చాణక్య నీతి ప్రకారం ఈ 6 రకాల వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు!
ఆచార్య చాణక్యుడు తన నీతి సూత్రాల్లో ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే అనేక రహస్యాలను వెల్లడించారు. కొన్ని రకాల వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరని ఆయన పేర్కొన్నారు. కొన్ని అలవాట్లే వారిని పేదరికం వైపు నడిపిస్తాయట. అవేంటో ఇక్కడ చూద్దాం.

చాణక్య నీతి సూత్రాలు
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, ఆర్థికవేత్త. మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను ఆయన బోధించాడు. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ గురించి ఎన్నో సూచనలు చేశాడు. చాణక్యుడి ప్రకారం ఈ ఆరు రకాల వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరట. ఎందుకో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఇతరులపై ఆధారపడే వ్యక్తి
చాణక్యుడి ప్రకారం ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే వ్యక్తి సొంతంగా ఏం చేయలేడు. కొత్తగా ఆలోచించలేడు. వీరు ఏ పని చేయడానికి ఇష్టపడరు. కాబట్టి వీరు ఎప్పటికీ స్వయం సమృద్ధి సాధించలేరు. ఇలాంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
కఠినంగా మాట్లాడేవారు
ఇతరులతో గట్టిగా, కఠినంగా మాట్లాడేవారు క్రమంగా అందరి నమ్మకాన్ని కోల్పోతారు. వీరు ఎప్పుడూ కోపంగానే ఉంటారు. వీరు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా తెలియదు. లక్ష్మీదేవి అలాంటి వారికి దూరంగా ఉంటుంది. దానివల్ల ధన నష్టం కలుగుతుందని చాణక్య నీతి చెబుతోంది.
సోమరితనం ఉన్నవారు
సోమరితనం వ్యక్తికి అతిపెద్ద శత్రువు. సోమరితనం ఉన్నవారు ఏ పని సరిగ్గా చేయరు. పనులను వాయిదా వేస్తుంటారు. అలా చేసేవారు ఎప్పటికీ పురోగతి సాధించలేరు. సోమరితనం వల్ల సమయం, అవకాశాలు రెండూ చేజారిపోతాయి. కాబట్టి వీరు జీవితంలో ఎప్పటికీ ధనవంతులు కాలేరని చాణక్య నీతి చెబుతోంది.
ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవారు
ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవారు చాలామంది ఉంటారు. ఇతరుల విజయం నుంచి స్ఫూర్తి పొందకుండా అసూయ పడేవారు ఎప్పటికీ ముందుకు సాగలేరు. అసూయ మనసును బలహీనపరుస్తుంది. తప్పులు చేసేలా ప్రేరేపిస్తుంది. సంపదకు దూరం చేస్తుందని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు.
అబద్ధాలు చెప్పేవారు
అబద్ధాలు చెప్పేవారు లేదా మోసం చేసేవారు అప్పటికప్పుడు సంతోషంగా ఉన్నా.. లేదా సంపద కూడబెట్టినా అది ఎక్కువ కాలం నిల్వదని చాణక్య నీతి చెబుతోంది. సిరి సంపదలకు మూలమైన లక్ష్మీదేవికి సత్యం, నిజాయతీ ఇష్టం. అబద్దాలు చెప్పేవారు లేదా మోసాలు చేసేవారి దగ్గర ధనం శాశ్వతంగా ఉండదు.
అనవసరంగా ఖర్చు చేసేవారు
చాణక్యుడి ప్రకారం ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేసేవారు ఎప్పటికీ ఆర్థికంగా సురక్షితంగా ఉండలేరు. సంపదకు మార్గం డబ్బును తెలివిగా ఉపయోగించడమేనని చాణక్యుడు బోధించాడు. మనం దాచుకున్న డబ్బే ఆపద కాలంలో ఆదుకుంటుందని ఆయన వివరించాడు.