మహిళల వరల్డ్ కప్ 2025లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు
Top 5 Wicket Takers in Womens World Cup: మహిళల ప్రపంచ కప్ 2025లో అత్యధిక వికెట్లు సాధించిన టాప్ 5 బౌలర్ల జాబితాలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

మహిళా ప్రపంచ కప్ 2025లో బౌలర్ల జోరు
Top 5 Wicket Takers in Womens World Cup: మహిళల ప్రపంచ కప్ 2025లో బౌలర్లు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి తమ జట్ల విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన టాప్ 5 బౌలర్ల జాబితా ఇప్పుడు అధికారికంగా విడుదలైంది.
భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తన అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచి టోర్నమెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా మహిళా ప్రపంచ కప్ 2025 లో అత్యధిక వికెట్లు సాధించిన టాప్ 5 బౌలర్ల వివరాలు గమనిస్తే..
1. దీప్తి శర్మ
భారత జట్టు స్టార్ బౌలర్ దీప్తి శర్మ మహిళా ప్రపంచ కప్ 2025 లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచారు. 9 మ్యాచ్‌ల్లో 81.2 ఓవర్లు వేసి 488 బంతుల్లో 22 వికెట్లు సాధించింది. ఆమె సగటు 20.41 కాగా, మొత్తం 449 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఒకసారి 4 వికెట్లు, ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శనలు ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో ఆకట్టుకుంది. కీలకమైన సమయంలో ఈ మ్యాచ్ లోనే 5 వికెట్లతో దీప్తి శర్మ సత్తా చాటింది. దీప్తి స్పిన్ బౌలింగ్ తో మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో ఆమె కీలక బ్రేక్‌త్రూలు అందించారు.
2. అన్నాబెల్ సదర్లాండ్
మహిళా ప్రపంచ కప్ 2025 లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ ఆస్ట్రేలియా స్టార్ అన్నాబెల్ సదర్లాండ్. ఆమె 7 మ్యాచ్‌ల్లో 60.2 ఓవర్లు వేసి 17 వికెట్లు తీశారు. ఆమె సగటు కేవలం 15.82 మాత్రమే ఉండటం గమనార్హం.
269 పరుగులు ఇచ్చిన అన్నాబెల్ సదర్లాండ్ ఒకసారి 5 వికెట్లను కూడా తీసుకున్నారు. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
3. సోఫీ ఎక్లెస్టోన్
ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ తన అద్భుతమైన లైన్, లెంగ్త్ బౌలింగ్ తో మహిళా ప్రపంచ కప్ లో మరోసారి మెప్పించింది. ఆమె 7 మ్యాచ్‌ల్లో 56.1 ఓవర్లు వేసి 16 వికెట్లు సాధించింది. ఆమె సగటు 14.25గా ఉండగా, 228 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఎక్లెస్టోన్ రెండు సార్లు 4 వికెట్లను సాధించారు.
4. శ్రీ చరణి
తెలుగు అమ్మాయి, భారత యంగ్ బౌలర్ శ్రీ చరణి కూడా ఈ టాప్ లిస్ట్‌లో చోటు సంపాదించింది. ఈ టోర్నమెంట్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంది. ఆమె 9 మ్యాచ్‌ల్లో 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీశారు. సగటు 27.64గా ఉండి, మొత్తం 387 పరుగులు ఇచ్చారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టుగా మద్దతు ఇచ్చింది.
5. అలనా కింగ్
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అలనా కింగ్ 7 మ్యాచ్‌ల్లో 56 ఓవర్లు వేసి 13 వికెట్లు సాధించింది. ఆమె సగటు 17.38 కాగా, 226 పరుగులు ఇచ్చారు. ఒకసారి 5 వికెట్లు సాధించడం ద్వారా టోర్నమెంట్‌లో తన ప్రభావాన్ని చూపింది.
మొత్తం మీద, మహిళల ప్రపంచ కప్ 2025లో స్పిన్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలవడం భారత బౌలింగ్ శక్తిని ప్రపంచానికి తెలియజేసింది. భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంలో దీప్తి ప్రదర్శన కీలక పాత్ర పోషించింది.