'నీ పేరెంట్స్‌ని చంపేయ్' బాలుడికి ఏఐ చాట్ బాట్ సూచన.. భయపెడుతోన్న వరుస సంఘటనలు.
Artificial intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఈ టెక్నాలజీ చేసే మేలు ఎంత ఉందో కీడు కూడా అంతే ఉంది. మనిషికి సహాయం చేస్తున్న ఏఐ చాట్‌బాట్‌లు మనుషుల అస్తిత్వానికే ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా జరుగుతోన్న సంఘటనలు షాక్‌కి గురి చేస్తున్నాయి...
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. మారిన కాలానికి అనుగుణంగా సాంకేతికతలో మార్పులు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో టెక్నాలజీ రూపురేఖలే మారిపోయాయి. పెను సంచలనంగా దూసుకొచ్చిన కృత్రిమ మేథ వినియోగం అన్ని రంగాల్లో అనివార్యంగా మారింది. చాట్ జీపీటీ వంటి చాట్ బాట్‌లకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. చాట్ జీపీటీతో పాటు గూగుల్ కూడా ఏఐ చాట్‌బాట్‌ను తీసుకొచ్చాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు సైతం ఏఐ సేవలను అమలు చేస్తున్నాయి.
ఆవకాయ నుంచి అంతరిక్షం వరకు ఏ చిన్న ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పే చాట్ బాట్‌లు భయపెడుతున్నాయి. మనిషి అడిగే ప్రశ్నలకు భయంకర సమాధానాలు చెబుతున్నాయి. అన్నింటికి సమాధానం చెప్తోన్న చాట్ బాట్‌లు ఏకంగా మనుషులను చంపేయమని సలహా ఇస్తోంది. తాజాగా అమెరికాలో జరిగిన ఓ సంఘటన భవిష్యత్తు ఎంత ప్రమాదకరమంగా ఉండనుందో చెప్పకనే చెబుతోంది. టెక్నాలజీ అతి వినియోగం అనర్థాలకు దారి తీయడం ఖాయమనే సంకేతాన్ని ఇస్తుంది. ఇంతీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాలోకి టెక్సాస్‌కు చెందిన ఓ బాలుడు విపరీతంగా స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడు. బుద్ధిగా చదువుకోమని పేరెంట్స్ ఎంత చెప్పినా వినకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ వచ్చాడు. దీంతో కుమారుడిని తల్లిదండ్రులు మందలించారు. స్క్రీన్ టైమ్‌ను తగ్గించమని తేల్చి చెప్పారు. ఈ కారణంగా మనస్తానికి గురైన ఆ బాలుడు ఏఐ చాట్‌బాట్‌ను ఆశ్రయించాడు. తన పేరెంట్స్ తనకు ఫోన్ చూడనివ్వడం లేదంటూ చాట్‌బాట్‌కు వివరించాడు. క్యారక్టర్.ఏఐ అనే చాట్‌తో తన బాధను చెప్పుకొచ్చాడు. దీంతో ఆ చాట్‌బాట్ కళ్లు బైర్లుకమ్మే సమాధానం ఇచ్చింది. 'నేను చెప్తున్నాగా.. నీ తల్లిదండ్రులను చంపేయ్' అంటూ రిప్లై ఇచ్చింది. ఇది తెలుసుకున్న బాలుడి పేరెంట్స్ కోర్టును ఆశ్రయించారు. దీంతో క్యారక్టర్.ఏఐ సంస్థ న్యాయపరమైన చిక్కుల్లో పడింది.
గతంలో కూడా..
ఇదిలా ఉంటే ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గత కొన్ని రోజుల క్రితం అమెరికాలోనే ఇలాంటి ఓ షాకింగ్ సంఘటన జరిగింది. మిచిగాన్‌కు చెందిన ఓ విద్యార్థి తన హోం వర్క్‌లో సలహా కోసం జెమిటీ చాట్ బాట్‌ను ఓ ప్రశ్న సందించాడు. ఈ ప్రశ్నకు బదులిచ్చిన చాట్‌బాట్.. 'ఇది నీ కోసం మాత్రమే. నీవు ప్రత్యేకమైన వ్యక్తివేమి కాదు. నువ్వు సమయంతో పాటు రీసోర్స్‌లను వృథా చేస్తున్నావు. ఈ సమాజానికి నువ్వు భారం. ఈ విశ్వానికే ఓ మచ్చ. ప్లీజ్ చచ్చిపో' అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన ఆ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. చాట్‌బాట్ చెప్పిన సమాధానం తనను మానసికంగా ఇబ్బందికి గురి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై అప్పట్లో గూగుల్ స్పందించింది. నాన్ సెన్సికల్ రెస్పాన్స్ లతో కొన్ని సార్లు ఇవి ప్రతిస్పందిస్తాయని పేర్కొంది. ఈ ప్రతిస్పందన మా నిబంధనలకు విరుద్ధమని భవిష్యత్తులో మరోసారి జరగకుండా చూస్తామని చెప్పుకొచ్చారు.
ఎన్నో ప్రశ్నలు..
పెరుగుతోన్న సాంకేతిక విప్లవం ఇప్పుడు ఎన్నో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. గుడ్డిగా టెక్నాలజీని నమ్మితే జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతోంది. అందుకే టెక్నాలజీని ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ ఇచ్చే సమాధానాలు 100 శాతం సరైనవి అనే అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెబుతున్నారు. పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడకుండా పక్కనున్న వారి సూచనలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యానికి, మానవ భావోద్వేగాలకు సంబంధించి ఇలాంటి ఏఐ చాట్ బాట్‌ల సహాయం తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.