ఉత్కంఠ రేపుతున్న ఐపీఎల్ 2026 ట్రేడ్ రూల్స్ ఏంటో తెలుసా?
IPL Trade Rules: ఐపీఎల్ 2026 ట్రేడ్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. బిగ్ ప్లేయర్లు జట్లు మారుతున్నారు. అయితే, ఐపీఎల్ ట్రేడ్ రూల్స్ ఏంటో తెలుసా? బీసీసీఐ విధించిన కఠిన నియమాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఐపీఎల్ ట్రేడ్ విండో ఎప్పుడు ప్రారంభమవుతుంది?
2026 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన ట్రేడ్ విండో, లీగ్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఇది ఆటగాళ్ల వేలానికి వారం రోజుల ముందు వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేయడం లేదా మార్చుకోవడం చేయవచ్చు. అయితే వేలం అనంతరం కొత్తగా కొనుగోలు చేసిన ఆటగాళ్లను వెంటనే ట్రేడ్ చేయడం పై నిషేధం ఉంటుంది.
బీసీసీఐ ప్రకారం, వేలం తరువాత కూడా రెండవ ట్రేడ్ విండో ఒక నెలపాటు అందుబాటులో ఉంటుంది. ఇది తదుపరి సీజన్ ప్రారంభానికి ముందు ముగుస్తుంది.
ఎవరు ఐపీఎల్ ట్రేడ్ కు అర్హులు?
ఐపీఎల్ ట్రేడ్‌లో పాల్గొనగలిగే వారు కేవలం తమ జట్టు చేత రిటైన్ అయిన ఆటగాళ్లు మాత్రమే. వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు అదే సీజన్‌లో ట్రేడ్ విండోలోకి రారు. అంటే, ఒక ఆటగాడు వేలంలో కొత్తగా జట్టులో చేరితే, ఆ సీజన్‌లో అతనిని ఇతర జట్టుకు బదిలీ చేయడం కుదరదు.
ఆటగాళ్ల సమ్మతి కీలకం.. ప్రధాన నియమం ఏంటి?
ఐపీఎల్ ట్రేడ్ ప్రక్రియలో ఆటగాడి సమ్మతి అత్యవసరం. ఆటగాడు కొత్త జట్టులో చేరడానికి లిఖిత పూర్వకంగా అంగీకరించాలి. ఆటగాడి అంగీకారం లేకుండా ఏ ట్రేడ్ కూడా అమలు చేయరు.
ఒక ఫ్రాంచైజీ మరొక జట్టులోని ఆటగాడి పై ఆసక్తి చూపితే, అది ముందుగా బీసీసీఐకి "ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్" (EOI) రూపంలో తెలియజేయాలి. ఆ ఆటగాడి ప్రస్తుత జట్టు 48 గంటల్లో స్పందించాలి. ఆమోదం లభిస్తే, ఆటగాడికి సమ్మతి పత్రం పంపుతారు. ఆటగాడు అంగీకరిస్తేనే, ట్రేడ్ బీసీసీఐ ఆమోదానికి వెళుతుంది.
ఐపీఎల్ ట్రేడ్ రకాలు, ఆర్థిక నియమాలు ఏమిటి?
ఐపీఎల్‌లో రెండు రకాల ట్రేడింగ్ విధానాలు ఉంటాయి. అవి
1. ప్లేయర్-ఫర్-ప్లేయర్ స్వాప్: ఇరు జట్లు ఆటగాళ్లను పరస్పరం మార్చుకుంటాయి.
2. ఆల్-క్యాష్ డీల్: ఒక జట్టు మరొక జట్టు ఆటగాడిని నగదు చెల్లించి కొనుగోలు చేస్తుంది.
కొత్త జట్టు ఎక్కువ పారితోషికం ఆఫర్ చేస్తే, ఆ అదనపు మొత్తం ఆటగాడు, పాత జట్టు మధ్య సమానంగా పంచుతారు. ఒకవేళ జీతం తగ్గితే, ఆటగాడు దానిని లిఖిత పూర్వకంగా అంగీకరించి, బీసీసీఐ అనుమతి తీసుకోవాలి.
ప్రతి ఆటగాడిని సీజన్‌లో ఒకసారి మాత్రమే ట్రేడ్ చేయవచ్చు. ఇది ట్రేడ్ దుర్వినియోగాన్ని నివారించడానికే ఈ పరిమితి విధించారు.
ఐపీఎల్ ట్రేడ్ లో విదేశీ ఆటగాళ్ల నియమాలు ఏమిటి?
విదేశీ ఆటగాళ్ల ట్రేడ్ జరిగే ముందు, ఆయా ఆటగాళ్ల స్వదేశ క్రికెట్ బోర్డు నుండి “నో అబ్జెక్షన్ సర్టిఫికేట్” (NOC) తప్పనిసరి. ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉండి, బీసీసీఐ వైద్య ప్రమాణాలు అనుసరించాలి.
మారుతున్న ఆటగాడు, అమ్మే- కొనుగోలు చేసే ఫ్రాంచైజీలు అన్ని లీగ్ ఫీజులు, బకాయిలు పూర్తిగా చెల్లించి ఉండాలి.
బీసీసీఐ అన్ని ట్రేడింగ్ ఒప్పందాలను సమీక్షించి అధికారికంగా ప్రకటిస్తుంది. ఏవైనా నిబంధనల ఉల్లంఘన, అక్రమ ఆర్థిక ఒప్పందాలు లేదా ఆటగాడి హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుంటే, బీసీసీఐ ఆ ట్రేడ్‌ను రద్దు చేస్తుంది. అదనంగా, సంబంధిత జట్లపై ఆర్థిక జరిమానాలు విధించే అధికారమూ బోర్డుకు ఉంది.
2026 ఐపీఎల్ ట్రేడ్ రూల్స్ ద్వారా బీసీసీఐ సమానత్వం, పారదర్శకత, ఆటగాళ్ల హక్కుల పరిరక్షణను నిర్ధారిస్తోంది. ప్రతి ట్రేడ్ ఆటగాడి అంగీకారంతోనే జరుగుతుంది. ఈ క్రమంలో జట్లు తమ వ్యూహాత్మక బలాన్ని పెంచుకునే అవకాశం పొందుతాయి, కానీ నియమాలు ఉల్లంఘిస్తే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.