విక్కీ కౌశల్ ‘సర్దార్ ఉద్ధం’ మూవీ రివ్యూ: ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన మన గాయాల చరిత్ర...
ఇండియాకి స్వాతంత్య్రం ఎలా వచ్చిందని, ఇప్పటి కుర్రాళ్లను ఎవ్వరిని అడిగినా, మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేశాడు, ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు.. అంటూ ఇలా చాలా సింపుల్‌గా చెప్పేస్తారు చాలామంది. అయితే బ్రిటీషోడి నిరంకుశ పాలనకు ఎదురుతిరిగి, ప్రాణాలొడ్డి పోరాడిన నిజమైన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం గురించి చాలామందికి తెలీదు. అలాంటివారిలో ఒకడు ఉద్ధం సింగ్...
ఉద్ధం సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మూవీ ‘సర్దార్ ఉద్ధం’. బాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ బయోపిక్‌లలో ఒకడిగా నిలిచిపోతుంది ఈ సినిమా. ఎందుకంటే భగత్ సింగ్ స్ఫూర్తితో భారత దేశ స్వాతంత్య్రాన్ని కాక్షించే ఓ పంజాబీ యువకుడు, లండన్‌కి వెళ్లి అక్కడే వారి దేశంలోనే ఓ అధికారిని కాల్చేశాడు అనే పాయింట్‌ను చాలా ఈజీగా చెప్పేయొచ్చు...
కానీ ఆ పని చేయడానికి ముందు అతను చేసిన ప్రతీ పనిని చాలా వివరంగా, ఎంతో శ్రద్ధగా ప్రతీ చిన్న విషయాన్ని వాస్తవికతకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్...
బుల్లెట్ గాయాలు, రక్తం, ఎటుచూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న శవాల గుట్టలు, కాళ్లు తెగిపడి, చేతులు విరిగిపడి... తనవారిని కాపాడమని, గుక్కెడు నీళ్లు పోసి గొంతు తడపమని వేడుకునే ఆర్తనాదాలు, ప్రాణం ఉన్నా, కళ్ల ముందే తనవారి ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత... బాధ, మనస్ఫూర్తిగా ఏడవడానికి వీలులేని పరిస్థితి... చరిత్ర పుటల్లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోని, ‘జలియన్‌వాలా బాగ్’ ఇలాగే జరిగి ఉంటుందేమో... కాదు, ఇలాగే జరిగి ఉంటుంది...
జలియన్‌వాలా బాగ్ అంటే చిన్నప్పుడు స్కూల్‌లో పాఠ్యాంశాల్లో చదివిన ఓ పాఠంగానే చాలామందికి తెలుసు. అక్కడ జరిగిన హృదయవిదారక దృశ్యాలను తెరపై కళ్లకు కట్టినట్టుగా ఆవిష్కరించారీ సినిమాలో...
ముఖ్యంగా విక్కీ విశాల్ కెరీర్‌లో ఇదో మైలురాయి. ముఖ్యంగా జలియన్‌వాలా బాగ్ ఎపిసోడ్‌లో అతని నటనకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే.
ఓ గొప్ప సినిమా తీయాలనుకున్నప్పుడు దానికి అనవసరమైన డ్రామా జత చేయాల్సిన అవసరమే లేదు. డ్యూయెట్లు, ఫైట్లు ఉంటేనే హీరోయిజం పండుతుందనేది కూడా నిజం కాదు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా రితేశా డైలాగ్స్, సూర్‌జిత్ షా డైరక్షన్ తాము అనుకున్నదానిపై తెరపై ఆవిష్కరించారు...
ఈ సినిమా చేయడానికి 21 ఏళ్ల ఎదురుచూశాడట డైరెక్టర్ సూజిత్ సర్కార్... తన డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ కోసం ఆయన చేసిన కృషి, రీసెర్చ్... ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది...
ముఖ్యంగా సినిమా సాగుతున్నంతతోపు వినిపించే శాంతాను మోయిత్రా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తుంది... సినిమాలో ఏ పాత్రను తక్కువ చేయడానికి లేదు, ప్రతీ ఒక్కరూ తమ క్యారెక్టర్‌లో జీవించేశారు. పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్రయర్ పాత్రలో నటించిన షాన్ స్కాట్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
అడల్ట్ కామెడీ, రొమాన్స్ పాటలు, ఐటెమ్ సాంగ్స్, కొడితే గాల్లోకి లేచి పడిపోయే ఫైట్స్, ఛేజింగ్ సీన్స్... ఇలాంటి సన్నివేశాలు ఉంటేనే సినిమాలు చూసేవారికి ఈ సినిమా ఏ మాత్రం నచ్చదు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమా చూసేవారికి కూడా ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది టైమ్ పాస్ మూవీ కాదు, మనకే తెలియని మన చరిత్ర...
లాస్ట్ బట్ నాట్ లీస్ట్: ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, నాలాగే మీకు అనిపించొచ్చు... ఇలాంటి సినిమా మన తెలుగు హీరోలు ఎందుకు తీయరు? అని!... ఒక్క ‘బాహుబలి’ తీసి, బాలీవుడ్ సినిమాలపై విమర్శలు చేసే టాలీవుడ్ జనాలకు, ఓ మాస్టర్ పీస్‌తో సమాధానం ఇచ్చాడు సూజీత్...