1 కేజీ దూరంలో పారిస్ ఒలింపిక్ మెడల్ మిస్సైన మీరాబాయి చాను
Mirabai Chanu : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి కొద్ది దూరంలో మెడల్ మిస్సయ్యారు. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా అవతరించే అవకాశాన్ని కోల్పోయారు.
Image credit: PTI
రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచే అవకాశాన్ని సాయిఖోమ్ మీరాబాయి చాను కోల్పోయారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు నాల్గో మెడల్ ను అందించేలా కనిపించారు కానీ, నాల్గో స్థానంలో నిలిచారు. మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను పోటీ పడ్డారు. స్నాచ్ రౌండ్ లో మీరాబాయి చాను 88 కేజీల బెస్ట్ స్నాచ్ లిఫ్ట్‌తో మూడో స్థానంలో నిలిచింది. రొమేనియాకు చెందిన వాలెంటినా కాంబీ 93 కేజీలతో మొదటి స్థానంలో నిలవగా, చైనాకు చెందిన జిహుయ్ హౌ స్నాచ్ రౌండ్‌లో 89 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, క్లీన్ అండ్ జెర్క్‌లో మూడో ప్రయత్నంలో 114 కేజీల మార్కును క్లియర్ చేయడంలో విఫలమైంది. దీంతో ఆమె పతక పోటీని కోల్పోయింది.
వీజేతలు వీరే:
1. హౌ ఝిహుయ్, చైనా, 206 కేజీలు: బంగారం పతకం
2. మిహేలా కాంబీ, రొమేనియా 205 కేజీలు: వెండి పతకం
3. సురోద్చన ఖంబావో, థాయిలాండ్, 200 కేజీలు: కాంస్యం
4. సాయిఖోమ్ మీరాబాయి చాను, భారతదేశం, 199 కేజీలు
ఒలింపిక్ రజత పతక విజేత, ప్రపంచ ఛాంపియన్, మూడు సార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత అయిన మీరాబాయి చాను భారతదేశ అత్యుత్తమ వెయిట్ లిఫ్టర్లలో ఒకరు. టోక్యో 2020 ఒలింపిక్స్ లో మీరాబాయి రజతం గెలుచుకున్నారు. కర్ణం మల్లీశ్వరి తర్వాత భారత వెయిట్‌లిఫ్టర్ సాధించిన రెండవ ఒలింపిక్ పతకం ఇది. అలాగే, పీవీ సింధు తర్వాత ఒలింపిక్ రజత పతకాన్ని గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ మీరాబాయి చాను. రియో 2016లో ఆమె తొలి ఒలింపిక్స్‌లోకి 12 సంవత్సరాల జాతీయ రికార్డును బద్దలు కొట్టి ప్రవేశించింది. కానీ ఆమె క్లీన్-అండ్-జెర్క్ లిఫ్ట్‌లను పూర్తి చేయలేకపోయింది. అక్కడితో ఆగిపోలేదు.. చిన్నప్పుడు కట్టెలు ఎత్తడం నుండి అంతర్జాతీయ వేదికలపైకి ఎదగడం వరకు, మీరాబాయి చాను కథ ఒక అద్భుతమైన ప్రయాణం. ఈశాన్య భారతం ఇంఫాల్‌లోని నోంగ్‌పోక్ కక్చింగ్ అనే గ్రామంలో సాధారణ కుటుంబంలో.. ఆరుగురు తోబుట్టువులలో అతి పిన్నవయస్కురాలిగా జన్మించారు మీరాబాయి చాను.
ఎప్పుడూ క్రీడల పట్ల ఆకర్షితులయ్యే మీరాబాయి చాను మొదట్లో ఇంఫాల్‌లోని స్థానిక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్‌లో తన ప్రయాణం మొదలు పెట్టింది. మీరాబాయి భారతదేశ అత్యంత గొప్ప మహిళా వెయిట్‌లిఫ్టర్ గా మారింది. 2014లో స్కాట్‌లాండ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో మీరాబాయి చాను 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. అమెరికాలోని అనాహైమ్‌లో జరిగిన 2017 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి చాను రెండు దశాబ్దాల తర్వాత బంగారు పతకం సాధించిన మొదటి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె స్వర్ణం సాధించింది. ఈ ఈవెంట్‌లో మీరాబాయి 'స్నాచ్', 'క్లీన్ అండ్ జెర్క్' 'టోటల్' ఆటల రికార్డును బద్దలు కొట్టింది.
మీరాబాయి 2018లో ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. గాయం నుండి కోలుకోవడం కోసం దాదాపు ఒక సంవత్సరం క్రీడలకు దూరంగా ఉన్నారు. 2019లో మీరాబాయి థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి తిరిగి వచ్చింది. కానీ, నాల్గో స్థానానికే పరిమితం అయింది. అయితే, పట్టాయా ఈవెంట్‌లో ఆమె తన కెరీర్‌లో మొదటిసారి 200 కిలోల మార్కును అధిగమించినందున ఇది ఒక చిరస్మరణీయమైన ప్రదర్శనగా నిలిచింది. ఏప్రిల్‌లో తాష్కెంట్‌లో జరిగిన 2021 ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో, మీరాబాయి చాను క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కిలోల బరువుతో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇది ఆమెను టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతను సాధించి పెట్టింది. టోక్యో ఒలింపిక్స్ లో 202 కిలోల (87 కిలోల స్నాచ్ + 115 కిలోల క్లీన్ అండ్ జెర్క్) ప్రయత్నంతో రజత పకతం గెలుచుకుంది.
ఒక సంవత్సరం తర్వాత, మీరాబాయి చాను బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఫేవరెట్‌గా ప్రవేశించింది. మొత్తం 201 కిలోల (స్నాచ్ - 88 కిలోలు; క్లీన్ అండ్ జెర్క్ - 113 కిలోలు) లిఫ్ట్‌తో స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో చాను గోల్డ్ కోస్ట్ 2018లో తాను నెలకొల్పిన విభాగంలో 191 కిలోల బరువుతో గతంలో కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టింది. అదే సంవత్సరం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి చాను మణికట్టు గాయంతో పోరాడుతున్నప్పటికీ, 200 కిలోల (87 కిలోల స్నాచ్ + 113 కిలోల క్లీన్ అండ్ జెర్క్) సంయుక్తంగా లిఫ్ట్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మీరాబాయి చాను, పూర్తిగా ఫిట్‌గా లేనప్పటికీ, 2023లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో పోటీ పడింది. 191 కిలోల బరువుతో నాలుగో స్థానంలో నిలిచింది.