Tilak Varma : తిలక్ వర్మ సక్సెస్ వెనకున్నది ఈ ఇద్దరు హైదరబాదీలే.. ఎవరో తెలుసా?
Tilak Varma : తిలక్ వర్మ సక్సెస్ వెనక ఓ ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. వారికి తన తల్లిదండ్రులతో సమానమైన స్థానాన్ని ఇస్తానని స్వయంగా తిలక్ తెలిపాడు. ఇంతకూ ఆ ఇద్దరు ఎవరో తెలుసా?

ఆసియా కప్ హీరో తిలక్ వర్మ ఆసక్తికర కామెంట్స్
Tilak Varma : ఆసియా కప్ 2025 లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దాయాది పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో టీమిండియాను గెలిపించి హీరో అయిపోయాడు మన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇండియాను అతడి ఆటే గట్టేక్కించింది... దీంతో ప్రధాని మోదీ సహా రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ ప్రముఖులంతా తిలక్ ను అభినందిస్తున్నారు. ఇక తెలుగు ప్రజలు తిలక్ వర్మ మావాడే అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలా ఆసియా కప్ విజయంతర్వాత హైదరాబాద్ కు వచ్చిన తిలక్ వర్మకు సాదరస్వాగతం లభించింది. తొలిసారిగా అతడు మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నా విజయం వెనకున్నది ఈ ఇద్దరే
ఆసియా కప్ 2025 విజయం తర్వాత స్వస్థలానికి వచ్చిన తిలక్ వర్మ మొట్టమొదట తాను క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న కోచింగ్ సెంటర్ ను సందర్శించారు. హైదరాబాద్ లోని లేగాలా క్రికెట్ అకాడమీని సందర్శించిన అతడు చిన్ననాటి కోచ్ లను కలిసారు. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన తిలక్ తన గురువులను పరిచయం చేశారు... వారివల్లే తాను ఈ స్థాయికి ఎదిగానంటూ చాలా గొప్పగా చెప్పకొచ్చారు.
అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగిన తర్వాత తనపేరు అందరికీ తెలిసింది... తాజాగా ఆసియా కప్ విజయం తర్వాత మరింతమందికి తెలిసివుంటుంది... కానీ ఎవరికీ తెలియని సమయంలో ఈ కోచ్ లే తనకు అన్నీ అయ్యారని తిలక్ కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ అకాడమీలో తనకు శిక్షణ ఇచ్చింది ఈ సలాం భాయ్, పృథ్విలే అని పక్కనే ఉన్న కోచ్ లను పరిచయం చేశారు తిలక్. వీరివల్లే ఈ స్థాయికి చేరుకున్నానని... ఇంకెంత ఎత్తుకు ఎదిగినా క్రికెటర్ గా తీర్చిదిద్దిన ఈ ఇద్దరిని మర్చిపోలేనని అన్నారు. తన సక్సెస్ లో తల్లిదండ్రుల పాత్ర ఎంతుందో వీరిది కూడా అంతేనని తిలక్ గురువుల గురించి చాలా గొప్పగా చెప్పారు.
తిలక్ కోచింగ్ తీసుకున్నది ఈ అకాడమీలోనే...
తిలక్ వర్మ కుటుంబం హైదరాబాద్ లోని లింగంపల్లి ప్రాంతంలో నివాసం ఉంటుంది. కాబట్టి అతడు చిన్నతనంలో ఇదే ప్రాంతంలోని లేగాలా స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందాడు. ఈ అకాడమీతో తిలక్ అనుబంధాన్ని పెంచుకున్నారు... అందుకే ఆసియా కప్ లో అద్భుత ప్రదర్శన తర్వాత మొదటిసారి ఇక్కడికే వెళ్ళారు. తనకు చిన్నప్పటి నుండి కోచింగ్ ఇచ్చిన గురువులను పరిచయం చేశారు.
ఈ లేగాలా క్రికెట్ అకాడమీ గురించి తిలక్ చాలా గొప్పగా చెప్పారు. అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగినా ఈ అకాడమీని మర్చిపోనని... దీంతో తనకు ఎమోషనల్ బాండింగ్ ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా తన ప్రదర్శన బాగాలేకపోతే ఇక్కడికే వచ్చి ప్రాక్టిస్ చేస్తానని అన్నారు. ఈ మట్టిలో ఏదో మ్యాజిక్ ఉంది... ఇక్కడ ఆడితే చాలా కాన్ఫిడెంట్ వస్తుందన్నారు.
ఆసియా కప్ తో పాటు అదికూడా నా బెస్ట్ ఇన్నింగ్స్
తిలక్ వర్మ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ పై బెస్ట్ ఇన్నింగ్స్ ఆడారు. అతడి ఇన్నింగ్స్ టీమిండియాను గెలిపించింది. అయితే ఇలాంటి బెస్ట్ ఇన్నింగ్స్ తన కెరీర్లో ఇంకొకటి కూడా ఉందని తిలక్ వర్మ గుర్తుచేసుకున్నారు. చెన్నైలో ఇంగ్లాండ్ తో ఆడిన ఇన్నింగ్స్ కూడా తనకెంతో ప్రత్యేకమని తిలక్ వర్మ గుర్తుచేసుకున్నారు.
ఆసియా కప్ లాంటి ఐసిసి టోర్నీ ఫైనల్లో... అది పాకిస్థాన్ పై అండర్ ప్రెషర్ లో ఆడి జట్టును గెలిపించడం చాలా ప్రత్యేకమని తిలక్ వర్మ అన్నారు. 200 పరుగులు చేసినప్పటికి కంటే ఇది చాలా స్పెషల్ అని అన్నారు. దేశ ప్రజలు గర్వంగా తలెత్తుకునేలా చేసింది... దేశ ప్రతిష్టను తన ఇన్నింగ్స్ కాపాడిందంటే ఇంతకంటే ఏం కావాలి అంటూ తిలక్ ఆటతోనే కాదు మాటలతోనూ ఆకట్టుకున్నారు.
దేశంకోసమే మైదానం మౌనం.. ఆటతోనే ఆన్సర్ : తిలక్ వర్మ
తనకు అవకాశాలు ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, బిసిసిఐకి ధన్యవాదాలు తెలిపారు తిలక్ వర్మ. ఎప్పుడూ తాను దేశం గురించే ఆలోచించే ఆడతానని అన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ ఆపరేషన్ తిలక్ అంటూ ప్రధాని మోదీ ప్రశంసించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సరైన సమయంలో సరిగ్గా ఆడాను... ఇండియాకు ఆడుతున్నాను కాబట్టి దేశాన్ని కిందపడకుండా చూడాలని అనుకున్నట్లు తెలిపారు. అందుకే పాకిస్థాన్ ఆటగాళ్ళు ఎంత రెచ్చగొట్టినా బ్యాట్ తోనే సమాధానం చెప్పానని తిలక్ వర్మ అన్నారు.