పూజ ఇలా చేస్తేనే ఫలితం..!
చాలాసార్లు పూజ సమయంలో మనకు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లను చేస్తుంటాం. కానీ వీటివల్ల పూజా ఫలితాలను మాత్రం అస్సలు పొందరంటున్నారు పండితులు. ఇంటి ఆలయానికి సంబంధించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి.. వీటిని ప్రతి వ్యక్తి జాగ్రత్తగా చూసుకోవాలి.
పూజ మన జీవితంలో సానుకూలతను తెస్తుంది. మనశ్శాంతి, భగవంతుని అనుగ్రహం పొందడానికి ప్రతిరోజూ పూజలు చేస్తుంటారు. కానీ చాలాసార్లు పూజ సమయంలో మనకు తెలియకుండానే ఎన్నో చిన్న చిన్న పొరపాట్లను చేస్తుంటాం. ఇవి పొరపాట్లు అని కూడా మనలో చాలా మందికి తెలియవు. వీటి ఫలితంగా పూజ చేసిన ఫలితాన్ని కూడా పొందరంటున్నారు జ్యోతిష్యులు. పూజను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి ఆలయానికి సంబంధించి వాస్తు శాస్త్రంలో.. కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా పూజలు చేయాల్సి ఉంటుంది.
పూజ సమయంలో మీ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలోనే పెట్టాలి.
పూజ చేసేటప్పుడు ముఖం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. అందులో కూడా తూర్పు దిక్కుకు అభిముఖంగా పూజించడం వల్ల పూజా ఫలం దక్కుతుందట.
దేవతలు, దేవుళ్లు తూర్పు దిశలో నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఈ దిశను సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు.
నేలపై కూర్చొని మాత్రమే పూజలు చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పూజ సమయంలో నేలపై ఆసనం వేసి నిటారుగా కూర్చోవాలి. కానీ ఆరాధన సమయంలో ఎప్పుడూ కూడా ఖాళీ నేలపై కూర్చోవద్దని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది ఆరాధన పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. అంతేకాకుండా మీ పూజా సామగ్రిని పూజా గదిలోనే పట్టండి.
ప్రార్థనా మందిరాన్ని ఎలా నిర్మించాలి?
మీరు మీ ఇంట్లో ఆలయం నిర్మించాలనుకుంటే.. ఆలయం ఎత్తు దాని వెడల్పునకు రెట్టింపు ఉండేలా చూసుకోవాలి.
అలాగే దాని చుట్టూ దుమ్ము, దూళి, మురికి ఉండకూడదు. మెట్ల కింద గుడి కట్టకూడదు. ఎందుకంటే అటువంటి ప్రార్థనా స్థలం మీ ఇంట్లో భారీ నిర్మాణ లోపాలను కలిగిస్తుంది.