మహిళల ప్రపంచ కప్ : భారత గెలుపు సంబరాలు ఇవి
India wins ICC Womens ODI World Cup : నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, భారత జట్టు మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025ను మొదటిసారి గెలుచుకుంది.

చారిత్రాత్మక విజయం
భారత మహిళా క్రికెట్ జట్టు డీవై పాటిల్ స్టేడియంలో తమ మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని సంతోషంగా ఎత్తి పట్టుకుంది, భారత క్రికెట్‌లో ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఫైనల్ లో సౌతాఫ్రికాను ఓడించి భారత్ ఛాంపియన్ గా నిలిచింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఐసీసీ ట్రోఫీ గెలిచిన భారత మహిళలు
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును ఆత్మవిశ్వాసంతో నడిపించింది. భారత్‌కు తొలి ప్రపంచ కప్ విజయాన్ని అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో కీలకమైన పరుగులు సాధించారు. అద్భుతమైన నిర్ణయాలతో భారత్ ను ప్రపంచ ఛాంపియన్ గా మార్చారు.
షెఫాలీ వర్మ షో
ఫైనల్ మ్యాచ్ లో షెఫాలీ వర్మ షో చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టింది. బ్యాటింగ్ లో 87 పరుగులు చేశారు. బౌలింగ్ లో దక్షిణాఫ్రికాకు చెందిన మెరిజానే కాప్ కీలక వికెట్‌ను తీసిన తర్వాత షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ వికెట్ భారత్ విజయం సాధించడానికి పునాది వేసింది. మొత్తంగా రెండు వికెట్లు తీసుకున్నారు.
దీప్తి శర్మ బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతం
కీలకమైన దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఔట్ చేసిన తర్వాత స్టార్ బౌలర్ దీప్తి శర్మ తనదైన స్టైల్లో సంబరాలు చేసుకున్నారు. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ నాక్ ఆడిన దీప్తి, ప్రత్యర్థి జట్టును 246 పరుగులకే కట్టడి చేయడంలో ఆమె ముఖ్యపాత్ర పోషించారు. ఐదు వికెట్లతో అదరగొట్టారు.
విజయం తర్వాత టీమ్ ఇండియా సంబరాలు
చివరి వికెట్ పడిన తర్వాత ఆటగాళ్లు మైదానంలో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. వారి చారిత్రక ప్రపంచ కప్ విజయం స్ఫూర్తిని, ఆనందాన్ని ఈ ఫోటో చూపించింది.
అమన్‌జోత్ కౌర్ అద్భుతమైన రనౌట్
ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో అమన్‌జోత్ కౌర్ కీలకమైన రనౌట్‌ను విజయవంతంగా పూర్తి చేసి, మొమెంటమ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చింది.
జెమీమా ట్రెండీ ఫోటో
విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు తమ తొలి ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ట్రోఫీతో కలిసి గర్వంగా ఫోటోకు పోజిచ్చింది. జెమీమా తన ఫోన్ లో ట్రెండీ స్టైల్ ను క్యాప్చర్ చేస్తున్న క్షణాలు ఇవి !
కల నిజమైన వేళ
భారత జట్టు సౌతాఫ్రికా పై విజయం సాధించిన తర్వాత దీప్తి శర్మ, జెమీమాలు తమ కలలు నిజమయ్యాయంటూ ఆనందాన్ని పంచుకుంటున్న క్షణాలు ఇవి !
రోహిత్ శర్మ కన్నీళ్లు
భారత్ విజయం సాధించిన వెంటనే టీమిండియా మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి మ్యాచ్ చూశారు.
షెఫాలీ వర్మ తొలి వికెట్ తీసిన ఆనందంలో..
బ్యాటింగ్ లో అదరగొట్టి ఫుల్ జోష్ లో ఉన్న షెఫాలీ వర్మ పై నమ్మకంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బాల్ కూడా అందించారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా షెఫాలీ కీలక వికెట్ పడగొట్టి భారత్ కు మరో బ్రే త్రూ అందించింది. కెప్టెన్ తో కలిసి సంబరాలు చేసుకుంది.