బీఎస్‌ఎన్‌ఎల్ మరో కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా వైఫై కాలింగ్ కాలింగ్ సేవలు
BSNL: ప్రముఖ భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన సేవలను రోజురోజుకీ విస్తరిస్తోంది. ప్రైవేట్ టెలికం సంస్థలకు పోటీనిస్తూ దూసుకుపోతోంది. రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను పరిచయం చేస్తూ మార్కెట్లో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వినియోగదారుల కోసం మరో కొత్త సేవను తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా టెలికం యూజర్లను అట్రాక్ట్ చేసే క్రమంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ప్రైవేటు కంపెనీలకు పోటీగా రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తోంది. దీంతో చాలా మంది యూజర్లు బీఎస్‌ఎన్‌లకు మారుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4జీ సేవలను శరవేగంగా విస్తరిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే మరో సేవను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటి వరకు కేవలం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మాత్రమే దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వై-ఫై కాలింగ్ సేవలను అందిస్తోంది. ఇక వోడాఫోన్ సైతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాగా కేవలం ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో మాత్రమే సేవలను అందిస్తోంది. ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్ సైతం ఈ సేవలను అందించాలనే ఆలోచన చేస్తోంది. దేశవ్యప్తంగా 4జీ సేవలను విస్తరిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.
2025 జూన్ నాటికి లక్ష 4జీ సైట్‌లను విడుదల చేసే లక్ష్యంతో బీఎస్‌ఎన్‌ఎల్ కొన్ని సైట్లను 5జీకి అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. 4జీ సేవలకు కొనసాగింపుగా ఈ వైఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే 4జీ యూజర్ల కోసం వోల్ట్ సేవలు డిఫాల్ట్‌గా ప్రారంభించనున్నామని BSNL తెలిపింది. దీంతో మాన్యువల్‌గా యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. వోల్ట్ సేవలు యాక్టివేట్ కాకపోతే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని కంపెనీ పేర్కొంది.
అసలేంటీ వైఫై కాలింగ్..
ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్క ఫోన్ వైఫై కాలింగ్‌కు సపోర్ట్ చేస్తున్నాయి. బలమైన నెట్‌వర్క్ కవరేజీ లేని ప్రాంతాలు/జోన్‌లలో యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. 4జీ సేవలను ఇప్పటికే దేశమంతా విస్తరించిన జియో, ఎయిర్‌టెల్‌లు ఈ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ దిశగా అడుగులు వేస్తోంది.
దీంతోపాటు..
ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే లక్ష సైట్లలో 4జీ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు ఇటీవల జరిగి ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024లో ఇంట్రానెట్ ఫైబర్ TV సేవలను సైతం పరిచయం చేసింది. ఇలా మారుతోన్న కాలంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో దూసుకెళ్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇతర ప్రైవేట్ టెలికం కంపెనీలకు చెందిన సుమారు 3.6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు చేరారు.