Holidays : మార్చి 22, 23, 24, 25 నాల్రోజులు సెలవులే సెలవులు... ఎందుకో తెలుసా?
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో వరుసగా నాలుగురోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతోంది.

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటుండటంతో బ్యాకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ఈ వీకెండ్ రెండ్రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి... వీటికి ఈ సమ్మె తోడవుతోంది.
ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ఇలా వరుస సెలవులు, ఉద్యోగ సంఘాల సమ్మె బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెలాఖరున ఉగాది, రంజాన్ పండగలు వస్తున్నాయి... ఆలోపు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు పూర్తిచేయాలని అనుకుంటున్న బ్యాంకులకు ఉద్యోగుల సమ్మె ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ సమ్మెలో కొన్ని బ్యాంకుల ఉద్యోగులు మాత్రమే పాల్గొంటున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు ఈ యూఎఫ్ బియూలో ప్రాతినిధ్యం ఉంది. ఇలా మొత్తంగా ఎనిమిది లక్షలమంది ఉద్యోగులు ఈ యూనియల్ లో ఉన్నారు... వీరంతా మార్చి 24, 25 (సోమ,మంగళవారం) జరిగే సమ్మెలో పాల్గొంటారు. అంతకు ముందు రెండ్రోజులు అంటే మార్చి 22, 23 (శని, ఆదివారం) బ్యాంకులన్నింటికి సెలవులు వస్తున్నారు. 22న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇలా వరుసగా మార్చి 22,23,24,25 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.
బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్స్ ఇవే :
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగులపై పనిభారం ఎక్కువ అవుతోంది. ఖాతాదారులకు తగినట్లుగా ఉద్యోగులను నియమించకపోవడమే ఇందుకు కారణం. అందువల్ల ఈ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్దతిలో కాకుండా శాశ్వత ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
RBIతో సహా మొత్తం ఆర్థిక రంగం ఐదు రోజుల పని విధానాన్ని అనుసరిస్తోంది. ఇదే విధానాన్ని బ్యాంకులకూ వర్తింపచేయాలి. అంటే బ్యాంక్ ఉద్యోగులకు కూడా వారంలో కేవలం ఐదురోజులే విధులు ఉండాలని... రెండ్రోజులు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
బ్యాంక్ సిబ్బంది, అధికారులపై దాడులు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని UFBU డిమాండ్ చేస్తోంది.
ఐడిబిఐ బ్యాంకులో ప్రభుత్వం కనీసం 51 శాతం వాటా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.