ఐపీఎల్ ఆక్షన్ : చెన్నై సూపర్ కింగ్స్ పక్కా ప్లాన్ !
CSK IPL 2026: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పక్కా ప్లాన్ తో ముందుకు దిగుతోంది. రస్సెల్, మాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్, గ్రీన్‌లను టార్గెట్ చేసింది. అలాగే, సామ్ కరన్‌కు ప్రత్యామ్నాయం కూడా చూస్తోంది.

సీఎస్కే భారీ మార్పులు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్ 2026 కోసం పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది. గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయిన ఈ జట్టు, రిటైన్, రిలీజ్ జాబితాలను ప్రకటించింది. 2025 సీజన్ నిరాశ ప్రదర్శనతో జట్టు ఈసారి ఆక్షన్‌లో పూర్తి శక్తితో దిగడానికి సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో సీఎస్కే ఒక విదేశీ ఆల్‌రౌండర్ కోసం చూస్తోంది. ప్రత్యేకంగా సామ్ కరన్ వెళ్లిపోయిన తరువాత జట్టులో అతని స్థానాన్ని పూర్తి చేయడం కోసం స్టార్ ప్లేయర్ల పై కన్నేసింది. చెన్నై ఫ్రాంచైజీ 16 డిసెంబర్‌కు అబుదాబిలో జరిగే మినీ ఆక్షన్‌లో కనీసం నలుగురు పెద్ద ఆల్‌రౌండర్లను టార్గెట్ చేయనుందని సమాచారం.
సీఎస్కే పర్స్ లో ఎంత మనీ ఉంది?
సీఎస్కే ఈ సీజన్‌కు మొత్తం 16 మంది ప్లేయర్లను రిటైన్ చేసింది. వీరిపై మొత్తం 81.60 కోట్లు ఖర్చు అయింది. రిలీజ్ చేసిన 9 మంది ప్లేయర్ల తరువాత జట్టు పర్స్‌లో 43.4 కోట్లు మిగిలాయి. ఒక స్క్వాడ్‌లో గరిష్టంగా 25 మంది మాత్రమే ఉండాలి కాబట్టి, ప్రస్తుతం ఉన్న 16 మందికి తోడు సీఎస్కే మరో 9 మందిని కొనుగోలు చేయనుంది. మరీ ముఖ్యమైన విషయం ఈసారి ఆక్షన్‌లో రెండో పెద్ద పర్స్ సీఎస్కే వద్దే ఉంది. అందువల్ల జట్టు లక్ష్యంగా పెట్టుకున్న ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది.
సామ్ కరన్‌కు బదులుగా నలుగురు స్టార్ ఆల్‌రౌండర్లు
సామ్ కరన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ మ్యాచ్‌ను మార్చగల ప్లేయర్. అందువల్ల అతని బదులు రాణించగల టాప్-క్లాస్ విదేశీ ఆల్‌రౌండర్ సీఎస్కేకు అవసరం. అతని స్థానంలో చెన్నై టీమ్ నలుగురు స్లార్లను టార్గెట్ చేయనుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిలో ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్‌వెల్, లియామ్ లివింగ్‌స్టోన్, కామెరాన్ గ్రీన్. అలాగే, పతిరానా విడుదల కావడంతో, నాథన్ ఎల్లీస్ కు తోడు ఒక సీమర్ బ్యాకప్ కూడా జట్టుకు అవసరం.
37 ఏళ్ల రస్సెల్ పై సీఎస్కే భారీ బిడ్‌కు సిద్ధం
ఆండ్రీ రస్సెల్ ను కేకేఆర్ 11 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసింది. అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రమాదకర ఆల్‌రౌండర్లలో ఒకరు. అతను 139 మ్యాచ్‌లు ఆడి 2658 రన్స్ సాధించారు. 175+ స్ట్రైక్‌రేట్ తన ఆటను కొనసాగిస్తూ 225 సిక్స్‌లు, 187 ఫోర్లు బాదారు. అలాగే, 124 వికెట్లు పడగొట్టారు.
అతని అద్భుత ఆల్‌రౌండ్ సామర్థ్యం సీఎస్కే వ్యూహానికి పూర్తిగా సరిపోతుంది. ఏ నంబర్‌లోనైనా బ్యాటింగ్ చేయగలగడం, డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల శక్తి ఉండటం వల్ల అతని కోసం సీఎస్కే భారీగా బిడ్ వేసే అవకాశముంది.
ఉత్కంఠను పెంచుతున్న ఐపీఎల్ 2026 ఆక్షన్?
ఈ సారి ఆక్షన్‌లో విడుదలైన ప్లేయర్ల జాబితాలో స్టార్ ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఐపీఎల్ 2026 మినీ వేలం మరింత ఉత్కంఠను పెంచుతోంది. వేలంలోకి వచ్చే స్టార్లను గమనిస్తే.. వెంకటేశ్ అయ్యర్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, తీక్షణ, వనిందు హసరంగ వంటి ప్లేయర్లు ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్, రిలీజ్ జాబితా
సీఎస్కే రిలీజ్ ప్లేయర్స్: రచిన్ రవీంద్ర,డేవాన్ కాన్వే, సామ్ కరన్, దీపక్ హుడా, విజయ శంకర్, షేక్ రషీద్, పతిరానా, కమలేష్ నాగర్‌కోటి, రాహుల్ త్రిపాఠి, వంశ్ బేడీ, సిద్ధార్థ్
రిటైన్ ప్లేయర్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అయూష్ మ్హాత్రే, ఎమ్.ఎస్. ధోని, డెవాల్డ్ బ్రేవిస్, ఉర్విల్ పటేల్, శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అంషుల్ కంబోజ్, గుర్‌జాప్నీత్ సింగ్, శ్రేయస్ గోపాల్, ముకేశ్ చౌధరి, నాథన్ ఎల్లీస్
ట్రేడ్: రవీంద్ర జడేజా, సామ్ కరన్