ఇప్పటివరకు ఎవరికీ తెలియని రూల్.. పోలీసు స్టేషన్‌లో మీ ఫోన్‌తో వీడియోలు తీయొచ్చు
Shooting video in police station : అధికారిక రహస్యాల చట్టం 1923 ప్రకారం పోలీస్ స్టేషన్లలో వీడియోలు, ఫోటోలు తీయడం నేరం కాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి, చట్టబద్ధంగా చెప్పాలంటే, పోలీస్ స్టేషన్లలో పోలీసుల వీడియో రికార్డింగ్ లను అనుమతించాల్సి ఉంటుంది.
police station,
Shooting video in police station : దేశంలో పౌరుల రక్షణ, సంఘంలో శాంతిభద్రతలను కాపాడటం కోసం పోలీసు వ్యవస్థ ఉంది. ప్రజల కోసం భారత ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థల్లో ఇది ఒకటి. పోలీసులన్నా, పోలీసు వ్యవస్థలన్నా ఇప్పటికీ చాలా మందిలో భయం ఉంటుంది. ప్రజా రక్షకులు అనే పేరు మాత్రమే కానీ, ఇప్పటివరకు జరిగిన అనేక ఘటనల కారణంగా పోలీసులంటే ఒకరకమైన భయాన్ని ప్రజల్లో సృష్టించారు. ఇక పోలీసు స్టేషన్ అంటే పారిపోయే వారు చాలా మందే ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినా వెళ్లకుండా ఉండే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
అయితే, పోలీసులు స్టేషన్లు, పోలీసులు చట్టాలకు అతీతమైనవి కావనే విషయాలు అట్టడుగు ప్రజల్లోకి ఇంకా వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు, పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసమే అనే విషయం తెలియాలంటే ముందు సామాన్య ప్రజానీకానికి భారత చట్టాల గురించి కూడా కొన్ని విషయాలైనా తెలియాలి. అలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం, పాలకులపై ఉంటుంది.
పోలీసులు స్టేషన్ లోనే అక్కడకు వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఇప్పటివరకు చాలా జరిగాయి. ఇలాంటి సమయంలో ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీస్తే బాధితులపైన కూడా కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. అసలు పోలీసు స్టేషన్ లో ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చా? పోలీసులు దీనికి అనుమతి ఇస్తారా? ఇలా చేయడానికి చట్టబద్దత ఏమైనా కల్పించారా? వీడియోలు తీస్తే తిరిగి పోలీసులు కేసులు పెట్టవచ్చా? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
police station
అధికారిక రహస్యాల చట్టం 1923
పోలీసులు, పోలీస్ స్టేషన్ లు అంటే భయపడవద్దని చాలా సార్లే పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. నిజమే పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు. చట్టం ముందు అందరూ సమానమే. పోలీసు స్టేషన్ లోనే ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఇది ఏలాంటి నేరమూ కాదు. ఇది మనం చెప్పుకుంటున్న విషయం కాదు.. కోర్టులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాయి. దీని కోసం ప్రత్యేక చట్టం కూడా ఉంది. ఇప్పటికే ఇలాంటి కేసులపై కోర్టులు తీర్పులను ఇచ్చాయి. ఇప్పటికీ న్యాయవ్యవస్థ ఈ అంశంపై దృష్టి సారించింది. అధికారిక రహస్యాల చట్టం-1923 (Penalties and Prosecutions Under Official Secrets Act, 1923) ప్రకారం పోలీసు స్టేషన్‌లలో ఫోటోలు, వీడియోలు తీయడం నేరం కాదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి, చట్టపరంగా చెప్పాలంటే, పోలీసు స్టేషన్‌ల లోపల పోలీసుల వీడియో రికార్డింగ్‌లు అనుమతించాలి.
పోలీసు సంభాషణలు కూడా రికార్డు చేయవచ్చా?
అలాగే, పోలీస్ స్టేషన్‌లో సంభాషణలను రికార్డ్ కూడా చేయవచ్చు. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ 'నిషేధించబడిన ప్రదేశం' కాదు కాబట్టి, పోలీస్ స్టేషన్ లోపల వీడియో రికార్డింగ్ చట్టం ప్రకారం నేరం కాదు. అక్కడ పోలీసులతో మాట్లాడే సంభాషణలు కూడా రికార్డు చేయవచ్చు. కానీ, ఇది వారి డ్యూటీకి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదనే విషయాలు కూడా గుర్తించాలి.
