PR Sreejesh : కీలక పదవిలో భారత హాకీ స్టార్ పీఆర్ శ్రీజేష్
PR Sreejesh : పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో భారత హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల శ్రీజేష్ రెండు ఒలింపిక్ మెడల్స్ గెలుచుకున్న మొదటి కేరళీయుడిగా ఘనత సాధించాడు.
PR Sreejesh
Hockey India PR Sreejesh : 18 ఏళ్ల అద్భుతమైన కెరీర్‌లో భారత హాకీ జట్టు రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన స్టార్, సీనియర్ హాకీ ప్లేయర్ పీఆర్ శ్రీజేష్. భారత హాకీ జట్టు అనేక అద్భుతమైన విజయాల్లో తనదైన రోల్ పోషించాడు. తన కెరీర్ లో భారత జట్టు రెండు సార్లు ఒలింపిక్ మెడల్ (2020 టోక్యో, 2024 పారిస్) సాధించడంలో తనదైన పాత్రతో దేశం గర్వించదగ్గ అత్యుత్తమ హాకీ గోల్‌కీపర్‌గా శ్రీజేష్ గుర్తింపు పొందాడు. పారిస్ లో తన చివరి మ్యాచ్ ఆడినట్టుగా ప్రకటించి హాకీ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.
రిటైర్మెంట్ తీసుకున్న పీఆర్ శ్రీజేష్ త్వరలో కొత్త పాత్రలో కనిపించనున్నారు. హాకీ ఇండియా అతన్ని జూనియర్ జాతీయ జట్టు కోచ్‌గా ప్రకటించనుందని సమాచారం. పారిస్ ఒలింపిక్స్ 2024 లో గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత 36 ఏళ్ల శ్రీజేష్ తన అద్భుతమైన గోల్‌కీపింగ్ కెరీర్‌కు తెర దించాడు. దీంతో అతని సేవలను ఉపయోగించుకోవాలని భారత భావిస్తోంది.
శ్రీజేష్ ను భారత జూనియర్ హాకీ జట్టు కోచ్ నియామకం గురించి హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ మాట్లాడుతూ.. "మరికొద్ది రోజుల్లో శ్రీజేష్‌ని పురుషుల జూనియర్ జట్టు కోచ్‌గా (అండర్-21) నియమిస్తాం. దీని గురించి మేము అతనితో చర్చించాము. యువకులకు మార్గనిర్దేశం చేయడం, వారిని ప్రోత్సహించడంలో అతనిని మించిన వారు ఎవరూ లేరని" పేర్కొన్నారు. అలాగే, బ్రిటన్‌పై పారిస్‌లో అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించాడనీ, రాబోయే యంగ్ గోల్‌కీపర్‌లకు కూడా మార్గనిర్దేశం చేస్తాడని చెప్పారు.
శ్రీజేష్ రిటైర్మెంట్ తో అతని స్థానంలో గోల్ కీపర్లుగా రాబోతున్న భారత హాకీ ప్లేయర్లైన క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరాలకు కూడా అతను మార్గనిర్దేశం చేయాలని హాకీ ఇండియా కోరింది. "అతని స్థానంలోకి రాబోతున్న క్రిషన్, సూరజ్‌లకు మార్గనిర్దేశం చేయడంలో శ్రీజేష్ కూడా పాలుపంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. అతనికి అపారమైన అనుభవం, హాకీ ట్రేడ్‌లో ట్రిక్కులు అతని చాలా తెలుసు" అని టిర్కీ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది డిసెంబర్‌లో భారత్‌లో పురుషుల జూనియర్ ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలోనే భారత్ జట్టు విజయానికి శ్రీజేష్ సేవలు కీలకం అవుతాయని హాకీ ఇండియా భావిస్తోంది. "గతంలో కూడా అతను జూనియర్ జట్టుకు సహాయం చేసినట్లే వచ్చే ఏడాది జూనియర్ ప్రపంచ కప్‌లో జట్టుకు మార్గనిర్దేశం చేయడానికి, యంగ్ ప్లేయర్లకు స్ఫూర్తినిచ్చేందుకు శ్రీజేష్ కూడా మాకు చాలా కీలకం" అని టిర్కీ తెలిపారు. అలాగే, పారిస్‌లో భారత హాకీ జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తి చెందాననీ, జట్టు కలిసికట్టుగా ఆడిందని చెప్పారు.