బుమ్రా కాదు.. టీ20 వరల్డ్ కప్ లో భారత్‌కు అసలైన ఆయుధాలు వీరే
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజయానికి కీలకం అవ్వబోయే ఇద్దరు ఆటగాళ్లను రవిచంద్రన్ అశ్విన్ గుర్తించాడు. బుమ్రాను పక్కన పెట్టి వారిని ఎందుకు ఎంపిక చేశాననే వివరాలు కూడా వెల్లడించాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ 2026పై అశ్విన్ అంచనాలు
భారత మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లను గుర్తించాడు. భారత్, శ్రీలంక కలిసి నిర్వహించబోయే ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించడంతో ఈసారి పురుషుల జట్టుపై మరింతగా అంచనాలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. “భారత్ విజయం కోసం రెండు ముఖ్యమైన ఆయుధాలు ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ఆ ఆయుధాల్లో స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా లేడు” అని తెలిపారు.
ఆ ఇద్దరు ఎవరు? బుమ్రాను ఎందుకు తప్పించాడు?
జస్ప్రిత్ బుమ్రా 2024 టీ20 వరల్డ్ కప్ విజయంలో భారత్‌కు ప్రధాన బౌలర్‌గా 15 వికెట్లు సాధించాడు. అయితే, అశ్విన్ అభిప్రాయం ప్రకారం బుమ్రా ఇప్పుడు ప్రత్యర్థి జట్లకు తెలిసిన వ్యూహాత్మక బౌలర్. జట్లు అతని ఓవర్లను ఎదుర్కోవడానికి ప్రత్యేక ప్రణాళికలతో వస్తున్నాయి.
అతని బౌలింగ్ ను అంచనా వేశాయి. దానికి తగిన ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి రాబోయే ప్రపంచ కప్ లో బుమ్రా జట్టులో ప్రధాన పాత్ర పోషించినా కీ ప్లేయర్ మాత్రం కాదని అన్నాడు.
వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ఐసీసీ వరల్డ్ కప్ లో భారత జట్టు అసలైన ఆయుధాలని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్లకు వీరితో చమటలు పట్టడం పక్కా అంటూ కామెంట్స్ చేశాడు.
“ఇప్పుడు ప్రతి జట్టూ బుమ్రా కోసం సన్నద్ధంగా ఉంటుంది. కానీ వారు వరుణ్ చక్రవర్తి స్పిన్, అభిషేక్ శర్మ దూకుడు ఆటను ఎలా ఎదుర్కొంటారనేది నిజమైన సవాలు అవుతుంది” అని అశ్విన్ అన్నాడు.
అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి.. రెండు విభిన్న శైలీలు
అశ్విన్ విశ్లేషణ ప్రకారం, ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ విభిన్న ఆట శైలీతో ప్రత్యర్థులకు తలనొప్పిగా మారవచ్చు. వరుణ్ చక్రవర్తి భారత పిచ్‌లపై తన మిస్టరీ స్పిన్‌తో ప్రభావం చూపగలడు. మరోవైపు, అభిషేక్ శర్మ టాప్ ఆర్డర్‌లో బంతిని బలంగా కొడుతూ భారత్‌కు వేగవంతమైన ఆరంభాన్ని అందిస్తాడు.
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 68 పరుగులతో అదరగొట్టాడు. అదే మ్యాచ్‌లో వరుణ్ 4 ఓవర్లలో కేవలం 23 పరుగులకే 2 వికెట్లు సాధించాడు.
ఆస్ట్రేలియా వ్యూహం.. ఇతర జట్లకు పాఠం
అశ్విన్ తన వీడియోలో ఆస్ట్రేలియా ప్రస్తుతం అభిషేక్ శర్మ పై వాడుతున్న షార్ట్ బాల్ వ్యూహాన్ని ఇతర జట్లు కూడా వరల్డ్ కప్‌లో అనుసరించే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
“అభిషేక్ శర్మను ఎదుర్కొనే విధానం ఆస్ట్రేలియా చూపించింది. ఇతర జట్లు కూడా దానిని అనుకరించే అవకాశం ఉంది. అయితే, వరుణ్ చక్రవర్తి స్పిన్‌ను అర్థం చేసుకోవడమే వారి ప్రధాన పరీక్ష అవుతుంది” అని అశ్విన్ అన్నాడు.
భారత జట్టు ప్రతిభావంతమైన ఆటగాళ్లతో ఉన్నప్పటికీ, అశ్విన్ అభిప్రాయం ప్రకారం భారత్ పై విజయం సాధించాలంటే అభిషేక్ శర్మ దూకుడు, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌ను ఆపగలగాలి. “టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించాలంటే, ఈ ఇద్దరినీ ఎదుర్కోవడమే ప్రధాన పరీక్ష” అని అశ్విన్ తేల్చిచెప్పాడు.
భారత జట్టు ప్రస్తుత ఫామ్ ఎలా ఉంది?
ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. భారత్ 4వ మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వచ్చింది. ఆ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, శివం దూబే, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు.
వరుణ్ చక్రవర్తి (1/26), బుమ్రా (1/27), అర్ష్‌దీప్ సింగ్ (1/22) కూడా కీలక పాత్ర పోషించారు.