పోలీసులు గోప్యత హక్కును లేవనెత్తితే..
ఇక్కడ పోలీసులు తమ గోప్యత హక్కును కూడా ప్రస్తావించవచ్చు. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనకు జీవించే హక్కు, స్వేచ్ఛను హామీ ఇస్తుంది. ఇందులో గోప్యత హక్కు కూడా ఉంది. ఇక్కడ గుర్తించాల్సిన అసలు విషయం ఏమిటంటే ఒక పోలీసు అధికారి గోప్యత హక్కును అనుభవిస్తున్నప్పటికీ, పబ్లిక్ సర్వెంట్‌గా విధుల్లో ఉన్నప్పుడు అతని చర్యలు అటువంటి హక్కు ద్వారా రక్షణ ఉండదు. కాబట్టి పోలీసు అధికారిని వీడియో రికార్డ్ చేయడం అనేది ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కును ఉల్లంఘించినట్లు కాదు.
పోలీసు స్టేషన్ లో వీడియో- బాంబే హైకోర్టు సంచలన తీర్పు
అధికారిక రహస్యాల చట్టం (Penalties and Prosecutions Under Official Secrets Act, 1923) ప్రకారం పోలీస్ స్టేషన్ ను 'నిషేధిత ప్రదేశం'గా గుర్తించలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 2018 లో రెండు పరస్పర సంబంధ వివాదాలను పరిష్కరించడానికి వార్ధాలో జరిగిన చర్చలను రహస్యంగా వీడియో తీసిన ఒక వ్యక్తిపై వార్ధాలో 'గూఢచర్యం' అనే క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు కొట్టివేసింది. బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పు ఇచ్చిన ఈ కేసు వివరాలు గమనిస్తే.. జస్టిస్ మనీష్ పీటాలే, జస్టిస్ వాల్మీకిల ధర్మాసనం తన తీర్పులో అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నిషిద్ధ ప్రాంతాల జాబితాలో పోలీసు స్టేషన్ లేదని తెలిపింది. అందువల్ల అక్కడ వీడియోలు తీయడం నేరం కాదని పేర్కొంది.
పోలీసు స్టేషన్ లో వీడియో.. కోర్టులో నిలబడని పోలీసుల కేసు
మహారాష్ట్రలోని వార్థాకు చెందిన రవీంద్ర ఉపాధ్యాయకు, వారి ఎదురింటి వారికి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వీరు పోలీసు స్టేషన్ కు చేరారు. ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే, వారిద్దరినీ కూర్చోబెట్టి పోలీసు స్టేషన్ లో చర్చలు జరుపుతుండగా దాన్ని ఉపాధ్యాయ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. దాంతో అధికారిక రహస్యాల చట్టం కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కేసు కోర్టుకు చేరగా సంచలన తీర్పు వచ్చింది. కేవలం గూఢచర్యాన్ని నిషేదించాలన్న ఉద్దేశంతో కొన్ని కార్యాలయాలను నిషిద్ధ ప్రాంతాలుగా ఈ చట్టం (Penalties and Prosecutions Under Official Secrets Act, 1923) గుర్తించింది. కాబట్టి అక్కడ ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధం. ఈ చట్టంలోని సెక్షన్ 2(8), సెక్షన్ 3లలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. కానీ, ఈ జాబితాలో పోలీసు స్టేషన్ లు లేవు. కాబట్టి అక్కడ వీడియోలు తీయడం నేరం కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. కేసును కొట్టివేసింది.
భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏం చెబుతోంది?
భారత న్యాయ వ్యవస్థలో కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSSS) ప్రకారం పోలీసు స్టేషన్లలో సోదాలు, స్వాధీనాలు జరుగుతున్నప్పుడు ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో వీడియో తీయడం తప్పనిసరి. ఈ నిబంధన పోలీసు దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ వీడియో తీయడం కోసం అనుసరించాల్సిన ప్రామాణిక పద్ధతులు చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.