మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీగా 5జిబి డేటా.. కానీ అలా చేసిన వారికి మాత్రమే..
దేశీయ టెలికాం (telecom)దిగ్గజాలు ఎయిర్‌టెల్(airtel), రిలయన్స్ జియో(jio), వొడాఫోన్ ఐడియా(vi) వంటి ప్రైవేట్ కంపెనీలు ప్రీ-పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇందుకు సోషల్ మీడియాలో ప్రజలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కి మద్దతు ఇచ్చారు.
దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లు ఇప్పటికీ ప్రైవేట్ కంపెనీల కంటే చౌకగా ఉన్నాయి, అయితే బిఎస్‌ఎన్‌ఎల్ కవరేజీ తక్కువగా ఉండటం ఇంకా అన్ని సర్కిల్‌లలో 4జి సేవలను కలిగి ఉండకపోవడం మరో నిరాశాజనకమైన కారణం. బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు ఎప్పటికప్పుడు మంచి ఆఫర్లను అందిస్తూనే ఉంది. తాజాగా కంపెనీ మరో అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. దాని గురించి తెలుసుకుందాం...
కొత్త కస్టమర్లకు డేటా ఫ్రీ
బీఎస్‌ఎన్‌ఎల్ ఏ ఇతర నెట్‌వర్క్ నుండి అయినా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు వచ్చే కస్టమర్లకు 5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుందని తెలిపింది. ఈ ఉచిత డేటా వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఉచిత డేటా కోసం ఒక షరతు ఏమిటంటే మీరు సోషల్ మీడియాలో బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో ఎంఎన్‌పి చేయడానికి కారణాన్ని తెలియజేయాలి అలాగే దీనికి సంబంధించిన రుజువును కంపెనీకి పంపాలి.
బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఉచిత డేటా ఆఫర్ 15 జనవరి 2022 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ వెల్లడించింది. ఎంఎన్‌పి పూర్తయిన తర్వాత వినియోగదారులు #SwitchToBSNLతో Twitter అండ్ Facebookలో పోస్ట్ చేయాలి. దీనితో పాటు బిఎస్‌ఎన్‌ఎల్ ను కూడా ట్యాగ్ చేసి అనుసరించాల్సి ఉంటుంది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత ఉచిత డేటా కోసం వినియోగదారులు తమ సోషల్ మీడియా పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను నేరుగా ట్విట్టర్‌లో లేదా వాట్సాప్ నంబర్-9457086024లో మెసేజ్ లో పంపాలి. గత ఏడాది అక్టోబర్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ 23,000 మంది కస్టమర్‌లను కోల్పోయింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ వాటా 9.73 శాతంగా ఉంది.