గంభీర్-అగార్కర్ లకు చెమటలు పట్టిస్తున్న ప్లేయర్.. డబుల్ సెంచరీతో గర్జించాడు !
Karun Nair : తనను జట్టు నుంచి బయటకు పంపిన తర్వాత మళ్లీ కరుణ్ నాయర్ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో వరుసగా సెంచరీ, డబుల్ సెంచరీ సాధించి ప్రధాన కోచ్ గంభీర్, ప్రధాన సెలక్టర్ అగార్కర్ లకు చెమటలు పట్టిస్తున్నాడు.

సెంచరీ, డబుల్ సెంచరీతో కరుణ్ నాయర్ స్ట్రాంగ్ వార్నింగ్
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో కర్ణాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ తన అద్భుత ఫామ్‌తో అదరగొడుతున్నాడు. మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇంగ్లాండ్ పర్యటనలో పెద్దగా పరుగులు చేయకపోవడంతో భారత జట్టు నుంచి అతన్ని తొలగించారు. అయితే, ఆ తర్వాత అతను మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి తాను అర్హుడిని అనే కామెంట్ల తో రచ్చ లేపాడు.
ఇప్పుడు తన బ్యాట్ తోనే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ప్రధాన సెలక్టర్ అజిత్ అగార్కర్ కు సమాధానం ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. మొదట సెంచరీ, ఇప్పుడు డబుల్ సెంచరీ సాధించి, సెలెక్టర్లకు బలమైన సందేశం పంపించాడు. ఈ ప్రదర్శనతో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కి ఆయన రీఎంట్రీ అవకాశాలపై చర్చ మొదలైంది.
ఇంగ్లాండ్ టూర్‌లో నిరాశ.. పడిలేచిన కెరటంలా పరుగుల సునామీ
ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. నాలుగు టెస్టుల్లో 8 ఇన్నింగ్స్‌లో 205 పరుగులు మాత్రమే సాధించాడు. ఒక్కసారి మాత్రమే 50 పరుగులు దాటగలిగాడు. దీంతో గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆయనను వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ నుంచి పక్కన పెట్టింది. అయితే ఆ నిరాశను ఆయుధంగా మార్చుకున్న కరుణ్, మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చి ధనాదన్ నాక్స్ ఆడుతున్నాడు. అద్భుత ఫామ్ తో సెంచరీల మోత మోగిస్తున్నాడు.
కేరళపై 232 పరుగుల అజేయ డబుల్ సెంచరీ కొట్టిన కరుణ్ నాయర్
మంగళాపురం క్రికెట్ గ్రౌండ్‌లో కర్ణాటక, కేరళ మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ 232 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జట్టు 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కష్ట సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ఆయన 358 బంతులు ఎదుర్కొని 25 ఫోర్లు, 2 సిక్స్‌లతో డబుల్ సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 381 బంతుల్లో 232 పరుగులతో అజేయంగా నిలిచి, కర్ణాటకను 450 పరుగులకు చేర్చాడు.
గోవాపై 174, వరుసగా రికార్డు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న కరుణ్ నాయర్
కేరళ మ్యాచ్‌కు ముందు గోవాపై కూడా కరుణ్ నాయర్ అజేయంగా 174 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 14 బౌండరీలు, 3 సిక్స్‌లు బాదాడు. మొదటి రౌండ్‌లో 73 పరుగులు సాధించాడు. అంటే మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఫిఫ్టీ, సెంచరీ, డబుల్ సెంచరీలతో అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. 33 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ ఇంకా టీమ్ ఇండియాకు తాను విలువైన ప్లేయర్ ను అని నిరూపిస్తున్నాడు.
తన మాటలను బ్యాట్‌తో చెప్పిన కరుణ్ నాయర్
తనపై సెలెక్టర్లు నమ్మకం కోల్పోయినప్పటికీ కరుణ్ నాయర్ దానిని సవాల్‌గా తీసుకున్నాడు. "పరుగులే నా సమాధానం" అన్నట్టుగా, రంజీ ట్రోఫీ వేదికగా సెంచరీ తర్వాత డబుల్ సెంచరీ బాదాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో నిరాశపరిచినా, తన ప్రతిభ, సహనం, టెంపరమెంట్‌తో మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అభిమానులు సోషల్ మీడియాలో ఆయన ప్రదర్శనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కరుణ్ నాయర్ కు భారత జట్టులో మళ్లీ చోటుంటుందా?
భారత టెస్ట్ జట్టులో 10 మ్యాచ్‌ల్లో 579 పరుగులు చేసిన కరుణ్ నాయర్ రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. మొదటి మ్యాచ్ లోనే ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టిన రెండో ప్లేయర్ గా ఘనత సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆయనకు మళ్లీ ఆ అవకాశం వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్ జట్టును ఎంపిక చేయనుంది. కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్ ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.