- Home
- Sports
- అప్పుడు క్రికెట్‌కు పనికిరావన్నారు.. ఇప్పుడు ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకున్నారు.. ఈ లేడీ క్రికెటర్ హిస్టరీ తెలిస్తే
అప్పుడు క్రికెట్‌కు పనికిరావన్నారు.. ఇప్పుడు ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకున్నారు.. ఈ లేడీ క్రికెటర్ హిస్టరీ తెలిస్తే
Jemimah Rodrigues: జెమీమా రోడ్రిగ్స్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత శతకం సాధించి, భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆమె ఇన్నింగ్స్ కీలకం అని చెప్పొచ్చు.

యువ సంచలనం జెమీమా రోడ్రిక్స్..
భారత మహిళల క్రికెట్ జట్టు యువ సంచలనం జెమీమా రోడ్రిక్స్ తన అసాధారణ పోరాట పటిమ, ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఆమె చూపిన అద్భుత ప్రదర్శన, టీమిండియాను ఫైనల్‌కు చేర్చింది. 339 పరుగుల భారీ లక్ష్యం, ఆరంభంలోనే స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, షెఫాలీ అవుట్ కావడంతో ప్రేక్షకులు ఆశలు వదులుకున్న సమయంలో, జెమీమా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి అసాధారణ భాగస్వామ్యాన్ని నిర్మించింది. హర్మన్ అవుట్ అయినా, మ్యాచ్ చివరి వరకు పోరాడి 134 బంతుల్లో అద్భుతమైన 127 పరుగులు చేసి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై గెలుపును అందించింది.
మ్యాచ్‌కు ముందు జెమీమాకు తీవ్ర ఒత్తిడి
ఈ మ్యాచ్‌కు ముందు జెమీమా తీవ్ర ఒత్తిడికి గురైంది. నాకౌట్ మ్యాచ్‌లలో, వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలం కావడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఆమెను ఒక మ్యాచ్ నుండి పక్కన పెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా జరిగింది. వీటన్నింటినీ తట్టుకొని ట్రూ ఫైటర్‌గా నిలిచి, కీలక మ్యాచ్‌లో తన సత్తా చాటింది. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనైన జెమీమా, గత నెల కష్టంగా గడిచిందని, ఇప్పటికీ ఇది కలో నిజమో తెలియట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ముంబైలో జననం..
ముంబైకి చెందిన జెమీమా జెస్సికా రోడ్రిక్స్ 2000, సెప్టెంబర్ 5న క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిక్స్ మాజీ క్రికెట్ కోచ్, జెమీమాకు ఆయనే మొదటి గురువు. తల్లి లవితా రోడ్రిక్స్ స్కూల్ టీచర్. ఆమెకు ఎనోచ్ రోడ్రిక్స్, ఎలి రోడ్రిక్స్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. జెమీమా నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టుకుంది. అయితే, క్రికెట్‌కు పూర్తిగా అంకితం కావడానికి ముందు ఆమె ఫీల్డ్ హాకీలోనూ రాణించింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. కెరీర్‌గా ఒక క్రీడను ఎంచుకోవాల్సినప్పుడు క్రికెట్‌ను ఎంచుకున్నప్పటికీ, అవకాశం వస్తే హాకీ ఆడటానికి ఇప్పటికీ ఇష్టపడతానని ఆమె చెబుతుంది.
12 ఏళ్ల వయసులోనే అండర్-19 క్రికెట్
దేశీయ క్రికెట్‌లో జెమీమా చాలా వేగంగా ఎదిగింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే అండర్-19 క్రికెట్ సీజన్‌లో అరంగేట్రం చేసింది. 2017 నవంబర్‌లో ముంబై అండర్-19 తరపున సౌరాష్ట్రపై 50 ఓవర్ల మ్యాచ్‌లో 163 బంతుల్లో 202 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. స్మృతి మంధాన తర్వాత దేశీయ 50 ఓవర్ల మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా 2017-18 సీజన్‌కు గాను బీసీసీఐ నుండి బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ పురస్కారం లభించింది.
17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు
జెమీమా 17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. 2018 ఫిబ్రవరి 13న దక్షిణాఫ్రికాపై మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో, ఆ తర్వాత 2018 మార్చి 12న ఆస్ట్రేలియాపై మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించింది. 2023 డిసెంబర్ 14న ఇంగ్లాండ్‌పై టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ఆమె తన సెమీఫైనల్ సెంచరీని బెస్ట్ ఇన్నింగ్స్‌గా అభివర్ణించింది. జనవరి 2025లో ఐర్లాండ్‌తో జరిగిన ఓడిఐలో 91 బంతుల్లో అజేయంగా 102 పరుగులు చేసి, టీమిండియా అత్యధిక ఓడిఐ స్కోరు 370 సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 2023లో జరిగిన తొలి WPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జెమీమాను 2.2 కోట్లకు కొనుగోలు చేసింది. 2022 ఆసియా కప్ విజేత జట్టులో, కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం గెలిచిన జట్టులో ఆమె సభ్యురాలిగా ఉంది. మెల్బోర్న్ రెనిగేడ్స్, మెల్బోర్న్ స్టార్స్, యార్క్‌షైర్స్ డైమండ్స్, నార్తరన్ సూపర్ చార్జర్స్, ట్రిన్ బాగో నైట్ రైడర్స్ వంటి అంతర్జాతీయ లీగ్ టీమ్‌ల తరఫున కూడా ఆడింది. జెమీమా రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా కూడా రాణిస్తోంది.