తున్నాయి.
అసలు బ్లూటూత్ అనే పేరు ఎవరు పెట్టారు?
1990ల మధ్యలో ఎరిక్‌సన్, నోకియా, ఇంటెల్ లాంటి పెద్ద టెక్ కంపెనీలు కలిశాయి. ఈ క్రమంలో నిర్ణీత దూరంలోని ఎలక్ట్రానిక్ డివైజ్‌ల మధ్య వైర్లు లేకుండానే సమాచార మార్పిడి చేసేందుకు వీలుగా ఓ టెక్నాలజీని తయారు చేయాలనుకున్నాయి. అప్పటికే చాలా కంపెనీలు వేర్వేరు వైర్‌లెస్ టెక్నాలజీలపై పనిచేస్తుండటంతో వాటన్నింటినీ కలిపేందుకు ఒక ప్రాజెక్ట్ పేరు అవసరమైంది. ఆ సందర్భంలోనే 'బ్లూటూత్' అనే పేరు పుట్టింది.
బ్లూటూత్ పేరు వెనక ఆసక్తికరమైన స్టోరీ
1996లో ఇంటెల్ కంపెనీకి చెందిన జిమ్ కార్డాక్ ఈ వైర్‌లెస్ టెక్నాలజీకి తాత్కాలికంగా 'బ్లూటూత్' అని పేరు పెట్టాలని సూచించారు. అప్పుడు ఆయన వైకింగ్స్ హిస్టరీకి సంబంధించిన ఓ పుస్తకం చదువుతున్నారు. అందులో డానిష్, నార్వే రాజ్యాలను ఏకం చేసిన వైకింగ్ రాజు హరాల్డ్ బ్లూటూత్ గోర్మ్‌సన్ గురించి ఉంది. వేర్వేరు కంప్యూటర్, మొబైల్ రంగాలను ఒకే వైర్‌లెస్ టెక్నాలజీతో కలపడానికి ఈ పేరు సరిగ్గా సరిపోతుందని జిమ్ కార్డాక్ భావించారు. నిజానికి ఈ పేరు తాత్కాలికమే అనుకున్నారు... తర్వాత 'రేడియోవైర్' (RadioWire) లేదా 'PAN' (Personal Area Networking) వంటి పేర్లను పరిశీలించినా ట్రేడ్‌మార్క్ సమస్యల వల్ల 'బ్లూటూత్' పేరే స్థిరపడిపోయింది.
బ్లూటూత్ లోగో మీనింగ్ ఏంటి?
హరాల్డ్ గోర్మ్‌సన్ 10వ శతాబ్దంలో (సుమారు క్రీ.శ. 958 – 986) డెన్మార్క్, నార్వేలను పాలించిన వైకింగ్ రాజు. ఆయన అక్కడి గిరిజన తెగలను, చిన్న చిన్న రాజ్యాలను ఒకే గొడుగు కిందికి తెచ్చారు. ఆయన పళ్లలో ఒకటి పుచ్చిపోయి నలుపు-నీలం రంగులో ఉండేదట... అందుకే ప్రజలు ఆయనను 'బ్లూటూత్' రాజు అనేవారట. మరికొందరేమో ఆయనకు బ్లూబెర్రీలు ఇష్టం కాబట్టి పళ్లు నీలంగా మారాయని చెబుతారు.
బ్లూటూత్ లోగోను కూడా ఈ రాజు గౌరవార్థమే డిజైన్ చేశారు. ఇది పురాతన నార్స్ రూన్ అక్షరాలైన H (ᚼ), B (ᛒ) కలయిక. ఈ అక్షరాలు హరాల్డ్ బ్లూటూత్ పేరులోని మొదటి అక్షరాలను సూచిస్తాయి. ఇలా రాజ్యాలను ఏకం చేసిన రాజు పేరునే, డివైజ్‌లను ఏకం చేసే టెక్నాలజీకి పెట్టారు. ఇది ఆధనిక టెక్నాలజీకి, పురాతన హిస్టరీకి మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన బంధం.

