Janmashtami 2022: కృష్ణాష్టమికి ఉపవాసం ఉంటున్నారా? అయితే మీ కోసమే ఈ చిట్కాలు..!
Janmashtami 2022: జన్మాష్టికి చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే మీ ఆరోగ్యానికి సంబంధించిన ఈ చిట్కాలు పాటిస్తే మీరు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు.
శ్రీకృష్ణుని జన్మించిన రోజునే మనం జన్మాష్టమిగా జరుపుకుంటున్నాం. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఇదీ ఒకటి. ఈ ఏడాది జన్మాష్టమి వేడుకలు ఆగస్టు 18న ప్రారంభమై.. మరుసటి రోజు ఆగస్టు 19 అర్థరాత్రి వరకు కొనసాగుతాయి. ఇక ఈ పవిత్రమైన రోజున గోపాలుడి ఉపవాసం ఉండేవారు చాలా మందే ఉన్నారు. నిష్టగా పూజించి.. ఉపవాసం ఉంటే అనుకున్న కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఉపవాసం ఉండటం మంచి విషయమే కానీ.. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే మీ ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఉపవాసం వల్ల బరువు తగ్గడం, నిర్విషీకరణ, మెరుగైన జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నప్పటికీ.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ ఉపవాస సమయంలో మీరు హెల్తీగా ఉండాలంటే ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి.
హైడ్రేట్ గా ఉండండి..
ఉపవాసం చేసే వారు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకూడదని చాలా మంది అంటుంటారు. కానీ ఇలా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండటం అస్సలు మంచిది కాదు. ఇలా ఉండాలని ఏ శాస్త్రాలు కూడా చెప్పలేదు. ఎందుకంటే పొద్దంతా నీళ్లను తాగకపోతే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అంతేకాదు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే నీళ్లను పుష్కలంగా తాగండి. అలాగే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను కూడా తీసుకుంటూ ఉండండి..
ఆరోగ్యకరమైన ఆహారాలను తినండి
ఉపవాసం ఉండే వారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ శరీరానికి శక్తి చాలా అవసరం. లేదంటే స్పృహ కోల్పోవచ్చు. అందుకే ఉపవాసం చేసేవారు ఆకు కూరలను, మఖానా, చిరుధాన్యాలను, బక్వీట్ పిండి వంటి హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఇవి మిమ్మల్ని చురుగ్గా ఉంచుతాయి. అయితే వీటిని లిమిట్ లోనే తినాలి.
sleeping
నిద్ర
ముందే ఇది పండుగ సమయం కాబట్టి ఇంట్లో అంతా సందడి సందడిగా ఉంటుంది. ఆ పనులు.. ఈ పనులతో ఫుల్ బిజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో శరీరానికి అస్సలు విశ్రాంతి దొరకదు. అందుకే ఉపవాసం ఉండేవారు కఠినమైన వ్యాయామాల జోలికి వెళ్లకండి. ఎందుకంటే ఇవి మిమ్మల్ని మరింత అలసిపోయేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో యోగా లేదా ధ్యానం చేయండి. ఇకపోతే ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. ఇది మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది.
పెరుగు, చిలకడ దుంపలను ఆహారంలో చేర్చండి
తియ్యగా ఉండే చిలకడదుంపలను టిక్కీలు లేదా ఫింగర్ చిప్స్ రూపంలో తినండి. అలాగే పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను కూడా మీ ఆహారంలో చేర్చండి. ఇవి మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.
ఉపవాసానికి ఒక రోజు ముందు సరిగ్గా తినండి..
ఉపవాసం చేసే రోజూ పెద్దగా ఏమీ తినరు కాబట్టి ఆ ముందు రోజు హెల్తీ భోజనం చేయండి. ఇది మీ జీర్ణ వ్యవస్థకు సక్రమంగా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే రేపు ఎలాగో తినమని ఆయిలీ ఫుడ్స్ , జంక్ ఫుడ్ న తినేరు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.