WPL : ముంబై దెబ్బకు మిగతా జట్లు అబ్బా.. డబ్ల్యూపీఎల్ 2026లో సీన్ రిపీట్ !
WPL 2026 Power Rankings : డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్ల బలాబలాల విశ్లేషణలో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో నిలవగా, గుజరాత్ జెయింట్స్ వెనుకబడింది. ఆర్‌సీబీ బౌలింగ్ బలంగా ఉన్నా, బ్యాటింగ్ లోతుపై ఆందోళనలు ఉన్నాయి.

WPL 2026: ఆర్‌సీబీకి బిగ్ షాక్.. పవర్ ర్యాంకింగ్స్‌లో ఎన్నో స్థానమంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. తొలిపోరు శుక్రవారం ఆర్సీబీ, ముంబై మధ్య జరగనుంది. వేలం తర్వాత జట్ల బలాబలాలను బట్టి చూస్తే, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి అత్యంత బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో WPL 2026 పవర్ ర్యాంకింగ్స్, జట్ల విశ్లేషణ, తుది జట్టు అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
5. గుజరాత్ జెయింట్స్
గుజరాత్ జెయింట్స్ జట్టు గత సీజన్‌లో పవర్ ప్లే బ్యాటింగ్‌లో చాలా ఇబ్బంది పడింది. అయితే ఈసారి సోఫీ డివైన్, యాస్తికా భాటియా, డానీ వ్యాట్-హాడ్జ్‌ల రాకతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. వీరు తమ టాప్-4లో వ్యాట్-హాడ్జ్, మూనీ, డివైన్, గార్డ్‌నర్‌లతో కూడిన విదేశీ స్టార్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
అయితే, ఇలా చేయడం వల్ల లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కాస్త బలహీనపడే ప్రమాదం ఉంది. కానీ, వారి ఆల్ ఇండియన్ బౌలింగ్ ఎటాక్ మాత్రం పటిష్టంగానే ఉంది. అనుభవజ్ఞురాలైన రాజేశ్వరి గైక్వాడ్ స్పిన్ విభాగంలో ఉండగా, పవర్ ప్లే స్పెషలిస్ట్ రేణుకా సింగ్ పేస్ బాధ్యతలు మోయనుంది. కాశ్వి గౌతమ్, టిటాస్ సాధు వంటి యువ పేసర్లు జట్టులో ఉన్నారు. కాశ్వి గౌతమ్ బ్యాటింగ్ లో కూడా అదరగొడుతుంది.
ఒకవేళ యాస్తికా భాటియా గాయం నుంచి కోలుకుంటే, ఆమెను మూడో స్థానంలో ఆడించి, బౌలింగ్‌లో జార్జియా వేర్‌హామ్‌ను తీసుకునే అవకాశం కూడా ఉంది. వేర్‌హామ్ డెత్ ఓవర్లలో కీలక పాత్ర పోషించగలదు. గత మూడేళ్లలో టీ20ల్లో ఆమె స్లాగ్ ఓవర్లలో 7.7 ఎకానమీతో 33 వికెట్లు పడగొట్టింది.
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఆర్‌సీబీకి ఈ సీజన్‌లో ఎల్లిస్ పెర్రీ సేవలు అందుబాటులో లేకపోవడం అతిపెద్ద లోటు. ఈ విషయం వేలానికి ముందే తెలిసినా, ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ తమ బౌలింగ్ ఎటాక్‌ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. 2024 ఛాంపియన్స్ అయిన ఆర్‌సీబీ.. పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, లారెన్ బెల్, లిన్సే స్మిత్ వంటి స్టార్ బౌలర్లను ఎంచుకుంది.
బ్యాటింగ్ విషయానికి వస్తే, జార్జియా వోల్, గ్రేస్ హారిస్ వంటి హిట్టర్లు జట్టులో చేరారు. రత్నగిరి జెట్స్ తరఫున మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో 132 స్ట్రైక్ రేట్‌తో 173 పరుగులు చేసిన గౌతమి నాయక్.. స్మృతి మంధానతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే భారతీయ బ్యాటర్ల లోతు లేకపోవడం ఆర్‌సీబీకి ప్రధాన సమస్యగా మారవచ్చు. ఒకవేళ స్పిన్నర్ ప్రేమ రావత్ రాణించకపోతే, ఆర్‌సీబీ విదేశీ కోటాలో మార్పులు చేసి లిన్సే స్మిత్‌ను ఆడించాల్సి రావచ్చు.
