కాకాని వర్సెస్ కోటంరెడ్డి: జగన్ వద్దకు పంచాయితీ
వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రయత్నాలను ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలోని నేతల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం జగన్ ప్లాన్ చేశారు.
వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లాకు చెందిన నేతల మధ్య నెలకొన్న విభేధాలపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య విభేదాలు రచ్చెకెక్కాయి.
వీరిద్దరి మధ్య, నెలకొన్న విభేదాల కారణంగా ఎండిఓ ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఈ నెల 6వ తేదీన అరెస్టయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఫిర్యాదు చేసింది. తన అనుచరులతో కలిసి తన ఇంటిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడికి పాల్పడినట్టుగా సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు నెల్లూరు పోలీసులు. అదే రోజున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు.బెయిల్‌పై విడుదలైన వెంటనే శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శలు చేశారు. గోవర్ధన్ రెడ్డి అనుచరుడు దగ్గరుంది ఎండిఓ సరళతో తమపై ఫిర్యాదు చేయిండచాడని ఆయన ఆరోపించారు.
తనపై నమోదైన కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయమై కాకాని గోవర్ధన్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరోక్షంగా ఆరోపణలు చేశారు.ఈ వివాదంపై సీఎం జగన్ దృష్టి కేంద్రీకరించారు.
బుధవారం నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సీఎం జగన్ అమరావతికి రావాలని కబురు పంపారు.వీరిద్దరి మధ్యే కాకుండా ఇతర నేతలు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య ఇదే రకమైన పరిస్థితి ఉన్న విషయాన్ని వైసీపీ నాయకత్వం గుర్తించింది.