Navratri: శరన్నవరాత్రులలో మూడో రోజు... చంద్రఘంటాగా దర్శనం ఇచ్చిన అమ్మవారు
Navratri: ఈరోజు నవరాత్రులలో మూడవ రోజు.. అమ్మవారు చంద్రఘంటా దుర్గా అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ కాబట్టి చంద్రఘంట దుర్గా అవతారంలో అమ్మవారిని పూజిస్తారు.
Navratri: ఈరోజు నవరాత్రులలో మూడవ రోజు.. అమ్మవారు చంద్రఘంటా దుర్గా అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ కాబట్టి చంద్రఘంట దుర్గా అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఇక అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ అమ్మవారిని చంద్ర కాండ, చంద్రిక, రాచండి అనేటువంటి పేర్లతో పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్థ చంద్రాకారంతో ఘంటా కలిగి ఉన్నది అని అర్థం. చంద్రఘంటా దుర్గ అమ్మవారు ఎనిమిది చేతులతో దర్శనం ఇస్తారు.
ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో గద, ధనుర్బాణాలు, ఖడ్గం, కమండలం వంటి ఆయుధాలు అమ్మవారి చేతిలో ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయ ముద్రతో ఉంటుంది. అమ్మ వారి వాహనాలు పులి, సింహం. అమ్మవారి వాహనాలు ధైర్యానికి శౌర్యానికి ప్రతీక.
పురాణాల ప్రకారం శివుడు.. పార్వతి దేవిని వివాహం చేసుకొనుటకు ఒప్పుకొనడంతో ఆమె సంతోషపడుతుంది. పార్వతి దేవి తల్లిదండ్రులు మేనకా దేవి, హిమవంతులు కూడా శివపార్వతుల వివాహం జరుపుటకు అంగీకరిస్తారు.
శివుడు తన వివాహా వేడుకకు మునులతోను, దేవతలతోను, గణాలతోను, స్మశానంలో ఉండే భూత ప్రేత పిశాచాలతో తరలివస్తారు. పార్వతి దేవి తల్లి అయినా మేనకా దేవి శివుని యొక్క ఆ భయంకరమైన గంభీరమైన వేషధారణను చూసి కళ్లు తిరిగి పడిపోతుంది.
అప్పుడు అమ్మవారు చంద్రఘంట అవతారంలో శివునికి కనిపించి తన కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోవాలని ఆయనకు కోరుతుంది. అప్పుడు శివుడు ఒక చక్కని రాజకుమారుని వేషంలో వంటినిండా నగలతో దర్శనం ఇస్తారు.
అప్పుడు పార్వతీదేవి కుటుంబానికి భయం తొలగిపోగా.. శివున్ని వివాహానికి ఆహ్వానిస్తారు. అలా శివపార్వతుల వివాహం జరుగుతుంది. ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి చంద్రఘంట అవతారంలో దర్శనమిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి.
ఒకసారి భూమి మీద శుంభ, నిశుంభ యొక్క ఆగడాలు విపరీతముగా ఉండుట చేత ఆ రాక్షసులను వధించుటకు అమ్మవారు దుర్గాదేవి అవతారం ఎత్తి వారితో యుద్ధము చేయుటకు వెళుతుంది. అప్పుడు అమ్మవారి అందానికి రాక్షసులంతా మోహితులు అవుతారు.
తన తమ్ముడు అయిన నిశంభునికి ఇచ్చి వివాహం చేయుటకు శంభుడు కోరుకుని ధూమ్రలోచనున్ని దుర్గ దేవిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి పరివారాన్ని సంహరిస్తుంది ఇలా అమ్మవారు రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారంలో దర్శనమిస్తారు.
ఈ రోజు అమ్మవారిని పూజించిన వారికి పాపాలను, బాధలను, రోగాలను, మానసిక రుగ్మతలను దూరం చేస్తుందని నమ్ముతారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం పెడతారు.