విజయ్ ‘విజిల్’ తెలుగు రివ్యూ..!
తెలుగు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని,విజయంతో విజిల్ వెయ్యాలని గత కొంతకాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అయితే అతనికి సూర్య,కార్తిలకు వచ్చినట్లుగా డిమాండ్ రాలేదు.
(Review By ---సూర్య ప్రకాష్ జోశ్యుల) తెలుగు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని,విజయంతో విజిల్ వెయ్యాలని గత కొంతకాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అయితే అతనికి సూర్య,కార్తిలకు వచ్చినట్లుగా డిమాండ్ రాలేదు. దానికి తోడు తెరపై అతను చేసే మాస్ విన్యాసాలు, స్టైల్స్ అన్ని మన హీరోలు ఇక్కడ ట్రై చేసేవే కావటంతో ఇక్కడెవరూ లెక్కేయటంలేదు. అయితే తుపాకి, సర్కార్, అదిరింది చిత్రాల నుంచి అతని జాతకం మారింది. మెల్లిగా మనవాళ్ళూ ఈ పట్టువదలని విక్రమార్కుడుకి అలవాటు పడుతున్నారు. ఈ విషయం గమనించి ఈ సారి మరింత భారీగా తెలుగులో తన సినిమా రిలీజ్ పెట్టుకున్నాడు. పోటీగా మార్కెట్ లో సినిమాలు కూడా లేవు. ట్రైలర్స్ బాగున్నాయి. దాంతో ఓ వర్గంలో ఈ సినిమాపై ఇంట్రస్ట్ ఏర్పడింది. ఈ ఇంట్రస్ట్ ని క్యాష్ చేసుకునేలా సినిమా ఉందా. అసలు సినిమాలో కథ ఏంటి...ఈ సినిమాతో అయినా తెలుగులో పాతుకు పోతాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి : మైఖేల్ (విజయ్) ఇప్పుడంటే పెద్ద రౌడీ,పేద జనాల రక్షకుడు కానీ ఒకప్పుడు టాలెంట్ ఉన్న స్టేట్ లెవిల్ ఫుట్ బాల్ ప్లేయర్. కానీ అతని తండ్రి (మళ్లీ విజయ్) ఒక క్రిమినల్ బ్యాక్ డ్రాప్ ఉన్న వాడు అవ్వడం వల్ల అతని సెలక్షన్ కమిటీ పక్కన పెట్టేస్తారు. ఏడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు అతనికి తిరిగి తన లైఫ్ ని ట్రాక్ లో పెట్టుకోవడానికి, తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఫీల్డ్ లోకి మళ్లీ వెళ్లటానికి ఓ చిన్న అవకాసం వస్తుంది. తన స్నేహితుడు ఉమెన్స్ ఫుట్ బాల్ టీమ్ కోచ్ కథిర్ తీవ్రంగా గాయపడతాడు. దాంతో మైకల్ అలియాస్ విజిల్ రంగంలోకి దిగుతాడు. సమాజంలో వెనకబడిన తరగతి నుంచి వచ్చిన అమ్మాయిల ఫుట్ బాల్ టీమ్ కు కోచ్ గా మారతాడు. ఆ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
మొదట అతని క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి, కోచింగ్ తీసుకునే అమ్మాయిలు సైతం ఏక్సెప్ట్ చేయరు. అయితే ఎలాగైనా ఆ టీమ్ ని గెలిపించాలనేది మైఖైల్ జీవితాశయం గా పెట్టుకుని కృషి చేస్తాడు. అందుకు కారణం తన తండ్రి కి ఇచ్చిన ఓ మాట..తండ్రి కల. ఇంతకీ అతను తండ్రి రాయప్పన్ (విజయ్) ఎవరు...ఆయన కోరిక ఏమిటి...ఫుట్ బాల్ ప్లేయర్ అయిన మైఖేల్ ఎందుకు క్రైమ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ కథలో జాకీ ష్రాప్ పాత్ర ఏమిటి...నయనతార తో మైఖేల్ కు ఉన్న రిలేషన్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
చెక్ దే విజిల్ : షారూఖ్ ఖాన్ చెక్ దే ఇండియా సినిమా చూసిన వాళ్లకు ఈ సినిమా పెద్ద కొత్తగా అనిపించదు. ఇది ఆ సినిమాకు మాస్ ,కమర్షియల్ వెర్షన్. అయితే డైరక్టర్ చేసిన పని ఏంటీ అంటే బ్యాక్ డ్రాప్ మార్చటం. అక్కడ ఓ ట్రైనెడ్ ప్లేయర్ గా తను చేయలేకపోయింది...కోచ్ గా మారి,చేసి చూపెడతాడు. ఇక్కడ విజిల్ కూడా అదే చేస్తాడు కానీ తన తండ్రి కలను నెరవేర్చటానికి చేస్తాడు. మైకెల్ ...ఓ ఉమెన్ ఫుట్ బాల్ టీమ్ ని అన్ని అడ్డంకులు ఎదుర్కొని ఎలా నిలదొక్కుకుని గెలిచేలా చేసాడనేది ప్రధానంగా కథని నడిపిస్తాడు.
