ఇంటింటా రామజ్యోతి.. ఈ రోజు ఇంట్లో ఎన్ని దీపాలను వెలిగించాలి? ఎప్పుడు వెలిగించాలి?
Ram Jyoti: అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్ఠన జరిగింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య నగరంతో పాటుగా దేశ విదేశాల్లోని రామ భక్తులు విచ్చేశారు. ఇప్పటికే ప్రతిష్టా ప్రక్రియ పూర్తి అయ్యింది కాబట్టి ఈ రోజు రామ జ్యోతిని వెలిగిలించాలని పండితులు చెబుతున్నారు. మరి రామజ్యోతిని ఎప్పుడు, ఏ సమయంలో వెలిగించాలో తెలుసుకుందాం పదండి.
అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అభిజిత్ ముహూర్తంలో పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కోసం నగరం మొత్తాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కాగా ఈ రోజున ఇంట్లోనే రామజ్యోతిని వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. మధ్యాహ్నం ప్రతిష్ఠా ప్రక్రియ పూర్తి అయ్యింది. దీని తర్వాత సాయంత్రం రామజ్యోతిని ఇంట్లో వెలిగిస్తారు. మీరు ఇంట్లో ప్రాణ ప్రతిష్ఠ రోజున రామజ్యోతి వెలిగించాలని ఆలోచిస్తున్నట్టైతే.. ఇంతకంటే ముందు మీరు దాని నియమాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అసలు రామ జ్యోతిని ఎలా వెలిగించాలి? ఎన్ని వెలిగించాలి? ఏ సమయంలో వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రామజ్యోతిని ఏ సమయంలో, ఎలా వెలిగించాలి?
ప్రాణ ప్రతిష్ఠ రోజున అంటే ఈ రోజు సాయంత్రం రామజ్యోతిని వెలిగిస్తారు. మీరు కూడా రామజ్యోతి వెలిగించాలని ఆలోచిస్తున్నట్టైతే మీరు నెయ్యి దీపాన్ని వెలిగించడం మంచిది. ఈ దీపాన్ని పవిత్రంగా భావిస్తారు.
మీరు మీ నమ్మకాన్ని బట్టి 1 దీపాన్ని వెలిగించొచ్చు. అయితే మీరు వెలిగించిన రామ జ్యోతి రాత్రంతా వెలిగేలా చూసుకోవాలి. ఇది మీ కుటుంబం మొత్తానికి శ్రీరాముడి అనుగ్రహాన్ని తీసుకువస్తుందని, జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుందని నమ్ముతారు.
రామజ్యోతి దీపాన్ని ఎక్కడ ఉంచాలి?
మీరు వెలిగించిన రామజ్యోతి దీపాన్ని ఇంటి గుడిలో ఉంచండి. అలాగే ఇంకా 5 దీపాలను తయారు చేసి వంటగదిలో ఒకటి, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒకటి, ఆవరణలో ఒకటి, తులసి మొక్క దగ్గర ఒకటి పెట్టండి.
ప్రతిష్ఠ అంటే ఏమిటి?
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో లేదా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో.. విగ్రహంలో భగవంతుని శక్తులను ప్రకాశవంతం చేయడానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రతిష్ఠించడం చాలా ముఖ్యమని చెబుతారు. ప్రతిష్ఠ అనంతరం స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.