2025లో రెండు ముక్కోటి ఏకాదశి పండగలు: ఎప్పుడెప్పుడో తెలుసా?
సాధారణంగా ప్రతి నెలా రెండు ఏకాదశిలు వస్తాయి. అదేవిధంగా సంవత్సరానికి ఒక ముక్కోటి ఏకాదశి పండగ వస్తుంది. కాని రెండు ముక్కోటి ఏకాదశి పండగలు వస్తాయా? 2025లో అలాగే జరుగుతుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది ఎలా సాధ్యం? కారణాలు తెలుసుకుందాం రండి.
పంచాంగం ప్రకారం ఏ తిథి అయినా ప్రతి నెల రెండు సార్లు వస్తుంది. అలాగే ఏకాదశి కూడా.. కాని ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ తిథి రోజు ఏ పని ప్రారంభించినా కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఎక్కువ మంది నమ్ముతారు. ముఖ్యంగా శివుడికి, విష్ణువుకి కూడా ఈ తిథి చాలా ఇష్టమైనదని పండితులు చెబుతున్నారు. అందువల్ల ఏకాదశి తిథుల్లో వచ్చే పండగలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అందుకే ముక్కోటి ఏకాదశిని చాలా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
సాధారణంగా ఏడాదికి ఒకసారి మాత్రమే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పండగ వస్తుంది. ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహా విష్ణువుని దర్శిస్తే చేసిన పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంత విశిష్టమైన ముక్కోటి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. కాని 2025లో రెండు సార్లు రానుంది. దీనికి కారణాలు తెలుసుకుందాం రండి.
సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఆ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహా విష్ణువు మూడు కోట్ల దేవతలకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. అందువల్ల మనం కూడా ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ముక్కోటి రోజు భక్తులంతా తప్పకుండా ఉపవాసం ఉంటారు. శక్తి కొలదీ భజనలు, భక్తి పాటలు, విష్ణు సహస్ర నామ పారాయణలు ఇలా అనేక స్తోత్రాలు పఠిస్తారు.
ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి. ఇలా సంవత్సరానికి 24 ఏకాదశిలు వస్తాయి. అయితే వైకుంఠ ఏకాదశికి వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు ఒక్కపూట మాత్రమే భోజనం చేసి వైకుంఠ ఏకాదశి ఉపవాస దీక్షను పూర్తి చేస్తారు.
ఇంత ప్రత్యేకమైన ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం ఒకసారే వస్తుంది కాని 2025లో మాత్రం రెండు సార్లు రానుంది. మీరు విన్నది నిజమే. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? నిజానికి 2024లో రావాల్సిన ముక్కోటి 2025 జనవరిలో వచ్చింది. దీనికి కారణం 2024 లీపు సంవత్సరం కావడం, తిథుల్లో తగులు, మిగులు రావడం వల్ల ఏటా డిసెంబర్ లో రావాల్సిన ముక్కోటి 2025లో మాత్రం జనవరి 10 వ తేదీన వస్తోంది. ఇదే ఏడాది చివర్లో డిసెంబర్ 30వ తేదీన మరో ముక్కోటి ఏకాదశి రానుంది. ఇలా ఒకే సంవత్సరంలో రెండు సార్లు వైకుంఠ ఏకాదశిలు రానున్నాయి.