True Lover Review: `ట్రూ లవర్` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్..
`జైభీమ్`లో మెప్పించిన మణికందన్, `మ్యాడ్`తో అలరించిన గౌరీ ప్రియా జంటగా నటించిన `ట్రూ లవర్` మూవీ నేడు విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కంటెంట్ బాగుంటే, సినిమా ఆకట్టుకునేలా ఉంటే ఇటీవల కాలంలో తెలుగు ఆడియెన్స్ ఏ భాషా మూవీనైనా ఆదరిస్తున్నారు. `కేజీఎఫ్`, `కాంతార`, `లవ్ టుడే`, `2018` చిత్రాలే అందుకు నిదర్శనం. అలా ఇప్పుడు మరో మూవీ వస్తోంది. తమిళంలో రూపొందిన `లవర్` అనే మూవీని `ట్రూ లవర్` పేరుతో తెలుగులో విడుదల చేశారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్‌కేఎన్, మారుతి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. `జైభీమ్` షేమ్ మణికందన్, `మ్యాడ్` ఫేమ్ గౌరిప్రియా జంటగా నటించారు. ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు శనివారం(ఫిబ్రవరి 10)న విడుదలైంది. ట్రెండీ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది చూద్దాం.
కథః
అరుణ్(మణికందన్), దివ్య(గౌరీ ప్రియా) ఇద్దరు ఆరేళ్లుగా ప్రేమించుకుంటారు. కాలేజీ నుంచి ప్రేమ కొనసాగుతుంది. ఆ తర్వాత దివ్య సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటుంది. అరుణ్ కాఫీ షాప్ పెట్టాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో తాగుతూ ఉంటాడు. తన లవర్‌పై అనుమానం ఎక్కువ. ఎవరితోనూ క్లోజ్‌గా మూవ్ అయినా తట్టుకోలేడు. వారికి దగ్గరవుతుందనే అభద్రతా భావంలో ఉంటాడు. ఈ క్రమంలో తరచూ ఈ ఇద్దరి మధ్య గొడవలు అవుతుంటాయి. మరి ఎవరో ఒకరు తగ్గి సెట్ చేసుకుంటారు. మళ్లీ కలుస్తారు. మళ్లీ మళ్లీ ఇది జరుగుతుంది. ఒకానొక దశలో దివ్య విసిగిపోయి అరుణ్‌కి బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. అంతలోనే ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్‌కి వెళ్తారు. మరి అక్కడ ఏం జరిగింది? ఆ ట్రిప్ వారిని విడదీసిందా? కలిపిందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
లవ్ స్టోరీల ట్రెండ్ మారింది. చాలా బోల్డ్ కంటెంట్‌ని, ట్రెండీ కంటెంట్‌ని ఇష్టపడుతున్నారు నేటి ఆడియెన్స్. సినిమా చూసే ఆడియెన్స్ చాలా వరకు యూత్ కావడంతో ఆయా సబ్జెక్ట్ లు చాలా వరకు చెలామణి అవుతున్నాయి. ఆకట్టుకునేలా తీస్తే కచ్చితంగా విజయాలు సాధిస్తున్నాయి. `బేబీ` విజయమే అందుకు ఉదాహరణ. `మ్యాడ్` లాంటి యూత్‌ఫుల్ మూవీస్ కూడా బాగా ఆడాయి. ఈ నేపథ్యంలో లవర్స్ కంటెంట్‌తో, సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్‌లో `ట్రూ లవర్` అనే మూవీని తెరకెక్కించారు. తమిళంలో రూపొందిన ఈ మూవీని తెలుగులో డబ్ చేశారు. అయితే ఈ మూవీ కూడా యూత్‌ఫుల్‌గా తెరకెక్కింది. పైగా ట్రెండీ అంశాలతోనే రూపొందించారు. యూత్‌ని టార్గెట్ చేస్తూ చేసిన కథ. అదే సమయంలో రియలిస్టిక్‌గానూ ఉంటుంది. సాఫ్ట్ వేర్, లేదంటే సిటీ కల్చర్ బేస్డ్ లవ్ స్టోరీగా చెప్పొచ్చు. అందులో లవ్, ఇన్‌సెక్యూరిటీ, గొడవలు, బ్రేకప్‌లు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ మూవీలోనూ అవే మెయిన్ ఎలిమెంట్లు.