ఇదే ఫిలాసఫీ : తెలుగు వాళ్లు మొదట నుంచీ తమిళ సినిమాలను డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో ఆదరిస్తూనే ఉన్నారు. అయితే విభిన్నమైన ప్రయోగాలు, కొత్త తరహా కథ,కథనం ఉన్న సినిమాలకే ఓటేస్తూ వచ్చారు. లేకపోతే ఈ మాత్రం మావాళ్లూ తీయగలరు అంటూ తిప్పి కొట్టారు. అది కొందరు హీరోలకు కలిసొస్తే, మరికొందరకు ఇక్కడ మార్కెట్ లేకుండా చేసింది. అయితే విజయ్...ఒక్క సినిమాతోనే వెనక్కి వెళ్లే రకం కాదు.ఇక్కడ మార్కెట్ దక్కే దాకా పోరాడేటట్లు ఉన్నాడు.
మూడు గంటలు సేపు, ఈ సినిమాలో విజయ్ ని చూస్తూ,ఫుట్ బాల్ మ్యాచెస్ ని తిలకిస్తూ మనం తెలుసుకునేదేమిటీ అంటే ...జీవితం ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లాంటిది, నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు, నువ్వెవరవు వంటి వంటివి వదిలేసి, గేమ్ ని గెలవటానికే పోరాడాలి. అది విజయ్..తెలుగు మార్కెట్ లో నిలదొక్కుకోవటానికి అనుసరిస్తున్న ఫిలాసపీనే అనిపిస్తుంది.
ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ కేకే : విజిల్ మొదట అరగంట రొటీన్ కమర్షియల్ సినిమా లాగానే... ఫ్యాన్స్ కు పండగ చేసే మ్యానరిజమ్స్ తో మాటలు,పాటలతో సాగుతుంది. కథలో పెద్ద కదిలిక ఉండదు. ఎప్పుడైతే విజయ్ ...తండ్రి రాయప్ప పాత్రలో కనపడతాడో అప్పుడు కథలో ఇంటెన్సిటీ మొదలవుతుంది. ఆ పాత్రే కథకు నిండుతనంతెస్తుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఎపిసోడ్స్ లో అది మరింత పెరుగుతుంది. అయితే ఇలాంటివి చాలా చూసి ఉండటంతో ...ఇంటర్వెల్ దాకా ఏమీ జరిగినట్లు ఉండదు. ప్లాట్ గానే ఉన్నట్లుంటుంది.
ఇక సెకండాఫ్ లో కథ మొత్తం పెట్టుకున్నాడు. అయితే స్పోర్ట్స్ టీమ్ ఇబ్బందులు పడటం, కొత్తగా వచ్చిన కోచ్ ని ద్వేషించటం...ఆ తర్వాత మోటివేషన్ సాంగ్, అండర్ డాన్ విన్ అవటం వంటి టిపికల్ స్పోర్ట్స్ డ్రామా థీమ్ రన్ అవుతుంది. స్పోర్ట్స్ డ్రామాలు రెగ్యులర్ గా చూసేవాళ్లకు చాలా ప్రెడిక్టుబుల్ గా ఉంటుంది. అయితే ఆన్ పీల్డ్ ఫుట్ బాల్ మ్యాచెస్ ని చూపెట్టడమే కాకుండా సమాజంలో ఉన్న కొన్ని బర్నింగ్ ఇష్యూలను టచ్ చేస్తూ కొంతలో కొంత కలిసొచ్చింది.
డైరక్టర్ తో సహా మిగతా వాళ్లెలా.. : విజయ్ కు ఉన్న లార్జెన్ దేన్ లైఫ్ ఇమేజ్ ని డైరక్టర్ బాగా ఉపయోగించుకున్నాడు. హీరోయిజం ఎలివేషన్, మాస్ మ్యానరిజమ్స్ పై డైరక్టర్ బాగా దృష్టి పెట్టారు. విజయ్ విషయానికి వస్తే డిఫరెంట్ వేరియేషన్స్ తో అదరకొట్టాడు. నయనతార డీసెంట్ గా ఉంది. వివేక్ కామెడీ పెద్ద గొప్పగా లేదు. మిగతా వాళ్లకు విజయ్ పెద్దగా అవకాసం ఇవ్వలేదు.
టెక్నికల్ గా ..: సంగీతం , బీజిఎం విషయాలలో ఎఆర్ రహమాన్ ని కొట్టినవాళ్లు లేరు. అది మరొకసారి ప్రూవ్ అయ్యింది. డైరక్టర్ గా అట్లీ బ్రహ్మాండమైన షాట్స్ తో తన మార్క్ ని చూపించాడు. కథ, స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుండి ఉండి ఉంటే , అట్లీ దర్శకత్వ ప్రతిభ మరింత రాణించేది. దానికి తోడు సినిమా లెంగ్త్ ఇబ్బందిపెడుతుంది. మూడు గంటల సేపు సినిమా ని చూడటం అంటే కష్టమనిస్తుంది. లెంగ్త్ విషయంలో ఎడిటర్ చూసుకోవాల్సింది. కెమెరా వర్క్ టాప్ గా ఉంది విజయ్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చే ఈ సినిమా కామన్ ఆడియన్స్ కు అంతగా కిక్ ఇస్తుందా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్ : స్పోర్ట్స్ డ్రామాకు పగ,ప్రతీకారం కలిపితే తయారైన కాక్ టెయిల్
Rating: 2.5/5