నేడే వరలక్ష్మీ వ్రతం.. శుభ ముహూర్తం..ఎలాంటి ఆచారాలను పాటించాలంటే?
ఈ పవిత్ర వ్రతం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రల్లో ఎంతో గొప్పగా జరుపుకుంటారు. శ్రావణ శుక్లపక్షంలో శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 25 న జరుపుకుంటున్నాం..
వరలక్ష్మీ వ్రతాన్ని వరలక్ష్మీ పూజగా కూడా పిలుస్తారు. ఈ పండుగలో శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. వరలక్ష్మీ అంటే వరాన్ని ప్రసాదించేవారు అని అర్థం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెళ్లైన ఆడవారు ఈ రోజు ఉపవాసం ఉంటారు. ప్రతి ఏడాది వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి లేదా పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు జరుపుకుంటారు. పెళ్లైన ఆడవారు లక్ష్మీదేవీ అనుగ్రహం పొందడానికి ఈ వ్రతాన్ని చేస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీదేవిని పూజించడం సంపద, భూమి, విద్య, కీర్తి, ప్రేమ, శాంతి, ఆనందం, బలం ఎనిమిది దేవతలైన అష్టలక్ష్మీ (లక్ష్మీదేవి 8 రూపాలు)ని ప్రార్థించడంతో సమానం. ఇక ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఈ రోజు అంటే ఆగస్టు 25 న జరుపుకుంటున్నాం.
వరలక్ష్మీ వ్రతం శుభ ముహూర్తం
సింహ లగ్నం పూజ ముహూర్తం (ఉదయం ముహూర్తం) - 05:55 - 07:40 ఉదయం
వృశ్చిక లగ్నం పూజ ముహూర్తం (మధ్యాహ్నం ముహూర్తం) - 12:14 - 02:32
కుంభ లగ్నం పూజ ముహూర్తం (సాయంత్రం ముహూర్తం) - 06:19 -07:48
వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్థరాత్రి ముహూర్తం) - 10:50 - 12:46
వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత
వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత విష్ణు పురాణం, నారద పురాణంలో ప్రస్తావించబడింది. ఈ రోజున ఉపవాసం ఉండేవారి కోరికలన్నింటినీ లక్ష్మీదేవి నెరవేరుస్తుందట. అలాగే వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందట. అలాగే ఆనందం, సంపద, శ్రేయస్సు వంటి వరాలను అమ్మవారు ప్రసాదిస్తుందని నమ్ముతారు.
సంపద, భూమి, విద్య, ప్రేమ, కీర్తి, శాంతి, సుఖం, పుష్టి అనే 8 శక్తులు కలిసి అష్టలక్ష్మీ పేరుతో పిలవబడతాయి. అలాగే ఎనిమిది శక్తుల్లో ప్రతిదాన్ని లక్ష్మీదేవిగా పిలుస్తారు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉండేవారు లక్ష్మీదేవి ఎనిమిది రూపాలను ప్రసన్నం చేసుకుంటారట. అలాగే ఎనిమిది శక్తుల ఆశీర్వాదాన్ని కూడా పొందుతారని నమ్ముతారు.
వరలక్ష్మీ వ్రతం ఆచారాలు
ఈ రోజు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఇల్లు, పూజా గదిని శుభ్రం చేయాలి. అలాగే అందమైన ముగ్గులను వేస్తారు. కంచు లేదా వెండి కలశం పై గంధంతో స్వస్తిక్ చిహ్నాన్ని గీస్తారు.
ముడి బియ్యం, నీళ్లు, నాణేలు, సున్నం, ఐదు రకాల ఆకులతో పాటుగా తమలపాకులు అన్ని కలశం లోపల ఉంచుతారు. ఈ కలశం శుభ్రమైన ఎర్ర రంగు గుడ్డతో అలంకరించాలి.ఆ తర్వాత మామిడి ఆకులను కలశానికి తోరణంగా కట్టాలి.
ఇవన్నీ పూర్తైన తర్వాత పసుపు పెట్టిన కొబ్బరికాయను కలశంపై పైన పెట్టాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని కొబ్బరికాయపై పసుపు పొడిని ఉపయోగించి గీయడం వల్ల కలశం లక్ష్మీదేవి ప్రతిరూపంగా మారుతుంది. ముందుగా వినాయకుడి పూజ చేస్తారు. ఆ తర్వాత వరలక్ష్మీ పూజ మొదలవుతుంది. పూజలో లక్ష్మీ సహస్రనామం, శ్లోకాలు పఠించి, హారతితో ముగుస్తుంది. వరలక్ష్మీ పూజ సమయంలో ఆడవారు పూజ సమయం వరకు ఉపవాసం ఉంటారు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత కలశాన్నితీసి దానిలోని నీటిని ఇంటిపై జల్లుతారు.