`ట్రూ లవర్` సినిమాలో మెయిన్‌గా యూత్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా సీన్లు రాసుకున్నారు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, అనుమానాలు, ఆమెని లొకేషన్ పంపమని అడగడం, ఏ అబ్బాయితోనూ కాస్త క్లోజ్‌గా కనిపించినా అనుమానించడం, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడమనేది నేటి కాలేజ్ చదువుకునే యూత్‌కి, ఇప్పుడిప్పుడే కాలేజ్ అయిపోయి జాబ్‌లో సెటిల్ అవుతున్న వారికి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వారి రియల్ లైఫ్‌లోనూ అలాంటి సంఘటనలు జరగడమో, చూడటమో చేస్తారు. అందుకే అవి బాగా రిలవెంట్‌గా ఉంటాయి. ఆయా సీన్లు క్రేజీగానూ ఉంటాయి. లవర్ మరో వ్యక్తితో ఉన్నప్పుడు ప్రియుడిలో వచ్చే జెలసీ చూస్తే థియేటర్లలో ఈటలు పడతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీనికితో లవ్, బ్రేకప్, గొడవలు పడటం వంటి సీన్లు కూడా మస్త్ మజా అనిపిస్తుంటాయి. సీన్ల వైజ్‌గా బాగా ఆకట్టుకుంటుంది. కానీ కథ పరంగా మాత్రం కాస్త రొటీన్‌గానే అనిపిస్తుంది.
స్లో నెరేషన్, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లకి సంబంధించి డిటెయిలింగ్‌కి చెప్పే క్రమంలో కథ ముందుకు సాగదు, అవి బోర్ తెప్పిస్తాయి. దీనికితోడు ఎంతసేపు ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా చూపించడంతో రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఎంతసేపు లవర్ ద్యాసలోనే ఉండటం, నిత్యం స్మోక్ చేయడం కూడా కూడా ఓవర్‌గా అనిపిస్తుంది. ఈ సీన్లన్నీ సినిమాకి మెయిన్ డ్రా బ్యాక్‌గా చెప్పొచ్చు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగానే ఈ మూవీని మలిచాడు దర్శకుడు ప్రభు రామ్‌వ్యాస్. అయితే ప్రేమలో నమ్మకం లేకపోతే అనుమానం రాజ్యమేలుతుందని చెప్పడమనేది ఇందులో మెయిన్ పాయింట్. అదే సమయంలో నమ్మకం ఉంటే అనుమానాలకు తావుండదని, ఎవరిది ఏ లవ్వో తెల్చుకునే పరోక్ష సందేశం కూడా ఈ మూవీ ఇస్తుంది. అదే సమయంలో హీరో, ఆయన తల్లికి మధ్య వచ్చే సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి.
నటీనటులు, టెక్నీషియన్లుః
మణికందన్ మంచి నటుడు. మరోసారి ఇందులో ఓ రస్టిక్ రోల్‌లో మెప్పించారు. `జైభీమ్` తర్వాత మరో బలమైన పాత్ర పడింది. జెలసీ చెందే లవర్‌గా చాలా నేచురల్‌గా చేశాడు మణికందన్. మరోవైపు ఆయన ప్రియురాలిగా గౌరీ కూడా అంతే బాగా మెప్పించింది. అందంతోనూ ఆకట్టుకుంది. నటనతోనూ అలరించింది. తనకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు. వీరి నటన చాలా నేచురల్‌గా ఉంది. వీరికి ఫ్రెండ్స్ కూడా అంతే సహజంగా చేశారు. మ్యూజిక్ బాగుంది. సినిమాని స్మూత్‌గా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది. ఎడిటింగ్ పరంగా కేర్ తీసుకోవాలి. విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. దర్శకుడు కొత్త అయినా ఫర్వాలేదనిపించాడు. కాకపోతే బలంగా కథను రాసుకోలేకపోయాడు. కేవలం యూత్‌ని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా ఆయా సీన్లని మాత్రమే బాగా రాసుకున్నాడు. మిగిలిన ఎలిమెంట్లని గాలికొదిలేశాడు. ఆ విషయంలో కేర్ తీసుకుంటే ఫలితం బాగుండేది.
ఫైనల్‌గాః `ట్రూ లవర్` టార్గెట్ కేవలం యూతే.
రేటింగ్‌ః 2.75
నటీనటులు: మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్న రవి, హరీష్ కుమర్, నిఖిల శంకర్ తదితరులు.
రచన, దర్వకత్వం: ప్రభు రామ్ వ్యాస్
నిర్మాతలు: హరీష్, యువరాజ్
మ్యూజిక్: సీన్ రోల్డన్,
సినిమాటోగ్రఫి: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: భరత్ విక్రమన్.