రిషబ్ పంత్ రీఎంట్రీ ఉంటుందా? కేఎల్ రాహుల్ బిగ్ స్టేట్‌మెంట్
India vs South Africa : రాంచీ లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, రిషబ్ పంత్ జట్టులో ఉంటారా? లేదా అనేది ఉత్కంఠను రేపుతోంది. ఈ క్రమంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

రాంచీ తొలి వన్డేకు ముందు కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ రాంచీలో నవంబర్ 30న జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టాండ్-ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ రిటర్న్‌పై స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా అందుబాటులో లేరు. దీంతో రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా, పంత్ తిరిగి వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ పై చర్చ మొదలైంది. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. “పంత్ ఆడితే వికెట్‌కీపింగ్ చేస్తాడు. కానీ దీని పై తుది నిర్ణయం మ్యాచ్ రోజే తెలుస్తుంది" అన్నారు. గత రెండేళ్లుగా పంత్ కంటే రాహుల్‌నే తొలి ఎంపికగా టీమ్ మేనేజ్‌మెంట్ భావించిన విషయం తెలిసిందే.
పంత్‌కు వన్డేల్లోకి రీఎంట్రీ జరిగేనా?
రాంచి మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహుల్ మాట్లాడుతూ.. “రిషబ్ ఓ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా కూడా ఆడగలడు. అతను జట్టులో ఉంటే గ్లవ్స్ వేసుకుంటాడు. కానీ దీనిపై నిర్ణయం రేపే (ఆదివారం)” అని తెలిపారు.
పంత్ చివరిసారి ఆగస్టు 2024లో శ్రీలంక సిరీస్‌లో వన్డేలు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో ఆయనకు స్థానం దక్కలేదు. 31 వన్డేల్లో 871 పరుగులు చేశాడు. మిగతా ఫార్మాట్‌ల మాదిరిగా వన్డేల్లో పంత్ ప్రభావం చూపించలేకపోయాడు.
రుతురాజ్ గైక్వాడ్‌పై కేఎల్ రాహుల్ ప్రశంసలు
ఈ సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా అవకాశం దక్కే అవకాశాలపై చర్చ సాగుతోంది. గైక్వాడ్ చివరిసారి వన్డే ఆడింది డిసెంబర్ 2023లో. అతనికి తక్కువ అవకాశాలు లభించినా.. మంచి ప్రదర్శనలు ఇచ్చాడు.
రాహుల్ మాట్లాడుతూ, “రుతురాజ్ అద్భుత ఆటగాడు. మా టాప్-ఆర్డర్ చాలా సెటిల్‌డ్‌గా ఉంది. అయినా అతను పొందిన తక్కువ అవకాశాల్లో గొప్పగా ఆడాడు. ఈ సిరీస్‌లో అతనికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాం” అని వివరించారు.
స్పిన్ ముందు ఎదురుదెబ్బ.. కేఎల్ రాహుల్ ఓపెన్ స్టేట్మెంట్
ఇటీవలి రెండు సీజన్‌లలో భారత జట్టు స్పిన్ బౌలింగ్‌కు ఎదుర్కొన్న ఇబ్బందులు రాహుల్ బహిరంగంగా అంగీకరించారు. 2024లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ల్లో స్పిన్‌కు భారత టాప్ ఆర్డర్ పతనం ప్రధాన కారణమైంది.
రాహుల్ మాట్లాడుతూ.. “మేము గత రెండు సీజన్లుగా స్పిన్‌ను బాగా ఆడలేకపోతున్నాం. ఎందుకలా జరుగుతోంది అనేది చెప్పలేను. ఇది ఒక్కరాత్రిలో మారదు. సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మార్పులు చేసుకుంటున్నాము” అన్నారు. అశ్విన్ కూడా భారత టీమ్‌ను ప్రస్తుతం స్పిన్‌తో ఇబ్బంది పడుతున్న జట్లలో ఒకటి అని విమర్శించిన విషయం తెలిసిందే.
రోహిత్, కోహ్లీ రీఎంట్రీతో జట్టుకు కొత్త ఉత్సాహం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి రావడంతో డ్రెస్సింగ్‌రూమ్‌లో నమ్మకం పెరిగిందని రాహుల్ తెలిపారు. “వారి అనుభవం అపారమైనది. వారు జట్టులో ఉండటం కొత్త శక్తిని ఇస్తుంది. మా లక్ష్యం గెలవడం మాత్రమే” అని చెప్పారు. అలాగే, రాహుల్ ఈ మ్యాచ్‌లో కూడా నంబర్ 6లోనే బ్యాటింగ్ చేస్తానని స్పష్టం చేశారు.
జడేజా రాకపై మాట్లాడుతూ, “జడ్డు ఎప్పుడూ భారత్‌కు ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. అతని అనుభవం చాలా అవసరం” అన్నారు. ఎంఎస్ ధోని రాంచీ స్టేడియంలో ఉంటే జట్టుకు మరింత ఉత్సాహం వస్తుందని కూడా కేఎల్ రాహుల్ అన్నాడు. “మేమందరం ధోనీని చూసే పెరిగాం. ఆయన స్టేడియంలో ఉంటే ప్రేక్షకులూ, ఆటగాళ్లూ ఎనర్జీ ఫీలవుతారు” అని చెప్పారు.

