- Home
- National
- Tourist Police: తెలంగాణలో తొలిసారి కొత్తగా టూరిజం పోలీస్ వ్యవస్థ, పర్యాటక ప్రదేశాలకు భద్రతే వీరి పని
Tourist Police: తెలంగాణలో తొలిసారి కొత్తగా టూరిజం పోలీస్ వ్యవస్థ, పర్యాటక ప్రదేశాలకు భద్రతే వీరి పని
తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అడుగు వేసింది. ప్రత్యేక పర్యాటక పోలీసు యూనిట్లను (Tourist Police) ప్రారంభించింది. వారు రేపట్నించి తమ విధుల్లో చేరనున్నారు.

తెలంగాణాలో కొత్త పోలీసు వ్యవస్థ
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాల వద్ద భద్రతను పెంచేందుకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రత్యేక పర్యటక పోలీస్ యూనిట్లను ప్రారంభించింది. హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లో 80 మంది సిబ్బందికి తగిన శిక్షణను అందించి మొదటి బ్యాచ్ ను ప్రారంభించారు. పర్యాటకులకు సౌకర్యాలు, వారి రక్షణ, అలాగే పర్యాటక ప్రదేశాల భద్రత వంటివి ఈ పోలీసుల ముఖ్యమైన విధులు.
ఎన్నో పనులు
అనంతగిరి, రామప్ప దేవాలయం, యాదగిరిగుట్ట, పోచంపల్లి, సోమశిల, బుద్ధవనం, భద్రాచలం, హైదరాబాద్ తో సహా తొమ్మిది కమిషనరేట్ల పరిధిలోకి 80 మంది టూరిజం పోలీసులను కేటాయించారు. సందర్శకులను ఒక క్రమ పద్ధతిలో పంపించడం, జన సమూహం ఒకచోట చేరకుండా అడ్డుకోవడం, వారికి కావలసిన సౌకర్యాలను అందించడం ఇలా అన్ని విషయాల్లో పర్యాటక పోలీసులు కీలకపాత్ర పోషిస్తారు.
మిగతా రాష్ట్రాల్లో
పర్యాటక పోలీసు యూనిట్లు ఇప్పటికే కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా... ఇలా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరిపోయింది. ప్రస్తుతం 80 మంది టూరిజం పోలీసులతో మొదలైన ఈ వ్యవస్థ ప్రతి ఏటా ఇంకా పెరిగే అవకాశం ఉంది. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఈ టూరిజం పోలీసు వ్యవస్థలోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లో...
ఈ పర్యాటక పోలీసులు తగిన శిక్షణను తీసుకొని అక్టోబర్ 13 నుంచి తమ కేటాయించిన ప్రదేశాల్లో విధుల్లో చేరుతారు. తెలంగాణలో ఉన్న అనేక టూరిజం ప్రదేశాల్లో ఈ పోలీసులంతా రక్షణగా నిలవనున్నారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు..దాని చుట్టుపక్కల ఉన్న చాలా జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలకు ఈ పోలీసులు రక్షణను అందిస్తారు. హైదరాబాద్ లో చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం వంటివి జాబితాలో ఉన్నాయి.
ఇతర జిల్లాల్లో
ఇతర జిల్లాల విషయానికి వస్తే భువనగిరి కోటకి, కీసరగుట్టలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయానికి, పోచంపల్లి రూరల్ టూరిజం డిస్టినేషన్ కి, ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సుకి, రామప్ప దేవాలయానికి,మేడారం సమ్మక్క సారక్క దేవాలయానికి, పానగల్లు లో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయానికి, నాగర్ కర్నూల్ లో ఉన్న ఆమ్రాబాద్, సోమశిల దేవాలయానికి కూడా పోలీసులు పర్యాటక పోలీసులు రక్షణగా నిలవనున్నారు.