3. యూపీ వారియర్స్
వేలంలో యూపీ వారియర్స్ అద్భుతమైన వ్యూహంతో ఆటగాళ్లను సొంతం చేసుకుంది. మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ వంటి సూపర్ స్టార్లను తీసుకోవడమే కాకుండా, సోఫీ ఎక్లెస్టోన్‌ను తక్కువ ధరకు దక్కించుకుంది. దీప్తి శర్మ తిరిగి జట్టులోకి రావడం, కిరణ్ నవ్‌గిరే, డియాండ్రా డాటిన్, శిఖా పాండే వంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం యూపీకి కలిసొచ్చే అంశం.
వికెట్ కీపింగ్ విభాగంలో షిప్రా గిరి ఒక్కరే లిస్ట్ అయినప్పటికీ, మెగ్ లానింగ్ లేదా అద్భుతమైన ఫీల్డర్ అయిన లిచ్‌ఫీల్డ్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే రిటైన్ చేసుకున్న శ్వేతా సెహ్రావత్ కూడా నెట్స్‌లో కీపింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. బ్యాటింగ్ పరంగా యూపీ వారియర్స్ చాలా బలంగా ఉంది. ఇన్నింగ్స్ చివరిలో ఓవర్‌కు 10 పరుగులు రాబట్టగల సత్తా వారికి ఉంది. దీప్తి, ఎక్లెస్టోన్, శోభన స్పిన్ త్రయం ప్రత్యర్థులకు సవాలు విసరనుంది.
2. ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంది. చిభెల్ హెన్రీ, లిజెల్లీ లీ వంటి పవర్ హిట్టర్లను జట్టులో చేర్చుకుంది. అలాగే 16 ఏళ్ల సంచలన బ్యాటర్ దియా యాదవ్‌ను కూడా కైవసం చేసుకుంది. అన్నాబెల్ సదర్లాండ్ ఈ సీజన్‌కు అందుబాటులో లేకపోవడం ఢిల్లీకి గట్టి దెబ్బే అయినా, ఆమె స్థానంలో లెగ్ స్పిన్నర్ ఎలానా కింగ్‌ను తీసుకున్నారు.
పేస్ బౌలింగ్‌లో మారిజన్నే కాప్ కీలక పాత్ర పోషించనుండగా, దేశవాళీ బౌలర్ నందని శర్మపై ఢిల్లీ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. లారా వోల్వార్డ్ట్, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఢిల్లీకి ప్రధాన బలం. అయితే వికెట్ కీపింగ్ ఆప్షన్ కోసం మమతా మాడివాలాను ఆడిస్తారా లేదా లిజెల్లీ లీకి కీపింగ్ బాధ్యతలు అప్పగిస్తారా అనేది చూడాలి. లీ ఆడితే బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది.
1. ముంబై ఇండియన్స్
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. తమ పాత కోర్ టీమ్‌ను దాదాపుగా తిరిగి దక్కించుకుంది. నాట్ సీవర్-బ్రంట్, హేలీ మాథ్యూస్‌లను అట్టిపెట్టుకోగా, అమేలియా కెర్‌ను వేలంలో తిరిగి కొనుగోలు చేసింది. సైకా ఇషాక్, షబ్నిమ్ ఇస్మాయిల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. దీంతో గత సీజన్లో ఆడిన 10 మంది ఆటగాళ్లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.
ఈసారి ముంబై జట్టులో అందరి దృష్టి 17 ఏళ్ల జి. కమలిని పైనే ఉంది. సీనియర్ ఉమెన్స్ టీ20 కప్‌లో తమిళనాడు తరఫున 7 మ్యాచ్‌ల్లో 297 పరుగులు చేసిన కమలిని.. యాస్తికా భాటియా లేని లోటును పూడ్చే అవకాశం ఉంది. ఆమె ఫామ్ చూస్తుంటే ముంబై బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారినట్లు కనిపిస్తోంది. పటిష్టమైన బౌలింగ్, స్థిరమైన బ్యాటింగ్ లైనప్‌తో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసులో అందరికంటే ముందుంది.

